టాలీవుడ్ లో సినిమా అంటే ఏళ్ల తరబడి తీయడం కామన్ అయిపోయింది. కానీ ఈ రూల్ ను ఎప్పుడో బ్రేక్ చేసిన దర్శకుడు పూరి జగన్నాధ్. అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ డేట్స్ ఉన్నా, కేవలం రెండు మూడు నెలల్లో సినిమాను చుట్టేయడం ఆయనకే చెల్లింది. భారీ సెట్టింగులు, అనవసరపు ఖర్చులు లేకుండా నిర్మాతకు లాభం చేకూర్చడంలో పూరి రూటే వేరు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ మరో దర్శకుడు దూసుకుపోతున్నారు. పూరి తర్వాత అంత వేగంగా సినిమా తీయగల సత్తా ఆయన సొంతం.
ఆయనే మన హిట్ మిషన్ అనిల్ రావిపూడి. పూరి లాగే అనిల్ కూడా షూటింగ్ విషయంలో చాలా పక్కాగా ఉంటారు. సినిమా మొదలుపెట్టాక అనవసరంగా టైమ్ వేస్ట్ చేయడం, ఆర్టిస్టుల డేట్స్ వృథా చేయడం ఆయన డిక్షనరీలోనే లేదు. కథకు ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టిస్తూ, తక్కువ టైమ్ లోనే క్వాలిటీ అవుట్ పుట్ తీయడంలో అనిల్ దిట్ట. 15 ఏళ్ల కెరీర్ లో ఎనిమిది సినిమాలు చేసినా, ఏరోజూ రిలీజ్ డేట్ మిస్ అవ్వలేదంటే ఆయన ప్లానింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అయితే అనిల్ లో ఉన్న మరో బెస్ట్ క్వాలిటీ ప్రమోషన్స్. సాధారణంగా సినిమా పబ్లిసిటీ కోసం నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తారు. కానీ అనిల్ మాత్రం చాలా స్మార్ట్. తన దగ్గర ఉన్న నటీనటులనే తెలివిగా వాడుకుంటూ హైప్ క్రియేట్ చేస్తారు. దీనివల్ల నిర్మాతకు భారీగా డబ్బు ఆదా అవుతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ తో చేస్తున్న తాజా సినిమానే.
సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్స్ కు చాలా దూరంగా ఉంటారు. కానీ ‘మన శంకర వరప్రసాద్’ కోసం ఆమెను ఒప్పించి, ఏకంగా ప్రీ లాంచ్ వీడియోలో నటించేలా చేశారు అనిల్. చిరంజీవి, నయనతార, వెంకటేష్.. ఇలా స్టార్లందరినీ వాడేసుకుంటూ రిలీజ్ కు ముందే సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశారు. షూటింగ్ లోనే కాదు, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలోనూ అనిల్ స్ట్రాటజీలు పూరిని గుర్తుచేస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా ఎలాంటి లేట్ లేకుండా, పక్కా ప్లాన్ బి తో రెడీగా ఉండటం అనిల్ స్పెషాలిటీ. అందుకే స్టార్ హీరోలు కూడా అనిల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ స్పీడ్ గన్ చేతిలో చిరంజీవి సినిమా ఎంత త్వరగా, ఎంత బాగా వస్తుందో చూడాలి.