గత కొంత కాలంగా కమర్షియల్ హిట్స్ కు దూరమైన నాని నటించిన తాజా చిత్రం “అంటే సుందరానికి..”. మలయాళ నటి నజ్రియా తెలుగు తెరంగేట్రం చేస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. “బ్రోచేవారెవరురా” అనంతరం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం.. ట్రైలర్ కంటెంట్ & వివేక్ సాగర్ సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు నమోదయ్యేలా చేసింది. మరి సుందరం ఆ అంచనాలను అందుకోగలిగాడో లేదో చూద్దాం..!!
కథ: స్వచ్చమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు సుందర్ (నాని), క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి లీలా (నజ్రియా). ఇద్దరూ చిన్నప్పటి నుండి స్నేహితులు, పెద్దయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ.. మతాలు అడ్డొస్తాయి. ఆ అడ్డంకిని తప్పించుకోవడం కోసం సుందర్ & లీలా పడిన పాట్లు ఏమిటి? చివరికి ఏం జరిగింది? అనేది “అంటే సుందరానికి..” కథాంశం.
నటీనటుల పనితీరు: సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ నాని. అతని హావభావాలు, ఆహార్యం, కామెడీ టైమింగ్ ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తాయి. నజ్రియా లీలా పాత్రకు యాప్ట్ గా సరిపోయింది. నరేష్, నదియా, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు తమదైన పాత్రల్లో ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు వివేక్ ఆత్రేయ తన దర్శకత్వ ప్రతిభ కంటే కలం బలం మీద ఎక్కువ దృష్టి సారించాడు. చాలా సాదాసీదా కథకు తనదైన మార్క్ స్క్రీన్ ప్లే యాడ్ చేసి మ్యాజిక్ చేశాడు. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మరీ ఎక్కువ టైమ్ తీసుకోవడం, చిన్నప్పటి సన్నివేశాలు మరీ ఎక్కువ నిడివి ఉండడం సినిమాకి చిన్నపాటి మైనస్ లు గా నిలిచాయి. అయితే.. సిచుయేషనల్ కామెడీని మాత్రం హిలేరియస్ గా పండించారు.
నేపధ్య సంగీతంతో వివేక్ సాగర్ తన విశ్వరూపం చూపించాడు. లెక్కకుమిక్కిలి పాటలున్నప్పటికీ.. ఒక్కటి కూడా బోర్ కొట్టించలేదు. అలాగే నేపధ్య సంగీతంతో సినిమాకి మంచి హైప్ ఇచ్చాడు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, ప్రొడక్షన్ డిజైన్ వంటి టెక్నికల్ విషయాలన్నీ వేలెత్తిచూపని విధంగా ఉన్నాయి.
విశ్లేషణ: గత కొంతకాలంగా తెలుగుతెరపై మిస్సయిన “రామ్ కామ్” జోనర్ ను మళ్ళీ ప్రేక్షకులకు పరిచయం చేశాడు వివేక్ ఆత్రేయ. నాని కామెడీ టైమింగ్, వివేక్ సాగర్ నేపధ్య సంగీతం, సరదా సన్నివేశాల కోసం “అంటే సుందరానికి” తప్పకుండా చూడవచ్చు. కాకపోతే.. “సుందరానికి కాస్త సాగదీత ఎక్కువైంది.. అంతే”
రేటింగ్: 3/5