తమన్నాకి ఫ్లాపులు కొత్తేమీ కాదు. కానీ.. “బాహుబలి” తర్వాత “ఎఫ్ 2″తో హిట్ కొట్టి ఆ హిట్టు ద్వారా మరో అయిదారు సినిమాలు తన ఖాతాలో చేర్చుకొందామని కాస్త గట్టిగానే ప్రయత్నించింది తమన్నా. “ఎఫ్ 2” సినిమాని బాలీవుడ్ దర్శకనిర్మాతలకు, తన మిత్రులకు స్పెషల్ షో వేసి మరీ చూపించి ఆ సినిమా అక్కడ రీమేక్ అవ్వడానికి దిల్ రాజుకి తోడ్పడింది. కానీ.. “ఎఫ్ 2” తర్వాత తమన్నా నటించిన “అభినేత్రి 2, ఖామోషీ” సినిమాలు వారం గ్యాప్ లో విడుదలయ్యాయి. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వడమే కాదు నటిగా తమన్నా స్థాయిని దిగజార్చిన సినిమాలుగా నిలిచాయి.
ముఖ్యంగా.. “అభినేత్రి 2” కోసం తమన్నాతో చేయించిన అనవసరమైన ఓవర్ ఎక్స్ పోజింగ్ సినిమాకి ఎంతవరకూ యూజ్ అయ్యిందో తెలియదు కానీ.. తమన్నా తడి అందాలు కూడా ప్రేక్షకుల్ని పులకరింపజేయలేకపోయాయి. ఇక మూగ, చెవుడు అమ్మాయిగా నటించిన “ఖామోషీ” అనే హిందీ సినిమాకి ఏకంగా 0.5 రేటింగ్ రావడం నటిగా ఆమె స్థాయిని దిగజార్చడమే కాక.. ఆమె మార్కెట్ కు కూడా గట్టిగా దెబ్బపడేలా చేసింది. మరి ఈ స్లంప్ పొజిషన్ నుంచి తమన్నా ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.