కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా, విజయశాంతి (Vijaya Shanthi) కీలకపాత్రలో రూపొందిన చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” (Arjun Son Of Vyjayanthi) . “రాజా చెయ్యి వేస్తే” ఫేమ్ ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) ఈ చిత్రానికి దర్శకుడు. కాస్త కంగారుగానే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ఓ మోస్తరుగా ఆకట్టుకునే విధంగా ఉంది. మరి సినిమా ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!
కథ: చిన్నప్పటినుంచి తల్లి వైజయంతి (విజయశాంతి) అంటే ఎనలేని ప్రేమతో పెరుగుతాడు అర్జున్ (కళ్యాణ్ రామ్). తల్లి కోరిక మేరకు ఐపీఎస్ పరీక్ష పాసై, మరికొన్ని రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ తీసుకోబోతాడు అనగా.. అర్జున్ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. చట్టాన్ని కాపాడాల్సిన కొడుకు క్రిమినల్ అయ్యాడనే బాధతో కుమిలిపోతుంది వైజయంతి. కట్ చేస్తే.. తల్లీకొడుకులను చంపడం కోసం ముంబై మాఫియా డాన్ పఠాన్ (సోహైల్ ఖాన్) రంగంలోకి దిగుతాడు.
అసలు అర్జున్ ఎందుకు హత్య చేసేదాకా వెళ్ళాడు? ఈ గొడవలో తల్లి వైజయంతి పాత్ర ఏమిటి? పఠాన్ ఎవరు? అతనికి ఈ తల్లీకొడుకులతో ఉన్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” (Arjun Son Of Vyjayanthi) చిత్రం.
నటీనటుల పనితీరు: 60 ఏళ్లకు చేరువవుతున్నా.. విజయశాంతి ఇప్పటికే యాక్షన్ స్టంట్స్ చేయడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. బాధ్యత-బంధం కలగలిసిన తల్లి పాత్రలో ఆమె నటన సినిమాకి మంచి వెయిటేజీ యాడ్ చేసింది. సినిమాని నడిపించే మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఆవిడే కావడం సినిమాకి మంచి ప్లస్ పాయింట్ గా మారింది. ఇక కళ్యాణ్ రామ్ కి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి. అయితే.. అర్జున్ క్యారెక్టర్ ను ఇంకాస్త ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. అది లేకపోవడంతో, అతడి జర్నీకి ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు. ఒక పేటలో 40 మందిని చంపిన ఒకడు, యావత్ విశాఖపట్టణాన్ని ఎలా రూల్ చేశాడు అనే పాయింట్ ను ఎక్కడా సరిగా ఎలివేట్ చేయలేదు.
బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ ఈ చిత్రంలో రెగ్యులర్ కమర్షియల్ విలన్ గా కనిపించినప్పటికీ.. అతనికి రొటీన్ టెంప్లేట్ డైలాగ్స్ పెట్టకపోవడం కాస్త ప్లస్ అయ్యింది. లేకపోతే.. ఆ పాత్ర కూడా బోర్ కొట్టేసేది. శ్రీకాంత్ (Srikanth) ఈ చిత్రంలో భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. బబ్లూ పృథ్వీరాజ్ సపోర్టింగ్ రోల్ డీసెంట్ గా ఉంది. హీరోయిన్ సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) ఏదో ఉంది అనిపించుకుంది. నటిగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
సాంకేతికవర్గం పనితీరు: అజనీష్ లోక్నాథ్ (B. Ajaneesh Loknath) నేపథ్య సంగీతం సౌండింగ్ బాగున్నా.. హీరో ఎలివేషన్ ఇచ్చిన పాటను మరీ రిపిటేటివ్ గా వాడేయడం వల్ల దాని తాలుకు ఇంపాక్ట్ పోయింది. అయితే.. ఎమోషన్, ఫైట్స్ & సెంటిమెంట్స్ ను తనదైన శైలి నేపథ్య సంగీతంతో బాగా ఎలివేట్ చేశాడు. సి.రాంప్రసాద్ (C. Ram Prasad) మార్క్ ఫ్రేమింగ్స్ యాక్షన్ బ్లాక్ లో కనిపించాయి. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ ఫైట్ & పేటలో ఫైట్ ను బాగా తెరకెక్కించారు, మాస్ ఆడియన్స్ కు ఆ రెండు ఫైట్ సీక్వెన్సులు విశేషంగా నచ్చుతాయి. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ టీమ్ ఎక్కడా రాజీపడలేదు అని స్పష్టమవుతుంది. నిర్మాతలు కూడా అవసరమైనదానికంటే ఎక్కువే ఖర్చు చేశారు.
ప్రదీప్ చిలుకూరి రాసుకున్న కథ రొటీన్ టెంప్లేట్ అయినప్పటికీ.. కొన్ని సీన్ కంపోజిషన్స్ బాగున్నాయి. ముఖ్యంగా విలన్ ఎంట్రీ, తల్లీకొడుకుల మధ్య బాండింగ్ ను ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ ను బాగా రాసుకున్నాడు. అయితే.. సెంటిమెంట్ మరీ ఓవర్ డోస్ అయిపోయింది. సెంటిమెంట్ అనేది ఎమోషనల్ డ్రైవ్ లా ఉండాలి కానీ, కథనానికి అడ్డంకిగా ఉండకూడదు. ఆ విషయాన్ని దర్శకుడు పెద్దగా పట్టించుకోలేదు. అలాగే.. చివర్లో వచ్చే యాక్షన్ బ్లాక్ మరీ ఆరవ అతి తాలుకు ఫ్లేవర్ గుప్పించింది. సదరు అంశం ఏమిటి అనేది ప్రస్తావించకూడదు కానీ, అవసరం లేదు అనిపించింది. అయితే.. డైలాగ్స్ లో మాస్ పంచులు మాత్రం బాగా పేలాయి. సో, ఓవరాల్ గా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి సీన్ కంపోజిషన్స్ విషయంలో అలరించి, కథనం విషయంలో కాస్త ఇబ్బందిపెట్టి మొత్తానికి పర్వాలేదనిపించుకున్నాడు.
విశ్లేషణ: ఒక ఎమోషనల్ పాయింట్ ను ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి, దాని చుట్టూ డ్రామాని సరిగా రన్ చేసినప్పుడే సెంటిమెంట్ పండుతుంది. లేకపోతే.. అటు ఎమోషనల్ గా, ఇటు సెంటిమెంటల్ గా కంటెంట్ కి కనెక్ట్ అవ్వలేక ఆడియన్స్ ఇబ్బందిపడతారు. ఈ కనెక్టివిటీ ఇష్యూస్ ను కాస్త పక్కనపెడితే.. ఓ సగటు మాస్ టెంప్లేట్ సినిమాగా “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” చిత్రాన్ని ఆస్వాదించవచ్చు.
ఫోకస్ పాయింట్: సెంటిమెంట్ ఓవర్ డోస్!
రేటింగ్: 2.5/5