నటీనటులు ఒక్కోసారి అద్భుతమైన పాత్రలు తృణప్రాయంలో వదులుకొంటారు లేదా చేజార్చుకొంటారు. కానీ.. తాము వదులుకొన్న పాత్ర సూపర్ హిట్ అయినప్పుడు రోజుల తరబడి బాధపడుతూనే ఉంటారు. “మిస్టర్ పర్ఫెక్ట్” సినిమా నుంచి వైదొలగినప్పుడు రకుల్ ఎంత బాధపడిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే తరహాలో బాధపడుతోంది అనుపమ పరమేశ్వరన్. నిజానికి.. “రంగస్థలం” సినిమాలో రామలక్ష్మి పాత్రకు తొలుత అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకోవడమే కాదు.. ఫోటోషూట్, స్క్రీన్ టెస్ట్ తోపాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా చేశారు.
అయితే.. సుకుమార్ ఊహించుకొన్న స్థాయిలో అనుపమ ఆ పాత్రని క్యారీ చేయలేకపోవడం.. ముఖ్యంగా రామ్ చరణ్ పక్కన అనుపమ మరీ చిన్నపిల్లలా కనిపించడం వల్ల ఆఖరి నిమిషంలో ఆమెను తొలగించి.. ఆమె స్థానంలో సమంతను తీసుకోవడం, రామలక్ష్మి పాత్రలో సమంత జీవించడం తెలిసిందే. అయితే.. ఈ విషయమై నిన్న “తేజ్ ఐ లవ్ యూ” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన అనుపమ పరమేశ్వరన్ ను ప్రశ్నించారు మీడియా మిత్రులు. దానికి ఆమె సమాధానంగా “నేను చేయాల్సిందా!, కానీ సమంత 101% న్యాయం చేసింది. ఆ రేంజ్ లో నేను చేసేదాన్ని కాదేమో అన్నట్లుగా సమాధానమిచ్చింది. చాలా తెలివిగా అనుపమ చెప్పిన సమాధానానికి మీడియా కూడా ఖంగుతింది.