డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ సమయంలో క్రూజ్ షిప్ లో ఏం జరిగిందనే అంశంపై తమ వెర్షన్ వినిపించారు ఆర్యన్, ఆయన తరఫు న్యాయవాది. క్రూజ్ షిప్ లో పట్టుబడిన డ్రగ్స్ తో ఆర్యన్ కు ఎలాంటి సంబంధంలేదనేది వారి వాదనలో ప్రధాన అంశం. క్రూజ్ షిప్ లో పార్టీకి తనకు ఇన్విటేషన్ వచ్చిన మాట నిజమేనని.. అయితే అక్కడ ఏం జరుగుతోందో తనకు పూర్తిగా తెలియదని ఆర్యన్ ఖాన్ కోర్టుకి తెలిపారు.
తను బాలీవుడ్ కు చెందిన వ్యక్తిని కాబట్టి గ్లామర్ కోసం తనను ఇన్వైట్ చేసి ఉంటారనుకొని.. పార్టీకి వెళ్లాలని.. అదే పార్టీకి తన స్నేహితుడు అర్బాజ్ మర్చెంట్ కూడా వచ్చాడని అన్నారు. అయితే అర్భాజ్ అక్కడకు వస్తున్న విషయం తనకు తెలియదని.. షిప్ బయట కనిపిస్తే ఇద్దరం మాట్లాడుకున్నామని.. ఆ సమయంలోనే ఎన్సీబీ అధికారులు తమ వద్దకు వచ్చారని.. అర్బాజ్ వద్ద ఆరు గ్రాముల చరాస్ పట్టుబడినట్టుగా ఆర్యన్ వివరించాడు.
అర్భాజ్ తనకు స్నేహితుడే అని.. అయితే అతడి వద్ద డ్రగ్స్ ఉన్న విషయం తనకు తెలియదని.. తను అర్భాజ్ తో మాట్లాడుకొని అక్కడకు రాలేదని చెప్పుకొచ్చాడు. అర్భాజ్ దగ్గర డ్రగ్స్ దొరకడంతో ఎన్సీబీ అధికారులు తనను కూడా అక్కడ పట్టుకొచ్చారని ఆర్యన్ కోర్టుకి చెప్పుకున్నాడు. రెండు రోజుల పాటు అధికారులు తనను కస్టడీలో ఉంచుకున్నా.. విచారించిందేమీ లేదని చెప్పాడు. తన ఫోన్ కూడా వారి దగ్గరే ఉందని.. వాట్సాప్ చాట్ ద్వారా తను పార్టీకి ఎలా వచ్చానో చెక్ చేసుకోవచ్చని ఆర్యన్, ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతియానికి ఆర్యన్ కు బెయిల్ దొరకలేదు. రేపు మరోసారి అతడి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.