రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈరోజు టీజర్ ను విడుదల చేశారు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1:15 నిమిషాల నిడివి కలిగి ఉంది.
‘సినిమాకెందుకు తీసుకెళ్ళావ్.. పిల్లాడిని ఇలా పాడు చేసి పెట్టావ్’ అంటూ సీనియర్ నటి తులసి శివమణి పలికే డైలాగ్ తో టీజర్ మొదలైంది. హీరో తండ్రిగా రావు రమేష్ నటించినట్టు స్పష్టమవుతుంది. ఇందులో హీరో రామ్ సాగర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అతను సినిమాలో ఆంధ్రా కింగ్ సూర్యకి(ఉపేంద్ర) వీరాభిమాని అని తెలుస్తుంది. గోదావరి నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ సినిమాపై వ్యామోహం ఉండే జనాలు ఎక్కువ.
అంతేకాదు అభిమాన హీరోలను సొంత ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా భావిస్తారు. అలాంటి ఓ అభిమాని పాత్రనే రామ్ పోషించినట్లు స్పష్టమవుతుంది. ఆ హీరో కోసమే కాలేజీలో వేరే హీరోల అభిమానులతో గొడవలు. మధ్యలో అతని ప్రేమ కథ. చివరికి హీరోకి తనలాంటి అభిమాని ఉన్నాడు, అలాంటి అభిమాని ఊరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? వంటి ప్రశ్నలకు రేకెత్తిస్తూ టీజర్ ను కట్ చేశారు.
కానీ టీజర్లో ఉపేంద్రని చూపించలేదు. మొత్తానికి టీజర్ చూస్తుంటే… మనకి పూరీ జగన్నాథ్ తీసిన ‘నేనింతే’, తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక విచిత్రం’ వంటి సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి. కానీ నేపథ్యం గోదావరి కావడంతో ఆసక్తిని కలిగించే అంశం. టీజర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రామ్ లుక్స్ బాగున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి: