వచ్చే సినిమాలు అన్నీ విజయం సాధించాలని కోరుకోని వారు ఉండరు. అయితే అన్నీ హిట్ అయిపోతాయి అనుకోవడమూ అత్యాశే అనుకోండి. అయితే ఎక్కువ సినిమాలు విజయం సాధించాలి అనుకోవడంలో తప్పు లేదు కదా. అలానే ఆగస్టు నెలలో వచ్చే సినిమాల విషయంలోనూ కోరుకున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. అలా ఆగస్టు నెలలో 37 సినిమాలొచ్చాయి. అయితే అందులో విజయాలు అందుకున్నవి చాలా తక్కువే. ఆగస్టులో (August Month Review) భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు తేడా కొడితే..
ఆడతాయో ఆడవో అని డౌట్ పడుతూ వచ్చిన సినిమాలు మాత్రం అదిరిపోయే విజయాలు అందుకున్నాయి. అసలు ఆడవు అనుకునే సినిమాలు ఇంకా బాగా ఆడాయి. దీంతో ఆ సినిమాలు లేకుంటే ఆగస్టు.. వేస్టు అనేలా పరిస్థితి మారిపోయింది. ముందుగా దారుణమైన ఫలితం అందుకున్న సినిమాలు చూస్తే తొలుత ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart) , ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) పేర్లు చెప్పొచ్చు.
భారీ ప్రచారంతో వచ్చిన చిన్న సినిమాలు నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రొడ్యూస్ చేసిన ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) , నార్నె నితిన్ (Narne Nithin) ‘ఆయ్’ (AAY) మంచి విజయం అందుకున్నాయి. ఇక తమిళంలో బాగానే ఆడిన విక్రమ్ (Vikram) ‘తంగలాన్’ (Thangalaan) తెలుగులో ఆశించిన మేర ఆడలేదు. రావు రమేశ్ (Rao Ramesh) ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ (Maruthi Nagar Subramanyam) మోస్తరుగా ఆకట్టుకుంది. ఇక నాని (Nani) ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) మంచి టాక్ అందుకున్నా అప్పుడే పూర్తి ఫలితం చెప్పలేం.
రాజ్ తరుణ్ (Raj Tarun) ‘తిరగబడరా సామీ’, దర్శకుడు విజయభాస్కర్ (K. Vijaya Bhaskar) తనయుడు ‘ఉషా పరిణయం’, వరుణ్ సందేశ్ ‘విరాజి’, అశ్విన్ ‘శివం భజే’, అల్లు శిరీష్ (Allu Sirish) ‘బడ్డీ’ (Buddy) జగపతి బాబు (Jagapathi Babu) – అనసూయ (Anasuya Bhardhwaj) ‘సింబా’ (Simbaa), ‘సంఘర్షణ’, విజయ్ ఆంటోని (Vijay Antony) ‘తుఫాన్’ (Toofan) , ‘భవనమ్’, ‘యజ్ఞ’, ‘రేవు’ సినిమాలన్నీ ఆశించిన ఫలితం అందుకోలేదు. దీంతో ఈ నెల కూడా అంత బాగుందని చెప్పలేం.
పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయని ఒక వారం కొత్త సినిమాలకు, చిన్న సినిమాలకు ఛాన్స్ దక్కలేదు. ఒకవేళ అంచనాలు లేని ఆ చిన్న సినిమా వచ్చి ఉంటే మరో భారీ విజయం దక్కేదేమో అనే చర్చ కూడా సాగుతోంది.