కొన్నేళ్ల క్రితం సినిమా అనే ప్రస్తావ వస్తే చాలు.. ‘మూడు గంటల సినిమా’ అని చెప్పేవారు. అంతలా మూడు గంటల నిడివి సినిమాలకు అలవాటు అయిపోయింది. మూడు గంటల లోపు నిడివితో సినిమా వస్తే.. అదేదో కొత్త విషయంలా చూసేవారట. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రెండున్నర గంటల సినిమాల ట్రెండ్ నడుస్తోంది. కుదిరితే ఇంకాస్త తక్కువే అని చెప్పాలి. ఈ సిట్యువేషన్‌కు హాలీవుడ్ కూడా అతీతం కాదు. అయితే కొత్త ‘అవతార్’ మాత్రం మూడు గంటలకుపైగా నిడివితో వస్తోందట.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రన్‌టైమ్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘అవతార్2’ నిడివి 192 నిమిషాల, 10 సెకన్లు అట. అంటే 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు. ఇటీవల కాలంలో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలు ముందుకు రావడం అరుదు. ఇలాంటి సమయంలో ఈ సినిమాను ఇంత నిడివితో ఎందుకు తీసుకొస్తున్నారు అనేదే ప్రశ్న.
అయితే అంతసేపు ప్రేక్షకులను కూర్చోబెట్టే కథ, కథనాలు, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో ఉన్నాయట. ‘అవతార్ 2’ రన్ టైమ్ విషయంలో దర్శకుడు జేమ్స్ కామెరూన్ పూర్తి విశ్వాసంతో ఉన్నారట. మూడు గంటల పాటు మరో కొత్త ప్రపంచంలో ప్రేక్షకుడిని తీసుకెళ్లడం ఖాయమని ఆయన చెబుతున్నారట. అందుకే నిడివి అనేది తమ సినిమాకు పెద్ద సమస్య కాదని ఆయన చెబుతున్నారట. మొత్తం సినిమా అయ్యాక.. అప్పుడే అయిపోయిందా అనే ఫీల్ కూడా కలుగుతుంది అంటున్నారట ఆయన.
2009లో వచ్చిన మొదటి ‘అవతార్’ సినిమా రన్ టైమ్ 162 నిమిషాలే. అంటే 2 గంటల 42 నిమిషాలు. మొదటి భాగంతో పోలిస్తే, పార్ట్ 2లో అదనంగా దాదాపు మరో అరగంట నిడివి పెరిగింది. ఈ సినిమా విజయం సాధించి, మంచి డబ్బులు వస్తేనే ‘అవతార్ 4’, ‘అవతార్ 5’ తీసుకొస్తామని ఇప్పటికే జేమ్స్ కామెరూన్ తేల్చేసిన విషయం తెలిసిందే.