Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?
- August 6, 2026 / 06:57 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ కేసులో మరో ట్విస్ట్ వచ్చింది. అభిమాని రేణుక స్వామి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న దర్శన్ చుట్టూ పరిస్థితులు మరింత బిగుసుకోనున్నాయి. ఈ హత్య కేసులో 14వ నిందితుడిగా ఉన్న ప్రదోష అనే వ్యక్తి అప్రూవర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. తాను నిజాలు చెప్పేస్తాను.. తనను విడిచి పెట్టేయాలని కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో దర్శన్‌కు ఈ మలుపు సమస్యగా మారుతుంది. అంతేకాదు నేరం నిరూపణ అవ్వడానికి ఈ పరిణామాలు అవకాశం ఇస్తాయని చెబుతున్నారు.
Darshan
ప్రధోష్ సాక్ష్యాన్ని త్వరలో అధికారికంగా నమోదు చేసే అవకాశం ఉందనేది కన్నడ నాట నుండి వస్తున్న సమాచారం. మరి ఈ మార్పునకు కోర్టు ఓకే చెబుతుందా? ఒకవేళ ఓకే చెబితే ప్రదోష ఏం చెబుతాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే బెయిల్ రద్దయి దర్శన్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆ బెయిల్ రద్దు సమయంలో సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయాధికారం దుర్వినియోగమైందని వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన తప్పునే తాము పునరావృతం చేయబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలేమైందంటే.. కొన్ని నెలల క్రితం దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్యకు గురయ్యారు. అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు తేలింది. అతడికి కరెంట్ షాకులు పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొంది. హైకోర్టు దర్శన్‌కు గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. గతేడాది డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇప్పుడు ఏకంగా దోషుల్లో ఒకరు అప్రూవర్‌గా మారుతాం అంటున్నారు.














