‘బాహుబలి’ ఫీవర్ మళ్లీ మొదలైంది. ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రెండు భాగాలను కలిపి రీ రిలీజ్ చేయగా, థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే, సినిమా చూడటానికి వెళ్లిన ప్రేక్షకులకు రాజమౌళి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీలో నెక్స్ట్ రాబోతున్న ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ యానిమేషన్ మూవీ టీజర్‌ను థియేటర్లలో ప్రదర్శించారు.
ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది ‘బాహుబలి 3’ కాదని, కానీ కథకు కొనసాగింపు అని రాజమౌళి ముందే చెప్పారు. టీజర్ చూస్తే, బాహుబలి చిన్నతనం, శివగామితో బంధం, అతని మరణం తర్వాత ఆత్మ పై లోకాలకు వెళ్లడం వంటివి చూపించారు. అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.
దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగే యుద్ధంలో బాహుబలి.. రాక్షసుల పక్షాన నిలబడిన ‘మంచి వ్యక్తి’గా కనిపించి ఆసక్తి రేపాడు. ఈ కొత్త కాన్సెప్ట్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ యానిమేషన్ సినిమాకు యానిమేటర్ ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తుండగా, రాజమౌళి కథ, కథనం పర్యవేక్షిస్తున్నారు.
మేకర్స్ దీనిని ‘పార్ట్ 1’గా ప్రకటించారు. అంటే, ఈ యానిమేషన్ సిరీస్‌లో మరిన్ని భాగాలు రావడం ఖాయం. సుమారు 120 కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. గత రెండున్నరేళ్లుగా పనులు జరుగుతున్నాయని, పాత పాత్రలతో పాటు కొత్త క్యారెక్టర్లు కూడా ఇందులో కనిపిస్తాయని జక్కన్న తెలిపారు.
‘బాహుబలి‘ కథను కేవలం సినిమాలతో ముగించకుండా, ఇలా యానిమేషన్ రూపంలోనూ కొనసాగించడం ఫ్యాన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. 2026 లేదా 2027లో ఈ ‘ఎటర్నల్ వార్‘ పార్ట్ 1ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.