“ఘాజీ” లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్ తర్వాత దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం “అంతరిక్షం”. స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటించగా.. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేసింది కూడా. మరి సినిమా అంచనాలను అందుకోగలిగిందా? తెలుగులో రూపొందిన మొట్టమొదటి స్పేస్ ఫిలిమ్ ఆడియన్స్ ను అలరించగలిగిందా? అనేది చూద్దాం..!!
కథ : ఇండియన్ కమ్యూనికేషన్ సిస్టమ్ కు ముఖ్యమైన శాటిలైట్ మిహిర. 12 ఏళ్ల క్రితం భూస్థిర క్యక్షలోకి ప్రవేశపెట్టబడిన ఈ శాటిలైట్ టెక్నికల్ ప్రోబ్లమ్ కారణంగా తన కక్ష్య నుంచి తప్పిపోయి మెలమెల్లగా వేరే కక్ష్యలోకి వచ్చి చేరుతుంది. అదే కక్ష్యలో ఇంకొన్ని రోజులు తిరిగితే వేరే శాటిలైట్స్ ను ఢీకొని.. ఆ ఢీకొనడం ద్వారా వచ్చే ప్రకంపన మరియు ఆ విరిగిన శాటిలైట్ ముక్కలు అదే కక్ష్యలోని ఇతర శాటిలైట్స్ ను కూడా తునాతునకలు చేసే అవకాశం ఉందని తెలుసుకొన్న ఇండియన్ స్పేస్ సెంటర్ లోని సైంటిస్టులు.. ఈ వినాశనం జరగకుండా ఉండాలంటే 12 ఏళ్ల క్రితం కోడింగ్ సిస్టమ్ గురించి తెలిసిన దేవ్ (వరుణ్ తేజ్) ఒక్కడికే సాధ్యమని గ్రహించి.. అయిదేళ్ళ క్రితం జరిగిన ఓ ప్రమాదం కారణంగా ఐ.ఎస్.సి వదిలి వెళ్ళిపోయిన దేవ్ ను మళ్ళీ రప్పిస్తారు.
అయితే.. దేవ్ కేవలం మిహిరా శాటిలైట్ ను బాగుచేసి, దాన్ని కక్ష్యలో సరిగా ప్రయాణం చేసేలా చేయడమే కాక.. అయిదేళ్ళ క్రితం తాను స్వయంగా చంద్రమండల కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విప్రియాన్ ను కూడా బాగుచేయాలనుకొంటాడు. అందుకు అంతరిక్ష పరిస్థితులు దేవ్ కు అనుకూలించాయా? ఈ ప్రయోగాలు చేసే సమయంలో అతడు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు ఏమిటి? అనేది “అంతరిక్షం” కథాంశం.
నటీనటుల పనితీరు : ఒక వ్యోమగామి బాడీ లాంగ్వేజ్ అనేది వరుణ్ తేజ్ లో కనిపించలేదు తప్పితే.. స్క్రీన్ ప్రెజన్స్ మరియు పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం దేవ్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు వరుణ్.
లావణ్య త్రిపాఠిది చిన్న పాత్రే అయినప్పటికీ.. ఉన్నంతలో చక్కగా నటించింది. అదితిరావు హైదరీ క్యారెక్టర్ కు సరైన డెప్త్ లేకపోయినా స్క్రీన్ ప్రెజన్స్ తో పర్వాలేదు అనిపించుకొంది. సత్యదేవ్ నటన బాగుంది కానీ.. అతడి చేత ద్విపాత్రాభినయం ఎందుకు చేయించారు, అసలు కవలల క్యారెక్టర్స్ ఉండడం వల్ల “కడుపులో స్పేస్ పంచుకున్నాం..” అనే డైలాగ్ తప్ప ఏం జస్టీఫై అయ్యిందో అర్ధం కాలేదు.
హెడ్ ఆఫ్ ది సెంటర్ గా రెహమాన్ బాధ్యతాయుతమైన పాత్రకు న్యాయం చేశాడు. అలాగే రాజా కూడా మరో వ్యోమగామి పాత్రలో మెప్పించాడు. సపోర్టింగ్ రోల్లో అవసరాల శ్రీనివాస్ హీరో వరుణ్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.
సాంకేతికవర్గం పనితీరు : తక్కువ బడ్జెట్ లో ఇలాంటి మంచి సినిమా తీశాడు అని సంకల్ప్ రెడ్డిని మెచ్చుకోవాలా లేక ఉన్న రీసోర్సెస్ ను సరిగా వినియోగించుకోకుండా మధ్యస్తమైన అవుట్ పుట్ ఇచ్చాడని మొట్టికాయ మొట్టాలా అనే కన్ఫ్యూజన్ లో కాసేపు కొట్టుమిట్టాడినప్పటికీ.. ఇదే సినిమాను రేపు ఎవరైనా పదిలక్షల్లో తీశారని “తక్కువ బడ్జేట్ లో బాగా తీసారు” అని పొగడలేం కదా అనే సెన్స్ గుర్తొచ్చి.. దర్శకుడిగా సంకల్ప్ చేసిన తప్పులు ఏంటనేది వివరంగా వివరించాలనే ఫిక్స్ అయ్యాను.
ముందుగా.. గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ముఖ్యంగా.. అంతరిక్షంలో గ్రావిటీ షాట్స్ మరియు అదితిరావు-వరుణ్ లు కక్ష్యలోకి వెళ్ళే సన్నివేశాల్లో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా వీక్ గా ఉంది. అసలు వరుణ్ తేజ్ చంద్రుడి కక్ష్యలో చేసే ఫీట్స్ చూస్తే హాలీవుడ్ స్పేస్ ఫిలిమ్స్ చూసిన, గ్రావిటీ గురించి కనీస అవగాహన ఉన్న ప్రేక్షకుడు తనలో తాను నవ్వుకొంటాడు. బేసిగ్గా.. రెండు సబ్ ఫ్లాట్స్ రాసుకొన్న సంకల్ప్ కు సెకండాఫ్ లో కథను ఎలా మళ్ళించాలి అనేది అర్ధం కాలేదు, అందువల్ల ఉన్న పాయింట్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఉన్న చిన్నపాటి కథనే సాగదీస్తూ వెళ్లిపోయాడు సంకల్ప్ రెడ్డి. ఎమోషనల్ గా ఆడియన్స్ ను ఇన్వాల్వ్ చేయడం కోసమని కొన్ని క్యారెక్టర్స్ ను లాస్ట్ లో తీసుకొన్ని ఇరికించినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
ప్రశాంత్ ఆర్.విహారీ సంగీతం, నేపధ్య సంగీతం కొత్తగా ఉన్నాయి. సౌండ్ డిజైనింగ్ లో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ ఫీల్ ను కలిగించి ఉండేవారు. జ్ణానశేఖర్ సినిమాటోగ్రఫీ, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ పనితనం బాగుంది. డి.ఐ & కలరింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సి ఉండాల్సింది.
విశ్లేషణ : తెలుగులో వచ్చిన మొట్టమొదటి స్పేస్ ఫిలిమ్ అనే కన్సర్న్ తోపాటు లాజిక్స్ ను పట్టించుకోకుండా చూడగలిగితే మాత్రమే “అంతరిక్షం” చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు. హాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేస్తే మాత్రం కష్టమే.