తమిళ సినిమా పరిశ్రమలో ‘మీటూ’ ఉద్యమం ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో మీకు తెలిసిన విషయమే. ఇప్పటికీ ఆ ఉద్యమం ప్రకంపనలు సౌత్ సినిమాలో కనిపిస్తోంది. అప్పుడు వాయిస్ రెయిజ్ చేసిన కొంతమంది ఇప్పుడు కూడా చేస్తున్నారు. అయినా ఈ విషయంలో వారు కోరిన పరిస్థితులు ఇంకా రాలేదు అని చెబుతుంటారు. ఈ సమయంలో మరో గాయని తన వాయిస్ రెయిజ్ చేశారు. ఆమె పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
యువ గాయని స్వగత కృష్ణన్ పోస్టు గురించే ఇప్పుడు మాట్లాడుతున్నది. పేరు చెప్పకుండా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తిపై కొంతమంది మహిళలు ఆరోపణలు చేసినా.. అతడికి సినీ పరిశ్రమలో ఇంకా మద్దతు, గౌరవం, అవకాశాలు ఎలా వస్తున్నాయి అని ఆమె ప్రశ్నించారు. లైంగిక వేధింపులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్, మత మార్పిడి ఆరోపణలు ఉన్న ఆ తనను తాను పొగుడుకుంటూ ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
స్వగత ఇప్పుడు మాత్రమే ఇలా మాట్లాడటం లేదు. గతంలో కూడా ఆమె ఈ తరహా ఆరోపణలు చేశారు. ఏప్రిల్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఓ మ్యూజిక్ కంపోజర్ స్టూడియోలో తనకు ఎదురైన ఇబ్బందికర అనుభవం గురించి మాట్లాడారు. అప్పట్లోనే ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. అక్కడ సీసీటీవీ, రికార్డింగ్‌లు ఉన్నాయని, ఆ ఫుటేజ్‌తో తనను బెదిరించారని ఆమె చెప్పారు. ఈ పరిస్థితి ఇతరులకు కూడా ఎదురైందని చెప్పారు.
స్వగత కృష్ణన్ తమిళ సినిమాలతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. గతేడాది ‘కాయల్’ అనే సినిమాలో నటించారు కూడా. స్వగత ఆఖరిగా ‘Next..’ అని రాసుకొచ్చారు. అంటే తర్వాతి పోస్టుల్లో పేరు చెబుతారా? మరిన్ని ఆధారాలు బయటపెడతారా? అనేది చూడాలి. ఆ విషయం తెలిసే లోపు ఇంకెన్ని రూమర్స్ వస్తాయేమో చూడాలి.