‘ప్రేమించుకుందాం రా’ అని వెంకటేశ్‌ పిలవాల్సింది అంజలా జవేరిని కాదట!

ఆ హీరోయిన్‌ తొలి సినిమాతోనే కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది.. ఈ మాట ఇప్పుడు మీరు కొత్త హీరోయిన్‌ వచ్చినప్పుడల్లా వింటూ ఉంటారు. అయితే 28 ఏళ్ల క్రితం ఇలాంటి మాట ఒకటి వినిపించింది. అప్పుడు వచ్చిన సినిమా ‘ప్రేమించుకుందాం రా’ ( Preminchukundam Raa) అయితే.. క్రష్‌ అని పిలిపించుకున్న కథానాయిక అంజలా జవేరి (Anjala Zaveri). ఇప్పటి తరం సినిమా ప్రేక్షకులకు ఆమె గురించి, అప్పట్లో ఆమె విషయంలో కుర్రాళ్లు చూపించిన మోజు గురించి తెలియదు. అయితే ఆ ఘనత అంజలా జవేరికి కాకుండా వేరే హీరోయిన్‌కు దక్కాల్సిందట.

Preminchukundam Raa

వెంకటేశ్‌ (Venkatesh) కథానాయకుడిగా జయంత్‌ సి.పరాన్జీ (Jayanth C. Paranjee) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. వసూళ్ల పరంగా, ప్రశంసల పరంగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ఈ సినిమాలో అంజలా జవేరి కథానాయిక. వెంకటేశ్‌ – అంజలా మధ్య ప్రేమ సన్నివేశాలు, జయప్రకాష్‌రెడ్డి (Jaya Prakash Reddy), శ్రీహరి (Srihari) నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ విషయం వదిలేస్తే.. ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు మాట్లాడేటప్పుడు అంజలా పేరు కాకుండా ఐశ్వర్య రాయ్‌ పేరును మనం ప్రస్తావించేవాళ్లం తెలుసా.

‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో తొలుత కథానాయికగా ఐశ్వర్యా రాయ్‌ను (Aishwarya Rai) అనుకున్నారట దర్శకుడు జయంత్‌. అప్పటికే ఆమెతో పరిచయం ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో ఐశ్వర్యతో నటింపజేద్దాం అని ప్లాన్‌ చేసుకున్నారట. అయితే చిత్ర బృందం నో చెప్పిందట. దానికి కారణం ఆమెకు అప్పటికే మూడు ఫ్లాప్‌లు ఉన్నాయి. దీంతో తమ సినిమా మీద ఎఫెక్ట్‌ పడుతుంది అని ‘ప్రేమించుకుందాం రా’ టీమ్‌ వద్దందట. దీంతో ఆ స్థానంలోకి అంజలా జవేరి వచ్చిందట.

అయితే నాగార్జున (Nagarjuna) – జయంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రావోయి చందమామ’ (Ravoyi Chandamama) సినిమాలో ఐశ్వర్య ప్రత్యేక గీతంలో నటించింది. దీని వెనుక కూడా ఓ కథ ఉంది. ‘రావోయి చందమామ’లో ప్రత్యేక గీతాన్ని ఎవరైనా బాలీవుడ్‌ హీరోయిన్‌తో చేయిస్తే బాగుంటుందని జయంత్‌ ప్లాన్‌ చేశారట. అలా ఆయన ముంబయి వెళ్లినప్పుడు ‘మీ సినిమాలో నటించమని అందర్నీ అడుగుతారు. నన్నెందుకు అడగలేదు’ అని ఐశ్వర్య అందట. దాంతో ‘రావోయి చందమామ’ విషయం చెబితే వెంటనే ఓకే చేసిందట.

డిజిటల్‌ కంటెంట్‌.. ఇన్నాళ్లకు సీరియస్‌గా తీసుకున్న ఫిల్మ్‌ ఛాంబర్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus