అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం “స్కై ఫోర్స్” (Sky Force). వీర్ పహారియా హీరోగా పరిచయమైన ఈ చిత్రానికి సందీప్-అభిషేక్ దర్శకులు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగింది? అక్షయ్ కుమార్ ఫ్లాపుల పరంపర నుండి బయటపడ్డాడా? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
కథ: 1965లో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం “స్కై ఫోర్స్”. పైలట్ టి.కె.విజయ ఈ యుద్ధంలో ఎలాంటి పాత్ర పోషించాడు. విజయ చేసిన త్యాగానికి గ్రూప్ కెప్టెన్ ఓం అహుజా (అక్షయ్ కుమార్) ఏ విధంగా గౌరవం తీసుకొచ్చాడు? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: పరిచయ చిత్రమైనా వీర్ పహారియా పర్వాలేదనిపించుకున్నాడు. అయితే.. పాత్ర తీరుతెన్నులకి అతడి వ్యవహారశైలికి సింక్ అవ్వలేదు. అందువల్ల రిలిటబిలిటీ మిస్ అయ్యింది. అక్షయ్ కుమార్ కి ఈ తరహా పాత్రలు కొత్త కాదు. ఆల్రెడీ పలుమార్లు నటించి ఉన్నాడు. ఈ చిత్రంలోనూ తన సహ పైలట్ కోసం పరితపించే కమాండర్ గా అలరించాడు.
ముఖ్యంగా.. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ లో విశేషంగా ఆకట్టుకున్నాడు. సారా అలీఖాన్ పర్వాలేదనిపించుకుంది. నిమ్రత్ కౌర్ కి ఉన్నవే కొన్ని సీన్స్. సపోర్టింగ్ క్యాస్ట్ అంతా తమ బెస్ట్ ఇచ్చారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకులు సందీప్-అభిషేక్ కథలోని ఎమోషన్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపారు. ఆ కారణంగా.. టెక్నికల్ గా సినిమా అలరించలేక చతికిలపడింది. ముఖ్యంగా.. విజయ ఎందుకంత గొప్పవాడు అని నిరూపించే సీన్స్ లో ఎమోషన్ సరిగా పండలేదు. ఆ సీక్వెన్స్ బాగా వర్కవుట్ అయ్యుంటే.. సినిమా మరోస్థాయికి వెళ్ళేది. సో, కథా రచయితలుగా పర్వాలేదనిపించుకున్న సందీప్-అభిషేక్ ద్వయం, దర్శకులుగా మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
జస్టిన్ వర్గీస్ నేపథ్య సంగీతం బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో నిర్మాణ బృందం ఎక్కడా రాజీపడలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కలర్ టోన్ & గ్రేడింగ్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు పీరియాడిక్ ఫీల్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాయి.
విశ్లేషణ: సినిమా ఎమోషనల్ గా బాగున్నప్పటికీ.. సినిమాలో కీలకమైన పోరాట సన్నివేశాల గ్రాఫిక్స్ చాలా పూర్ గా ఉండడం సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది. భారీ బడ్జెట్ సినిమాలు, ముఖ్యంగా ఫైటర్ జెట్స్ సీన్స్ ఉన్నప్పుడు గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు జనాలు హాలీవుడ్ సినిమాలు కూడా చూస్తున్నారు, అందులోనూ “టాప్ గన్” లాంటి సినిమాలు చూసిన ప్రేక్షకులకు గ్రాఫిక్స్ ఏమాత్రం నచ్చకపోయినా రిజల్ట్ ఎలా ఉంటుందో గతేడాది “ఫైటర్” విషయంలోనే తెలిసొచ్చింది. అయినప్పటికీ.. “స్కై ఫోర్స్” (Sky Force) టీమ్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం అనేది గమనార్హం. ఆ కారణంగా “స్కై ఫోర్స్” సగం ఉడికిన మెతుకులా మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: చాలా ఫోర్స్డ్ గా ఉంది!
రేటింగ్: 2/5