అతడే

  • June 22, 2018 / 06:06 AM IST

“ఒకే బంగారం, మహానటి” చిత్రాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న దుల్కర్ సల్మాన్ మలయాళంలో నటించిన చిత్రం “సోలో”. దుల్కర్ సరసన ధన్సిక, శ్రుతి హరిహరన్, నేహా శర్మ, ఆర్తి వెంకటేష్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని బిజోయ్ నంబియార్ తెరకెక్కించాడు. ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మలయాళ ప్రేక్షకులే పూర్తి స్థాయిలో ఆదరించలేకపోయారు. మరి మన తెలుగు ఆడియన్స్ కు నచ్చుతుందో లేదో చూడాలి.

కథ:
రెగ్యులర్ సినిమాల్లాంటి సినిమా కాదిది. నాలుగు కథలు, నాలుగు ప్రపంచాలు, నలుగురు వ్యక్తుల కథ ఇది. ప్రతి కథలోనూ చివరికి కథానాయకుడు ఒంటరిగా మిగిలిపోతాడు అందుకే మలయాళంలో ఈ చిత్రానికి “సోలో” అనే టైటిల్ పెట్టారు.

మొదటి కథ: శేఖర్
రాధిక (ధన్సిక) అనే తన జూనియర్ తనను ఇష్టపడుతుందని తెలుసుకొని ఆమెను ప్రేమిస్తాడు శేఖర్ (దుల్కర్ సల్మాన్). తర్వాత తెలుస్తుంది అమ్మాయి అంధురాలని. శేఖర్ కి నత్తి, ఏదైనా ఎమోషనల్ గా మాట్లాడాడంటే ఆటోమేటిక్ గా నత్తి వచ్చేస్తుంది. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకొని సాఫీగా జీవించాలనుకొంటారు. కానీ.. పెద్దలు వీరి పెళ్ళికి అంగీకరించరు, అయితే.. అప్పటికే రాధిక గర్భవతి అని తెలియడంతో వేరే దారి లేక ఇద్దరికీ పెళ్లి చేస్తారు. ప్రసవ సమయంలో మరణిస్తుంది రాధిక. ఆమెను తలుచుకుంటూ కూతుర్ని సాకుతూ బ్రతికేస్తుంటాడు శేఖర్.

రెండో కథ: త్రిలోక్
ఆయేషా (ఆర్తి వెంకటేష్) సైక్లింగ్ చేస్తుండగా అనుకోకుండా కారుతో గుద్దేస్తాడు ఓ బిజినెస్ మ్యాన్. ఆ విషయం బయటకి తెలియకుండా ఉండడం కోసం ఆమె శరీరాన్ని రోడ్డు మధ్యలో పాడేస్తాడు. సరిగ్గా అయిదేళ్ళ తర్వాత అదే రోడ్ లో ప్రయాణిస్తుండగా జస్టిన్ (అన్సోన్ పాల్)కి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు త్రిలోక్ (దుల్కర్ సల్మాన్). తాను గుద్ది చంపేసిన ఆయేషా భర్తే త్రిలోక్ అని తెలుసుకొన్న జస్టిన్ అతడికి క్షమాపణ చెప్పేలోపే.. జస్టిన్ ను చంపి తన భార్యను చంపినందుకు పగ తీర్చుకుంటాడు త్రిలోక్.

మూడో కథ: శివ
చిన్నప్పుడే తల్లి వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోవడంతో రౌడీలా తయారవుతాడు శివ (దుల్కర్ సల్మాన్). తన తమ్ముడు కూడా గ్యాంగ్ స్టర్ అవ్వడానికి మొగ్గు చూపుతున్నాడని తెలుసుకొని అతడ్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. భార్య రుక్కు (శ్రుతి హరిహరన్) మీద మాత్రం కోపం ఎక్కువ. అందుకు పెద్ద కారణం కూడా ఉండదు. సడన్ గా తన తండ్రిని ఎవరో బార్ లో గన్ తో షూట్ చేసి చంపారని తెలుసు షాక్ అవుతాడు. చంపిన వ్యక్తి ముంబై మాఫియాకి చెందినవాడని తెలుసుకొని అతడ్ని చంపడం కోసం ముంబై వెళతాడు.
కట్ చేస్తే.. తాను చంపాలని వచ్చింది ఎవరో కాదని, 20 ఏళ్ల క్రితం తన తల్లిని తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తేనని తెలుసుకొని కాల్పుల్లో మరణిస్తాడు. తండ్రితోపాటు తన అన్నను కూడా చంపిన వ్యక్తిని ఎలా అయినా చంపాలని నిశ్చయించుకొన్న శివ తమ్ముడు ముంబై డాన్ ను చంపేస్తాడు కానీ.. అక్కడ తల్లిని చూసి ఆశ్చర్యపోయి భయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు.

నాలుగో కథ: రుద్ర
రుద్ర రామచంద్రన్ (దుల్కర్ సల్మాన్) ఓ ఆర్మీ ట్రైనీ. ఆర్మీ మేజర్ కుమార్తె అక్షర (నేహా శర్మా)ను ప్రేమిస్తాడు. తన తండ్రితోపాటు, మేజర్ కూడా ఎన్నోసార్లు వద్దు అని చెప్పినా వినకుండా అక్షరతో చట్టపట్టాలేసుకొని తిరుగుతుంటాడు.
అయితే.. ఆర్మీలో ఉద్యోగం ఊడబీకిస్తానని మేజర్ బెదిరించడంతో.. వేరే ఊరికి ట్రాన్స్ ఫర్ మీద వెళతాడు రుద్ర. అయితే.. తాను తిరిగొచ్చేలోపు తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అక్షరకి పెళ్లి సెట్ అయ్యిందని తెలుసుకొని.. ఆమె తనను ఎందుకు వద్దనుకొందో తెలుసుకోవాలని పెళ్ళికి వెళ్తాడు. అక్కడ నానా గొడవ చేసిన తర్వాత తెలుస్తుంది.. అక్షర వరసకి తనకు చెల్లెలు అవుతుందని.
ఎందుకంటే.. మేజర్ భార్య, రుద్ర తండ్రి కొన్నాళ్లపాటు ప్రేమించుకొన్నారు.. ఆ సమయంలో ఆమె గర్భవతి అయితే ఆ విషయం బయటకి తెలియకుండా మేజర్ తో పెళ్లి చేస్తారు. పెళ్లి అయిన తర్వాత మేజర్ ఆ విషయాన్ని బయటకి చెప్పకుండా అక్షరను తన సొంత కూతుర్లా చూసుకొంటుంటాడు. ఈ విషయం తెలిసాక రుద్ర కూడా సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోతాడు.

ఈ నాలుగు కథలకి ఎక్కడా లింక్ ఉండదు. దుల్కర్ సల్మాన్ తప్ప ఏ క్యారెక్టర్ రిపీట్ కూడా అవ్వదు. అందుకే నలుగురివి నాలుగు ప్రపంచాలు అన్నట్లుగా దర్శకుడు బిజోయ్ ఎస్టాబ్లిష్ చేస్తాడు.

నటీనటుల పనితీరు:
శేఖర్ పాత్రలో నత్తి ఉన్న యువకుడిగా, త్రిలోక్ పాత్రలో డాక్టర్ గా, శివ పాత్రలో యంగ్ గ్యాంగ్ స్టర్ గా, రుద్ర పాత్రలో విపరీతమైన కోపం ఉన్న ఆర్మీ సోల్జర్ గా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ప్రతి పాత్రకి వేరియేషన్ కూడా విశేషంగా చూపించాడు. నిజానికి దుల్కర్ చేసింది ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. ఇలాంటి కథలను ప్రేక్షకులు ఏమేరకు స్వాగతిస్తారు అనే విషయాన్ని పట్టించుకోకుండా తనలోని నటుడ్ని ప్రూవ్ చేసుకొన్నాడు.
ధన్సిక, ఆర్తి వెంకటేష్, శ్రుతి హరిహరన్, నేహా శర్మలలో అందరి కంటే ఎక్కువగా ఆకట్టుకొంది మాత్రం ధన్సిక. అంధురాలిగా ఆమె అభినయం ప్రశంసనీయం. ఆర్తి వెంకటేష్ పాత్ర నిడివి చాలా తక్కువ. శ్రుతి హరిహరన్, నేహా శర్మలు సినిమాకి గ్లామర్ ను యాడ్ చేశారు.
అందరికంటే ఎక్కువగా ఆకట్టుకొంది మాత్రం నాజర్. చిన్న పాత్రే అయినప్పటికీ.. భారీ ట్విస్ట్ & సింపుల్ డైలాగ్ తో భీభత్సంగా నవ్వించాడు.

సాంకేతికవర్గం పనితీరు:
సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. మొత్తం 17 పాటలున్నాయి ఈ సినిమాలో. ఒక్క పాట కూడా బోర్ కొట్టించదు. ప్రతి పాట సందర్భానుసారంగా వస్తుంది. రెట్రో మిక్స్ ఉంది, ఫ్యూజన్ ఉంది, కర్ణాటిక్ ఉంది. రాక్ బ్యాండ్ ఉంది. ఇలా అన్నీ రకాల సంగీతంతో విశేషంగా ఆకట్టుకొన్నారు సంగీత దర్శకులు.
సినిమాటోగ్రాఫర్లు గిరీష్ గంగాధరన్-మధు నీలకందన్ లు సినిమాకి తమదైన పనితనం, డట్చ్ యాంగిల్స్ తో ఆకట్టుకొన్నారు. లైటింగ్ గురించి పర్టీక్యులర్ గా మెన్షన్ చేయాలి. పాత్రల్ మూడ్ ను బట్టి లైటింగ్ మెయింటైన్ చేసి వాళ్ళ ఫీలింగ్స్ ను ఆడియన్స్ ను ఇంకాస్త ఈజీగా అర్ధమయ్యేలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొన్నారు కెమెరామెన్లు.
ఎడిటింగ్ సినిమాకి పెద్ద ఎస్సెట్. నాలుగు విభిన్న కథలను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్ గా చూపించారు. అలాగే ప్రతి కథకు ఇచ్చిన ఇంట్రో ఆడియన్స్ కు క్లారిటీ ఇస్తుంది.

దర్శకుడు బిజోయ్ చాలా డిఫరెంట్ జెనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దుల్కర్ లాంటి నటుడు ఈ కథ ఒప్పుకొని నటించడం అతడి అదృష్టం. అయితే.. శివతత్వం అనేది ప్రతి కథలోనూ ఇనుమడించి సాధారణ కథలను కూడా అసాధారణంగా చూపించిన తీరు బాగుంది. తెరకెక్కించిన నాలుగు కథల్లో శివ, శేఖర్, త్రిలోక్ ల కథలన్నీ ఒకెత్తయితే.. ఒక్క రుద్ర కథ ఒకెత్తు. కథలోని ట్విస్ట్ అందుకు కారణం.
మన ఇండియన్ ఆడియన్స్ మైండ్ సెట్ గురించి అవగాహన ఉండి కూడా హీరోహీరోయిన్స్ నడుమ రొమాన్స్ అనంతరం వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళు అని ఎస్టాబ్లిష్ చేయడం గొప్ప సాహసమానే చెప్పాలి. ఆ ట్విస్ట్ ను ఎంతమంది స్వాగతిస్తారో తెలియదు కానీ.. రెగ్యులర్ మూవీ గోయర్స్ మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు ఆ ట్విస్ట్ రివీలింగ్ సీన్ ను రాసుకొన్న, తెరకెక్కించిన విధానం అలా ఉంటుంది.

విశ్లేషణ:
ఇది పూర్తిగా దర్శకుడి దృష్టికోణం నుంచి చూడాల్సిన సినిమా. కమర్షియన్ అంశాలతోపాటు కావాల్సినన్ని ట్విస్టులు పుష్కలంగా ఉన్న చిత్రం “అతడే”. డబ్బింగ్ వర్క్ కూడా బాగుంది. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ చిత్రాన్ని తప్పకుండా ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus