వచ్చే ఏడాది జేజమ్మ సినిమాల జాతర

  • November 21, 2016 / 07:44 AM IST

అనుష్క తెరమీదికొచ్చి పదేళ్లు దాటింది. ఓ హీరోయిన్ కెరీర్ ఇంత సుదీర్ఘకాలం కొనసాగటం మామూలు విషయం కాదు. అందం అభినయం కలగలిపిన అనుష్క వంటి భామలకు మాత్రమే ఇది సాధ్యం. పదేళ్లు దాటినా అనుష్కని అవకాశాలు వెతుక్కుంటూ రావడం ఆమె ప్రతిభకు నిదర్శనం. ‘అరుంధతి’గా తెలుగు ప్రేక్షకులని అలరించిన ఈ మంగుళూరు బ్యూటీ వచ్చే ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. తెలిసి సంతకం చేసిందో.. సంతకం చేశాక తెలుసుకుందో కానీ ‘సింగం’ సినిమాలో హీరోయిన్ గా చేసిన అనుష్క ఈ సినిమా మూడు భాగాల్లోనూ నటించింది. ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘కావ్య’ పాత్రలో ప్రేక్షకులకు చేరువైన అనుష్క వచ్చే నెల 16న విడుదల కానున్న ‘సింగం 3’తో మరోమారు అదే పాత్రలో మెప్పించనుంది.

నాగార్జునతో పలు సినిమాల్లో నాయికగాను, అతిథి పాత్రల్లోను మెరిసిన స్వీటీ భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’తో 2017 తొలినాళ్లలో తెరపైకి రానుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్ ని పూర్తి చేసిన అనుష్క ప్రస్తుతం ‘భాహుబలి2’, ‘భాగ్ మతి’ సినిమాలతో బిజీగా వుంది. ‘బాహుబలి 2’ దాదాపు పూర్తయినట్టే. తొలి భాగంలో తల్లి పాత్రలో సంకెళ్లతో కనపడిన దేవసేన రెండవ భాగంలో యువరాణిగా కత్తి విన్యాసాలు ప్రదర్శించనుంది. ఏప్రిల్ 28న ఈ సినిమా తెరమీదికి రానుండగా అశోక్ దర్శకత్వం వహిస్తున్న ‘భాగ్ మతి’ కూడా కాస్త అటుఇటుగా ఆ సమయంలోనే థియేటర్ గడప తొక్కనుంది. ఇదీ జేజమ్మ సినిమాల జాతర..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus