మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నారు. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11 న రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం అనుకుంది. అందుకు తగ్గట్టుగానే కష్టపడుతోంది. అయితే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణంతో అంతా మారిపోయింది. తారక్ కుంగిపోయారు. అరవింద టీమ్ కూడా ఎన్టీఆర్ ని మరింత బాధపెట్టడం ఇష్టంలేక షూటింగ్ కి బ్రేక ఇచ్చారు.
దీంతో ఈ మూవీ రిలీజ్ ఆలస్యం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ తన వల్ల ఇతరులు బాధపడకూడదని ఈరోజు నుంచి షూటింగ్ లో పాల్గొన్నారు. గుండెనిండా బాధ ఉన్నప్పటికీ, దాన్ని బయటపెట్టకుండా నటించారు. తారక్ డెడికేషన్ చూసి అరవింద సమేత మూవీ దసరాకి తప్పకుండా వస్తుందని చెబుతున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. వరుసగా నాలుగు విజయాల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.