‘అయలాన్’… ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదలకు అంతా సిద్ధం అనుకుంటుండగా… హఠాత్తుగా రావడం లేదు అని వార్తలొచ్చాయి. సంక్రాంతి సినిమాల సీజన్‌లో థియేటర్ల దొరకడం కష్టం కదా అందుకే రాలేదు అనుకుంటే… ఆ తర్వాత రిలీజ్ అని చెప్పినా అప్పుడూ రాలేదు. దీంతో ఈ సినిమాకి ఏమైంది అనే ప్రశ్న మొదలైంది. ఈలోపు తమిళంలో ఆ సినిమా వచ్చేసి భారీ విజయం అందుకుంది. కానీ ఇప్పటివరకు తెలుగులో రాలేదు. పోనీ ఓటీటీలో అయినా చూద్దాం అనుకుంటే… అక్కడా కష్టమే అనిపిస్తోంది.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన తమిళ చిత్రాల్లో ‘అయలాన్’ ఒకకటి. శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందింది. ఆర్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సై – ఫై యాక్షన్ డ్రామా మంచి వసూళ్లనే అందుకుంది. కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంటుంది. దీంతో ఈ సినిమాను తెలుగులో చూద్దామని టాలీవుడ్ ప్రేక్షకులు రెడీ అయిపోయారు. థియేటర్‌లో రాకపోయేసరికి ఓటీటీలో చూద్దాం అనుకున్నారు. కానీ అక్కడా తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు.
ఈ నేపథ్యంలో అసలు (Ayalaan) ‘అయలాన్’ తెలుగు వెర్షన్ ఓటీటీలో వస్తుందా? లేదా? అనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే వచ్చేటట్లు ఉంటే ఈ పాటికే తమిళంతో ఇచ్చేసేవారు అని అంటున్నారు. మరికొందరు అయితే ఈ సినిమాను తెలుగులో ఏమైనా రీమేక్ చేస్తారా? అందుకే లేటు చేస్తున్నారా అని చర్చించుకుంటున్నారు. సినిమా కథేంటంటే… తామిజ్ (శివకార్తికేయన్) సాధారణ రైతు. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటాడు. లాభాల కన్నా నష్టాలే ఎక్కువ వస్తుంటాయి.
ఆశించిన దిగుబడి రాక అప్పులు పెరిగిపోవడంతో, తామిజ్‌ను అతడి తల్లి (భానుప్రియ) ఉద్యోగం చేయాలంటూ సిటీకి పంపిస్తుంది. ఫ్యూయల్‌కు ప్రత్యామ్నాయంగా నోవా గ్యాస్‌ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు సైంటిస్ట్ ఆర్యన్ (శరద్ కేల్కర్). గ్యాస్‌ను వెలికి తీయడానికి స్పార్క్ అనే గ్రహశకలాన్ని ఉపయోగిస్తుంటాడు. అయితే ఆఫ్రికాలో అతడు చేసిన ప్రయోగం వికటించి వందల మంది ప్రాణాలు కోల్పోతారు.
ఈసారి ఇండియాలో ఎవరికి తెలియకుండా ఓ మైన్‌లో రహస్యంగా ప్రయోగం చేస్తుంటాడు. అతడి దగ్గర ఉన్న స్పార్క్ కోసం వేరే గ్రహం నుంచి టట్టూ అనే ఏలియన్ భూమిపైకి వస్తుంది. ఆ ఏలియన్ తామిజ్‌ను ఎలా కలిసింది? ఆర్యన్ గ్యాంగ్‌తో ఏలియన్‌కు ఏర్పడిన సమస్య ఏంటి? అనేది కథ.