ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేశారు.. ఇప్పుడు తొమ్మిదో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. చేసిన సినిమాలన్నీ హిట్.. రాబోతున్న సినిమాకు హిట్ వైబ్ కనిపిస్తోంది. ఆ లెక్కన చేసిన 9 సినిమాలు హిట్‌లు కొట్టి 100 శాతం స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నారు. ఈ సినిమాల విడుదల క్రమంలో ఆయన చేసే ప్రమోషన్, వాడే స్ట్రాటజీలు కొత్తగా ఉంటాయి. ప్రమోషన్స్, మార్కెటింగ్ విషయంలో అనిల్‌ని కొట్టేవాడే లేడు అని అంటారు కూడా. చూడటానికి హీరోలా ఉండటంతో హీరో అయిపోండి అని కూడా అంటుంటారు కొందరు. దీనిపై ఆయన ఇటీవల చిన్న క్లారిటీ ఇచ్చారు.
సినిమాలు తెరకెక్కించడంలో, వాటిని ప్రచారం చేసుకోవడంలో అనిల్ రావిపూడి చలాకీతనమే ఆ మాటను అందరూ అడగటానికి కారణం. డ్యాన్స్ బాగా వచ్చి ఉండటం ఈ మాటలు అనడానికి మరో కారణం. ఆయన కొత్త సినిమా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’లోని మెగా విక్టరీ సాంగ్ లాంచ్ ఇటీవల గుంటూరులో జరిగింది. ఆయన చదువుకున్న విజ్ఞాన్ కాలేజీలోనే ఆ పాటను లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే యాంకర్ ‘మీరు హీరో అవ్వొచ్చుగా’ అనేలా మాట్లాడారు.
దానికి ఆయన మనం సక్సెస్ ట్రాక్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. వాటిని పట్టించుకుని పక్కకు వెళ్లామా ఇక అంతే సంగతులు అని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పట్లో ఆ ఆలోచన లేదని చెప్పారు. దీంతో తన గురించి, తన టాలెంట్ గురించి, కెరీర్ గురించి పూర్తి స్పష్టతతో ఉండటం వ్లలనే అనిల్ ఇలా వరుస సినిమాలతో విజయాలు అందుకున్నారు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అని ఆయన అభిమానులు, నెటిజన్లు అనుకుంటున్నారు.
ఒక విధంగా ఆయన చెప్పింది కూడా కరెక్టే. తెలుగు సినిమా పరిశ్రమలో ఇలా డైరెక్టర్ టు హీరో అయిన కొంతమంది ఆ తర్వాత ఇబ్బందికర ఫలితాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఎటూ కాకుండా సినిమాలకు దూరమైపోయారు. ఇవన్నీ చూసి, తెలిసిన వ్యక్తి కాబట్టే.. జాగ్రత్తగా మాట్లాడుతున్నారు అనిల్.