‘బలగం’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి సర్‌ప్రైజ్ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు వేణు యల్దండి. అప్పటికే కమెడియన్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న వేణు.. ఆ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమాతో వసూళ్లు, అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. అయితే తన రెండో సినిమా ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు. ఆ సినిమా వచ్చి రెండేళ్లు అయినా ఇంకా రెండో సినిమా స్టార్ట్ కాకపోవడం కూసింత ఆశ్చర్యమే. అయితే ఆ రెండో సినిమా కోసం జరుగుతున్న ప్రయత్నాలు తెలిసిన వాళ్లు అయ్యో అంటున్నారు.
వేణు రెండో సినిమాగా ‘ఎల్లమ్మ’ను నిర్మాత దిల్ రాజు చాలా నెలల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ ఏ ముహూర్తంలో మొదలెట్టారో తెలియదు కానీ.. ఒక అడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఈ సినిమాకు ఇన్నాళ్లూ హీరో కుదరడమే కష్టం అనుకుంటే ఈ మధ్య ఓ ‘కొత్త’ హీరోను తీసుకొచ్చారు. ఆయన దాదాపు ఓకే అని అంటున్నారు. అయితే కుదిరింది అనుకున్న హీరోయిన్ ఇప్పుడు నో చెబుతోంది. దీంతో వేణు మరో హీరోయిన్ కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి.
‘ఎల్లమ్మ’ సినిమా కథను తొలుత నానికి చెప్పారు. ఆయన నుండి రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడంతో శర్వానంద్ దగ్గరకు వెళ్లింది ప్రాజెక్ట్. అక్కడా ఉ పడకపోవడంతో నితిన్ కోర్టులోకి వచ్చింది బంతి. ఇప్పుడు నితిన్ కూడా పక్కకు వెళ్లిపోవడంతో తిరిగి శర్వానంద్ దగ్గరకు వెళ్లింది. అక్కడా సేమ్ ఆన్సర్ కంటిన్యూ అయింది. చివరికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫిక్సయ్యాడన్న వార్తలొచ్చాయి. ఈ విషయంలో క్లారిటీ లేకపోయినా ఆయనే హీరో అంటున్నారు.
మరి, హీరో మారాడనో లేక ఆమెకి ఇష్టం లేదో కానీ అంతా ఓకే అనుకున్న కీర్తి సురేశ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి జంప్ అయింది. అయితే ఆమె సినిమాలో ఉన్నట్లు అధికారికంగా చెప్పలేదు కాబట్టి.. ఆమె ఈ సినిమా చేయడం లేదు అని చెప్పింది అనొచ్చు. ‘ఎల్లమ్మ’లో మీరు నటిస్తున్నారా?’ అని కీర్తిని అడిగితే స్ట్రెయిట్‌గా ఫేస్ మీదే ‘నో’ అనేసింది. దీంతో డిసెంబరులో ఈ సినిమా అధికారిక ప్రకటన వస్తుందని భావించిన ప్రేక్షకులు మరోసారి వాయిదాకు ఫిక్స్ అయ్యారు.