అదేదో సినిమాలో హీరో చెప్పినట్లు.. ‘కమల్ హాసన్‌కు వయసైపోయేకొద్దీ ఊపొస్తోంది. అందుకే వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. చేతిలో మూడు, నాలుగు సినిమా ఉండగానే మరో సినిమాను ఓకే చేసేశారు అని సమాచారం. కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం అయితే కమల్ ఇప్పుడు తన 239వ సినిమాకు పచ్చ జెండా ఊపారట. ఆ సినిమాకు కూడా తన రీసెంట్ ట్రెండ్‌కి తగ్గట్టే కుర్ర దర్శకుడినే ఎంపిక చేసుకున్నారట.
గతేడాది మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘థగ్ లైఫ్’ తర్వాత కమల్ నుండి మరో సినిమా రాలేదు. ‘ఇండియన్ 3’ రెడీగా ఉన్నా రిలీజ్ చేసే ధైర్యం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చేయడం లేదని సమాచారం. అయితే ఈ లోపు కమల్ కొత్త సినిమాలకు ఓకే చేశారు. అవేంటో ఆఖరులో చూద్దాం. ఇప్పుడు లేటెస్ట్ సినిమా సంగతి చూస్తే.. ఎస్‌యూ అరుణ్ కుమార్ అనే దర్శకుడితో తన 239వ సినిమా ఉంటుందట. ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. ‘పన్నయురమ్ పద్మినియుమ్’, ‘సేతుపలి’, ‘సింధుబాద్’, ‘చిత్త’, ‘వీర ధీర సూరన్ 2’ సినిమాల దర్శకుడాయన.
ఇటీవల కమల్‌కి ఓ స్టోరీ లైన్ వినిపిస్తే.. బాగా నచ్చేసి నేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పేశారట. అయితే ప్రస్తుతం కమల్ చేతిలో ‘కల్కి 2’, అన్బరివు, రజనీకాంత్‌తో మల్టీస్టారర్ సినిమాలు ఉన్నాయి. అందుకే అరుణ్ కుమార్ సినిమాకు సీరియల్ నెం 239 ఇచ్చారట. మరి అన్నీ అనుకున్నట్లుగా ముందుకుసాగి ఈ సినిమాకు 239 సీరియల్ నెంబర్ ఉంటుందా లేదా అనేది చూడాలి.
ఎందుకిలా అంటున్నామంటే.. అన్బరివు దర్శకత్వంలో కమల్ చేస్తున్న సినిమా ఏదో ఒక ఇబ్బంది కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. మరోవైపు రజనీకాంత్‌తో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది తేలాల్సి ఉంది. ‘జైలర్ 2’ సినిమా అయ్యాక కానీ ఈ సినిమా విషయంలో క్లారిటీ రాదు.