Anger Tales Review in Telugu: యాంగర్ టేల్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వెంకటేష్ మహా, సుహాస్, (Hero)
  • బిందుమాధవి (Heroine)
  • రవీంద్ర విజయ్, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు.. (Cast)
  • ప్రభల తిలక్ (Director)
  • శ్రీధర్ రెడ్డి - సుహాస్ (Producer)
  • స్మరణ్ సాయి (Music)
  • అమర్ దీప్, వినోద్ కె.బంగారి, వెంకర్ ఆర్.శాఖమూరి, ఏ.జె.ఆరోన్ (Cinematography)
  • Release Date : మార్చి 10, 2023

తెలుగులో వెబ్ సిరీస్ ల వెల్లువ కొత్త కాదు. లాక్ డౌన్ లో మొదలైన ఈ హల్ చల్ ఇప్పుడు ప్రతి శుక్రవారం కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి ఈ “యాంగర్ టేల్స్” మీద పెద్ద ఆసక్తి లేదు జనాలకి, కానీ.. ఇటీవల దర్శకుడు వెంకటేష్ మహా “కేజీఎఫ్” సినిమా విషయంలో చేసిన కామెంట్స్, ఈ సిరీస్ లో అతను ఒక ఎపిసోడ్ లో కీలకపాత్ర పోషించడం వంటి కారణంగా ఈ సిరీస్ కి ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. నాలుగు కథల యాంధాలజీగా రూపొందిన ఈ సిరీస్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

బెనిఫిట్ షో:  ఇది ప్రతి సగటు సినిమా అభిమాని కనెక్ట్ అయ్యే కథ. ఓ మారుమూల గ్రామంలో తమ హీరో సినిమాకి బెనిఫిట్ షో ప్లాన్ చేసి.. అభిమానులందరితో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటాడు రంగా (వెంకటేష్ మహా). సదరు షో చెప్పిన టైమ్ కంటే లేట్ గా పడడంతో.. లోకల్ పొలిటీషియన్ (సుహాస్)తో పందెం కాసి దారుణంగా ఓడిపోతాడు. ఏమిటా పందెం? ఓడిపోయిన రంగాకు ఏం జరిగింది? అనేది ఈ ఎపిసోడ్ మూల కథ.

ఈ ఎపిసోడ్ లో ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా వెంకటేష్ మహా నటన చాలా సహజంగా ఉంది. చాలామంది హీరోల ఫ్యాన్స్ & ఫ్యాన్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ ఈ పాత్రలో తమను తాము చూసుకుంటారు. సుహాస్ నటన ఎపిసోడ్ ను మరింత రక్తి కట్టించింది. చాలా తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ.. తన బాడీ లాంగ్వేజ్ & డైలాగ్ డెలివరీతో విశేషంగా అలరించాడు.

ఫుడ్ ఫెస్టివల్: ఒక వెజిటేరియన్ ఫ్యామిలీలో తన ఆరోగ్యానికి ఎంతో అవసరమైన గుడ్డు తినడానికి నానా తంటాలు పడే పూజా (మడోన్నా సెబాస్టియన్).. ఒకానొక సందర్భంలో కోపంతో ఏం చేసింది? అనేది ఈ రెండో ఎపిసోడ్ కథాంశం. తరుణ్ భాస్కర్ సహజంగా కనిపించినప్పటికీ.. మడోన్నా సెబాస్టియన్ స్క్రీన్ ప్రెజన్స్ ముందు అతను ఎలివేట్ అవ్వలేకపోయాడు. మడోన్నా చక్కని నటి.. అయితే ఆమె పాత్రకు కాస్త క్రెడిబిలిటీ ఉండి ఉంటే బాగుండేది.

ఎన్ ఆఫ్టర్నూన్ న్యాప్: ఓ సాధారణ గృహిణి రాధ (బిందుమాధవి), ఉదయాన్నే భర్తకు బాక్స్ కట్టి, తర్వాత కుట్టు మెషీన్ తో పాట్లు పడి.. మధ్యాహ్నం పూట ఒక గంట కునుకు తీసి.. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే భర్త కోసం వంటలు చేయడమే పనిగా బ్రతికేస్తుంటుంది. కానీ.. ఇంటి ఓనర్ పొమ్మనలేక పొగపెట్టినట్లు.. సరిగ్గా రాధ పడుకొనే సమయానికి మెట్ల మీద కూర్చుని పెద్దగా నవ్వుతూ కబుర్లు చెప్పడం మొదలెడుతుంది. దాంతో.. రాధ రెగ్యులర్ నిద్ర పాడయ్యి, తలపోటు మొదలవుతుంది. ఇదంతా తట్టుకోలేని రాధ ఏం చేసింది? అనేది మూడో ఎపిసోడ్ కథ.

బిందు మాధవి, రవీంద్ర విజయ్ లు ఈ సిరీస్ కు సరిగ్గా సరిపోయారు. మిడిల్ క్లాస్ ఆలుమగలుగా వారి మ్యానరిజాలు, బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి. ఈ ఎపిసోడ్ ఎండింగ్ కూడా బాగుంది.

హెల్మెట్ హెడ్: బట్టతల కారణంగా మంచి సంబంధం కుదరక, కెరీర్ లో ఎదుగుదల లేక నానా ఇబ్బందులూ పడుతుంటాడు గిరిధర్ (ఫణి ఆచార్య). హెల్మెట్ పెట్టుకోవడం వల్లనే తనకు బట్టతల వస్తుందని.. వేలకు వేలు ఫైన్ కడతాడే కానీ, హెల్మెట్ మాత్రం పెట్టుకోడు. మరి గిరిధర్ జీవితంలో అతని కోపం ఎలాంటి పరిస్థితికి దారి తీసింది? అనేది సిరీస్ చూసి తెలుసుకోండి.

బట్టతలతో బాధపడే యువకుడిగా ఫణి ఆచార్య ఒదిగిపోయాడు. కానీ.. అదేదో అంతర్జాతీయ సమస్యలా ఎలివేట్ చేసిన విధానం మాత్రం కనెక్ట్ అవ్వదు. అలాగే.. క్లైమాక్స్ లో ఇచ్చిన జస్టిఫికేషన్ కూడా అంతంతమాత్రంగానే ఉంది.

సాంకేతిక వర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ అమర్ దీప్, వినోద్ కె.బంగారి, వెంకర్ ఆర్.శాఖమూరి, ఏ.జె.ఆరోన్ లు ఈ సిరీస్ కు తమ బెస్ట్ ఇచ్చారు. లిమిటెడ్ స్పేస్ & తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చారు. స్మరణ్ సాయి సంగీతం పర్వాలేదనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ప్రొజెక్ట్ కు తగ్గట్లుగా ఉంది.

దర్శకుడు ప్రభాల తిలక్ భారీ యాంబిషన్ తో కాకుండా.. సింపుల్ సెన్సిబిలిటీస్ తో ఈ సిరీస్ ను రాసుకున్న విధానం ప్రశంసనీయం. అయితే.. అన్నీ సెన్సిబిలిటీస్ అందరికీ కనెక్ట్ అయ్యేలా రాసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో మాత్రం తిలక్ గాడి తప్పాడు. బెనిఫిట్ షో & ఆఫ్టర్నూన్ న్యాప్ ఎపిసోడ్స్ వరకూ పర్వాలేదు కానీ..

ఫుడ్ ఫెస్టివల్ & హెల్మెట్ హెడ్ కథలు ఎలివేట్ చేసిన విధానంలో కనెక్టివిటీ మిస్ అయ్యింది. టేకింగ్ మీదకంటే.. రైటింగ్ మీద ఇంకాస్త ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి ఉంటే బాగుండేది.

విశ్లేషణ: ఒక మనిషి కోపంతో చేసే పనులు.. అతడి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయి అనేది ప్రధానాంశంగా తెరకెక్కిన సిరీస్ “యాంగర్ టేల్స్”. నాలుగు ఎపిసోడ్ల ఈ సిరీస్ లో రెండు కథలు ఆకట్టుకోగా.. రెండు కథలు అర్ధం లేకుండా ముగుస్తాయి. ఓవరాల్ గా.. టైమ్ పాస్ కోసం ఒకసారి కాస్త ఓపిగ్గా చూడదగ్గ సిరీస్ ఇది.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus