అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ ఇంకా దర్శకనిర్మాతల మీద ఉంది అని ప్రూవ్ చేస్తూ కొన్ని సినిమాలోస్తుంటాయి. అటువంటి సినిమానే “సిద్ధార్ధ్ రాయ్”. బాల నటుడు దీపక్ సరోజ్ కథానాయకుడిగా పరిచయమవుతూ నటించిన ఈ సినిమా టీజర్ & ట్రైలర్ పై ఆసక్తి నెలకొన్నప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్ కి మాత్రం ఎందుకో అది ఉపయోగపడలేదు. మరి సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!
కథ: చిన్నవయసులోనే బోలెడన్ని పుస్తకాలు చదివేయడం వల్ల.. విపరీతమైన జ్ణానం సంపాదించేసి, ప్రపంచంలో లాజిక్ తప్ప మారేదీ లేదు అని బలంగా నమ్మి, తను నమ్మిన బాటలో బ్రతుకుతున్న కుర్రాడు సిద్ధార్థ్ రాయ్ (దీపక్ సరోజ్). తిండి, నిద్ర, శృంగారం తప్ప మిగతావన్నీ ఫూలిష్ అని నమ్ముతుంటాడు.
అలాంటి వ్యక్తిత్వం ఉన్న సిద్ధార్ధ్ రాయ్ కాలేజ్ లో పరిచయమైన ఇందుమతి (తన్వి నేగి)ని ఘాఢంగా ప్రేమిస్తాడు. అయితే.. తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోవడంలో విఫలమై, ప్రేమిస్తున్న అమ్మాయి దూరమవుతుంది. ఆమెను మళ్ళీ తిరిగి పొందడానికి సిద్ధార్థ్ రాయ్ ఏం చేశాడు? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా దీపక్ సరోజ్ తన వయసుకు మించిన పాత్రను పోషించాడు. గెటప్ లో సహజత్వం లోపించింది. కొన్ని ఫ్రేమ్స్ లో అర్జున్ రెడ్డి స్పూఫ్ యాక్టర్ లా కనిపించాడే కానీ హీరోలా కనిపించలేదు. అయితే.. ఎమోషనల్ సీన్స్ లో అతడి నటన మాత్రం ఆకట్టుకునే స్థాయిలో ఉంది. కెమెరా అంటే భయం, మొహమాటం లేకపోవడం దీపక్ కి బిగ్గెస్ట్ ఎస్సెట్. సరైన కథ, పాత్ర ఎంచుకుంటే.. తెలుగులో చక్కని నటుడిగా ఎదిగే సత్తా ఉన్న నటుడు దీపక్ సరోజ్. హీరోయిన్ తన్వి నేగి నటిగా అలరించలేకపోయింది.
రోమాంటిక్ సీన్స్ & లిప్ లాక్స్ విషయంలో ఎలాంటి మొహమాటం చూపని తన్వి.. హావభావాల ప్రకటన విషయంలో మాత్రం చాలా మొహమాటపడింది. చాలా సన్నివేశాల్లో ఎమోషన్ కు సంబంధం లేని ఎక్స్ ప్రెషన్ తో ఇబ్బందిపెట్టింది. తల్లి పాత్రలో కళ్యాణి నటరాజన్ కు చక్కని స్క్రీన్ ప్రెజన్స్ లభించింది. ముఖ్యంగా కొడుకు ఎమోషన్ ను చాలా దగ్గరగా చూసిన సన్నివేశంలో ఆమె నటన, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. మిగతా నటులందరూ ఫర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: రధన్ పాటలు, సదరు పాటల ప్లేస్మెంట్ సినిమాకి మెయిన్ మైనస్ గా నిలిచింది. నేపధ్య సంగీతం కూడా సరిగా సింక్ అవ్వలేదు. చాలా సన్నివేశాల్లో ఎమోషన్ బాగున్నప్పటికీ.. ఆ ఎమోషన్ ను ఎలివేట్ చేసే నేపధ్య సంగీతం లేకపోవడం గమనార్హం. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.
దర్శకుడు యశస్వి రాసుకున్న కథలో దమ్ము ఉంది కానీ.. దాన్ని నడిపించిన విధానంలో పట్టు లేదు. అందువల్ల.. టీజర్ & ట్రైలర్ లో కాస్త ఆసక్తికరంగా కనిపించిన కథానాయకుడి క్యారెక్టరైజేషన్ సినిమాలో తేలిపోయింది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ ఇరికించాలనే ప్రయత్నంలో తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు, సంభాషణలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దర్శకుడిగా సీన్ కంపోజిషన్ విషయంలో మాత్రం కొన్ని సన్నివేశాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు.
విశ్లేషణ: ప్రతి భగ్న ప్రేమికుడు దేవదాసు అయిపోలేదు, ప్రతి కోపిష్టి ప్రేమికుడు అర్జున్ రెడ్డి అయిపోలేడు. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే ఈ తరహా సినిమాలు కోకొల్లలుగా వస్తుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేని ఓ వ్యక్తి కథ చెబుతున్నప్పుడు.. కథలో ఎమోషన్ ఏస్థాయిలో ఉండాలి అనే విషయాన్ని దర్శకుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటే “సిద్ధార్ధ్ రాయ్” కనీస స్థాయి విజయమైనా దక్కించుకొని ఉండేది.