ప్రముఖ కథానాయిక నయనతార డాక్యుమెంటరీ ‘నయనతార : బియాండ్ ది పెయిరీ టేల్’ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు.. నయన్ గురించి అన్ని విషయాలు చెబుతారా? ఆ విషయం గురించి మాట్లాడతారా? ఈ రిలేషన్ గురించి టాపిక్ వస్తుందా అంటూ ఏవేవో డిస్కషన్లు జరిగాయి. అయితే ఏమైందో ఏమో నెట్‌ఫ్లిక్స్ టీమ్ ఈ డాక్యుమెంటరీని వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు గతేడాది నవంబరు 14న స్ట్రీమింగ్‌కి తీసుకొచ్చింది. అలా త్వరలో వస్తోంది అనగానే చర్చ వేరే విషయం వైపు వెళ్లింది.
డాక్యుమెంటరీలో కొంత ఫుటేజీ వాడుకోవడానికి ‘నేనూ రౌడీనే’ సినిమా నిర్మాత ధనుష్‌ను (Dhanush) సంప్రదిస్తే రూ.10 కోట్లు అడిగారు అంటూ నయన్ ఓ పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు రెండుగా విడిపోయారు. ధనుష్ చేసింది కరెక్ట్.. నయన్ (Nayantara) ఏమన్నా ఆ డాక్యుమెంటరీ ఫ్రీగా చేస్తోందా అని కొందరు. మరికొందరేమో సెకన్లలోని సీన్లకే ఇంత అడగాలా, అసలు ఫ్రీగా ఇస్తే పోయేదేముంది అని అన్నారు. ఈ విషయం అటు తిరిగి, ఇటు తిరిగి కోర్టుల వరకు వెళ్లింది.
తన పర్మిషన్ లేకుండా సినిమాలోని బీటీఎస్ క్లిప్పింగులను డాక్యుమెంటరీలో ఉపయోగించుకున్నందుకు ధనుష్.. నయనతారతో పాటు నెట్ ఫ్లిక్స్ టీంపై కాపీ రైట్ కేసును వేశారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాలో నయనతార ధరించిన దుస్తులపై కూడా ధనుష్‌కు రైట్స్ ఉన్నాయని ఆయన న్యాయ బృందం వాదిస్తోంది. డాక్యుమెంటరీలో ఉపయోగించిన 28 సెకన్ల ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమాకు సంబంధించిన వీడియోను ఉపయోగించడం అనేది సినిమాను ఓకే చేసుకున్న సమయంలో చేసిన అగ్రిమెంట్‌ను ఉల్లంఘించడమే అని ధనుష్ న్యాయవాది వాదించారు.
అంతేకాకుండా షూటింగ్ సమయంలో నయనతార ధరించిన కాస్ట్యూమ్స్ సహా ఈ సినిమాకి సంబంధించిన అన్నీ రైట్స్ ధనుష్‌వే అన్నారు. చూస్తుంటే ఈ విషయం ఇక్కడితో తేలేలా లేదు. ఒకవేళ న్యాయ స్థానంలో విషయం తేలే పరిస్థితి లేకపోతే ధనుష్ – నయనతార బయట మాట్లాడుకుని తేల్చుకుంది. ఎందుకీ రచ్చ అని ఇద్దరి అభిమానులు కోరుతున్నారు.