అయోగ్య

  • August 10, 2019 / 04:48 PM IST

2015లో విడుదలై సరికొత్త ఎన్ఠీఆర్ ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన చిత్రం “టెంపర్”. పురీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం ఘన విజయం సొంతం చేసుకొంది. అనంతరం బాలీవుడ్లో రీమేకై కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రాన్ని విశాల్ తమిళంలో “అయోగ్య” పేరుతో రీమేక్ చేసాడు. ఇప్పుడు ఆ రీమేక్ వెర్షన్ ను తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదల చేశారు.

కథ: క్లైమాక్స్ మరియు కొన్ని యాక్షన్ బ్లాక్స్ తప్పితే సినిమా మొత్తం “టెంపర్” చిత్రానికి జిరాక్స్ కాపీలా ఉంటుంది కాబట్టి అనవసరంగా కథ అని మళ్ళీ చాంతాడంత ఉపోద్ఘాతం చెప్పడం అప్రస్తుతం.

నటీనటుల పనితీరు: విశాల్ మంచి నటుడే అయినప్పటికీ.. ఎన్ఠీఆర్/రణవీర్ సింగ్ (హిందీ వెర్షన్ హీరో)ల రేంజ్ లో నెగిటివ్ షేడ్ ఆకట్టుకోలేకపోయాడు. తమిళ ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ గా పెట్టుకొన్నారు కాబట్టి కొన్ని సన్నివేశాల్లో అతి ఎక్కువైనట్లు అనిపించినా తమిళ వెర్షన్ కి ఆమాత్రం లేకపోతే కష్టం కాబట్టి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు .

తెలుగు వెర్షన్ లో హీరోయిన్ గా నటించిన కాజల్ కంటే కాస్త అందంగానే కనిపించింది రాశీఖన్నా. పెర్ఫార్మెన్స్ & డ్యాన్సులతోను ఆకట్టుకొంది.

ప్రకాష్ రాజ్ కు ఏమాత్రం తగ్గకుండా పార్తిబన్ ప్రతినాయకుడి పాత్రలో విలనిజంతోపాటు కామెడీ కూడా పండించాడు.

పోసాని రేంజ్ లో కె.ఎస్.రవికుమార్ హెడ్ కానిస్టేబుల్ పాత్రలో ఆకట్టుకోలేకపోయాడు. మిగతా పాత్రధారులు పర్వాలేదనిపించుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు: సామ్ సి.ఎస్ సమకూర్చిన బాణీలు బాగున్నా.. మణిశర్మ రేంజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రంఅందించలేకపోయాడు. ఆ కారణంగా భీభత్సమైన ఇంటెన్సిటీ ఉన్న సన్నివేశాలు కూడా చాలా పేలవంగా సాగిపోతుంటాయి. ఇంటర్వెల్ బ్లాక్ అందుకు సరైన ఉదాహరణ.

దర్శకుడు తమిళ నేటివిటీకి తగ్గట్లుగా పెద్దగా మార్పులు చేసినట్లుగా కనిపించలేదు. క్లైమాక్స్ మాత్రం తమిళ ప్రేక్షకుల టేస్ట్ ను దృష్టిలో పెట్టుకొని యాంటీ క్లైమాక్స్ గా మార్చుకున్నాడు. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నా.. డబ్బింగ్ క్వాలిటీ మాత్రం బాగోలేదు. హీరోయిన్ మినహా ఎవరికీ వాయిస్ అనేది సూట్ అవ్వలేదు. డబ్బింగ్ వెర్షన్ డి.టి.ఎస్ మిక్సింగ్ కూడా సరిగాలేదు. చాలా సన్నివేశాల్లో డైలాగ్ వెర్షన్ ను బ్యాగ్రౌండ్ స్కోర్ ఓవర్ ల్యాప్ చేసింది. డి.టి.ఎస్ మిక్సింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఏర్పడిన సమస్య అది.

విశ్లేషణ: విశాల్ కు వీరాభిమాని అయితే తప్ప “అయోగ్య”ను థియేటర్లో చూడడం కాస్త కష్టమే. అందుకు కారణం సినిమా బాగోకపోవడం కాదు. ప్రతి ప్రేక్షకుడు ఆల్రెడీ థియేటర్లలో, యూట్యూబ్ లో “టెంపర్” సినిమాని ఒకటికి పదిసార్లు చూసేయడమే. ఈ విషయం తెలిసి కూడా “అయోగ్య” చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి మరీ ఎందుకు విడుదల చేశారు అనే విషయం నిర్మాతలకె తెలియాలి.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus