బాబు బంగారం

  • August 12, 2016 / 07:22 AM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. కేవలం హీరోయిజనికే కాకుండా కథకి విలువనిచ్చే వెంకీకి ఈమధ్య కాలంలో సోలో హీరోగా సరైన హిట్ లేదు. అందుకే తనకు బాగా అచ్చోచ్చిన కామెడీ జోనర్ లో ఓ మాంచి హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యి.. మారుతి చెప్పిన కథకు ఒకే చెప్పాడు. “భలే భలే మొగాడివోయ్”తో బంపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న మారుతి “బాబు బంగారం”గా వెంకటేష్ బాబుని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. వెంకీ సరసన నయనతార నటించిన ఈ చిత్రం నేడు (ఆగస్ట్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి “బాబు బంగారం” ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకొన్నాడు ? వెంకీకి సోలో హీరోగా సక్సెస్ దొరికిందా? లేదా? అనేది తెలుసుకొందాం..!!

కథ : అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణ (వెంకటేష్) “జాలి” అనే గుణం కాస్త ఎక్కువగా ఉన్న వ్యక్తి. తాను పట్టుకొనే దొంగలకి జలుబు చేసినా తట్టుకోలేని మృదు స్వభావి. ఒక ఇంపార్టెంట్ కేసు డీలింగ్ కోసం శైలజ (నయనతార)ను ప్రేమిస్తున్నట్లు నాటకమాడతాడు. శైలజ తండ్రి మూర్తి కోసం ఎమ్మెల్యే పుచ్చప్ప (పోసాని), రౌడీ షీటర్ యాదవ్ (సంపత్)లు వెతుకుతుంటారు.
అసలు కృష్ణ డీల్ చేస్తున్న కేస్ ఏంటి ? పుచ్చప్ప-యాదవ్ లు మూర్తి కోసం ఎందుకు వెతుకుతుంటారు ? అసలు శైలజ నాన్న మూర్తి ఎందుకు తప్పించుకు తిరుగుతుంటాడు? వంటి ప్రశ్నలకు సమాధానాల సమాహారమే “బాబు బంగారం” కథాంశం.

నటీనటుల పనితీరు : కృష్ణ పాత్రలో వెంకీ చాలా గ్లామరస్ గా కనిపించాడు. కామెడీ టైమింగ్ పరంగా తన అభిమానులను విశేషంగా అలరించిన వెంకటేష్ బాబు నిజంగానే “బంగారం” అనే స్థాయిలో పాత్రలో జీవించేశాడు. అందరిపై జాలి చూపిస్తూ వెంకీ పంచిన నవ్వులు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.

శైలజ అనే సాధారణ యువతి పాత్రలో నయనతార చక్కగా నటించింది. కాస్ట్యూమ్స్ పరంగా మాత్రం సరికొత్తగా కనిపించి అలరించింది.
బత్తాయ్ కాయల బాబ్జీగా పృధ్వీ నవ్వించడానికి వీరలెవల్లో ప్రయత్నించినప్పటికీ.. సన్నివేశంలో పట్టులేక ప్రేక్షకుడు సదరు కామెడీని మాత్రం ఎంజాయ్ చేయలేడు. ఎమ్మెల్యే పుచ్చప్పగా పోసాని, మల్లేష్ యాదవ్ గా సంపత్ ల పాత్రలు కేవలం అలంకార ప్రాయంగానే నిలిచాయి. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గిరిలు కూడా పోలీసు పాత్రల్లో నవ్వించడానికి విఫలయత్నాలు చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : రాను రాను జిబ్రాన్ “వైవిధ్యం” పేరిట చేస్తున్న ప్రయోగాలకు ప్రేక్షకుడు బాధపడాల్సి వస్తుంది. నేపధ్య సంగీతం వరకూ సోసోగా అనిపించినప్పటికీ.. సాంగ్స్ విషయంలో మాత్రం సహనానికి పరీక్ష పెట్టేశాడు. “మల్లెల వాన” పాట మినహా ఏ ఒక్క పాటకు వాయిస్ సూట్ అవ్వలేదు. ఇక “బొబ్బిలిరాజా” చిత్రంలోని “బలపం పట్టి” పాటను రీమిక్స్ చేసిన విధానం సదరు పాట ఒరిజినల్ ఫ్లేవర్ ను పూర్తి స్థాయిలో పాడుచేశాడు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్, ప్రతి ఆర్టిస్ట్ ను అందంగా చూపించాడు. లైటింగ్ ఎఫెక్ట్ ను కూడా చక్కగా యూటిలైజ్ చేసుకొన్నాడు.

ఎడిటర్ ఎస్.బి.ఉద్ధవ్ వాడిన స్లయిడ్ ఎఫెక్ట్స్ సీన్ టు సీన్ కెనెక్టివిటీకి సింక్ అవ్వలేదు. అలాగే ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసే సీన్స్ ను ఇంకాస్త సరిగా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. రిపీటెడ్ సీన్స్ ను తగ్గించాల్సింది. రామ్-లక్ష్మణ్ లు కంపోజ్ చేసిన ఫైట్స్ ను వెంకటేష్ బాబు ఫ్యాన్స్ ను అలరించినా.. రెగ్యులర్ సినిమా ఆడియన్స్ ను మాత్రం విసిగిస్తాయి. కాస్త అతి తగ్గించి ఉంటే ఇంకాస్త బాగుండేది. డార్లింగ్ స్వామి దర్శకుడు మారుతితో కలిసి రాసిన సంభాషణాలు చాలా పేలవంగా ఉన్నాయి. పైగా ఒక్క కామెడీ పంచ్ కూడా పేలకపోవడం గమనార్హం.

రచన-దర్శకత్వం : కెరీర్ మొదట్లో “బూతు దర్శకుడు” అనిపించుకొన్నా కమర్షియల్ గా సక్సెస్ లు సొంతం చేసుకొని తనవి “బూతు సినిమాలు” అన్నవారికే మార్గ దర్శకుడిగా నిలిచాడు మారుతి. ఆ తర్వాత “భలే భలే మొగాడివోయ్”తో సూపర్ హిట్ అందుకొని తనలో చాలా మేటర్ ఉందని చెప్పకనే చెప్పాడు. బహుశా ఆ సినిమా చూసే మారుతికి అవకాశం ఇచ్చాడు వెంకటేష్.

అయితే.. “బాబు బంగారం”తో వెంకటేష్ తనపై పెట్టుకొన్న ఆశల్ని మాత్రమే కాక ప్రేక్షకుల అంచనాలను కూడా పాతాళానికి తోక్కేశాడు మారుతి. మరి స్టార్ డమ్ మాయలో పడ్డాడో లేక దర్శకుడిగా తాను సక్సెస్ అయిపోయానని భ్రమలో మునిగితేలుతున్నాడో తెలియదు కానీ.. కథ-కథనాల విషయంలో తీసుకోవాల్సిన కనీస స్థాయి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. మూలకథను నాగార్జున నటించిన “నిర్ణయం” నుంచి స్పూర్తి పొందగా.. విలన్ చుట్టూ మ్యూజీషియన్లు ఉండడం అనేది “మిస్టర్ ఇండియా, ఖతర్నాక్” సినిమాల నుంచి స్పూర్తి పొందాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి లెండి.

మొత్తానికి.. “భలే భలే మగాడివోయ్”తో “భళిరా” అనిపించుకొన్న మారుతి “బాబు బంగారం”తో “బాబోయ్” అనిపించాడు.

విశ్లేషణ : వెంకటేష్ సినిమా అంటే భీభత్సమైన కథ, కథనాలు ఉండాలని ఎవరూ ఆశించారు. కాసిన్ని నవ్వులు, ఆకట్టుకొనే కథనముంటే చాలనుకొంటారు. “బాబు బంగారం”లో లోపించినవి అవే. యూట్యూబ్ లో చూసి చూసి బోర్ కొట్టేసిన కామెడీ సీన్లు, వాట్సాప్ లో షేర్ చేయగా చదివేసిన పంచ్ డైలాగులు కుప్పలుతెప్పలుగా నిండిపోయిన “బాబు బంగారం’ సోలో హీరోగా హిట్టు కొట్టాలన్న వెంకీ కలను నీరుగార్చిందనే చెప్పాలి.
అయితే.. వెంకటేష్ వీరాభిమానులకు మాత్రం ఈ చిత్రం ఓ మోస్తరుగా అలరించవచ్చు.

రేటింగ్ : 2.25/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus