మేనేజ్మెంట్ విద్యార్థులకు కేస్ స్టడీగా బాహుబలి 2!

  • January 16, 2018 / 11:21 AM IST

ఒకరి కల.. ఎంతోమంది కళ… కలిసిన చిత్రం బాహుబలి. సినిమానే శ్వాసగా బతికే వేలాది మంది శ్రమించగా ఏర్పడిన అపురూప శిల్పం ఈ మూవీ. ఆ శ్రమ ప్రతి సినీ అభిమానికి తెలిసింది. అందుకే భాష బేధం, ప్రాంతీయ బేధం లేకుండా ఘన విజయం సాధించింది. 1800 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం అనేక అవార్డులను సైతం కొల్లగొట్టింది. దర్శకధీరుడు రాజమౌళితో పాటు ప్రభాస్, అనుష్క, తమన్నా, సత్యరాజ్ , రమ్యకృష్ణ.. ఇలా నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. అందుకే ఈ మూవీ విద్యార్థులకు పాఠంగా మారింది. అహ్మదాబాద్‌కి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సీఎఫ్‌ఐ (కాంటెంపరరీ ఫిలిం ఇండస్ట్రీ) విద్యార్థులకు “బాహుబలి 2 ” సినిమాను వారి సిలబస్‌లో చేర్చనున్నారు.

ఈ విషయాన్ని ఐఐఎం ప్రొఫెసర్‌ భరతన్‌ కందస్వామి మీడియా ద్వారా వెల్లడించారు. “2018 విద్యా సంవత్సరంలో బాహుబలి 2 సినిమాను సీఎఫ్‌ఐ విద్యార్థుల సిలబస్‌లో చేర్చనున్నాం. ఈ సినిమా ద్వారా సీక్వెల్స్‌ని మార్కెటింగ్‌ కాన్సెప్ట్‌గా వివరించేలా చేస్తాం. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలో సీక్వెల్‌ కంటే ప్రీక్వెలే బెటర్‌ అని తేలింది. కానీ ప్రీక్వెల్‌ కంటే సీక్వెల్‌ ద్వారానే సినిమాకు ఎక్కువ వసూళ్లు వస్తాయి. సినిమాల విషయంలో ఎలాంటి ప్రతిభావంతమైన నిర్ణయాలు తీసుకోవాలి? సీక్వెల్స్‌ నుంచి తెలుసుకోవాల్సిన మార్కెటింగ్‌ మంత్రాలేంటి? అన్న విషయాలు ఈ ఏడాది విద్యార్థులు తెలుసుకోబోతున్నారు”అని తెలిపారు. ఈ వార్త బాహుబలి టీమ్ కి మాత్రమే కాదు, ప్రతి తెలుగోడికి ఆనందాన్ని ఇస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus