NBK 111: బాలయ్యతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు

నటసింహం బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. ఒకపక్క ‘అఖండ 2’ రిలీజ్ మీద ఉండగానే, మరోపక్క గోపీచంద్ మలినేనితో తన 111వ సినిమాను గ్రాండ్‌గా మొదలుపెట్టేశారు. ‘వీరసింహారెడ్డి’ లాంటి మాస్ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందంటే, సహజంగానే అంచనాలు ఫ్యాక్షనో, పవర్ ఫుల్ యాక్షన్ డ్రామనో అనుకుంటారు. కానీ, ఈరోజు విడుదలైన పోస్టర్స్, కాన్సెప్ట్ ఆర్ట్ చూస్తుంటే గోపీచంద్ ఏదో పెద్ద సాహసమే చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది రొటీన్ మాస్ సినిమా కాదని, ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న విజువల్ వండర్ అని క్లియర్‌గా హింట్ ఇచ్చేశారు.

NBK 111

రిలీజ్ చేసిన పోస్టర్‌ను గమనిస్తే రెండు విభిన్నమైన ప్రపంచాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సముద్రం మధ్యలో నిలబడిన ఒక రగ్గడ్ యోధుడి లుక్. చేతిలో గొడ్డలి లాంటి ఆయుధంతో, జుట్టు పెంచి చాలా వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. మరోవైపు కోట బురుజు మీద, రాజసం ఉట్టిపడేలా కవచాలు ధరించి నిలబడిన రాజు లాంటి గెటప్. అంటే ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయడం ఖాయం అనిపిస్తోంది. ఒకరు సముద్రపు దొంగనా? మరొకరు రాజ్యానికి రక్షకుడా? అనే క్యూరియాసిటీని ఈ ఒక్క పోస్టర్ క్రియేట్ చేసింది.

స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేని దీన్ని “హిస్టారికల్ రోర్” అని అభివర్ణించారు. అంటే బాలయ్య కెరీర్‌లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత రాబోతున్న మరో చారిత్రాత్మక చిత్రమిది. బాలయ్యకు ఇలాంటి పౌరాణిక, జానపద పాత్రలు వెన్నతో పెట్టిన విద్య. అయితే గోపీచంద్ మలినేని లాంటి పక్కా కమర్షియల్ డైరెక్టర్, ఇలాంటి జోనర్‌ను టచ్ చేయడం నిజంగా ఆసక్తికరం. ఇది కేవలం చరిత్రే కాదు, అందులో తన మార్క్ మాస్ ఎలివేషన్స్ కూడా గట్టిగానే దట్టించినట్లు ఆ విగ్రహాల డిజైనింగ్ చూస్తే అర్థమవుతోంది.

సాధారణంగా బాలయ్య సినిమాల్లో డైలాగులు పేలుతాయి. కానీ ఈసారి విజువల్స్ కూడా పేలేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తున్న ఆ మబ్బులు, ఆ కోట గోడలు, సముద్రపు అలలు చూస్తుంటే బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా తగ్గలేదనిపిస్తోంది. పోస్టర్లో కనిపిస్తున్న ఆయుధాల డిజైనింగ్ కూడా చాలా కొత్తగా, పురాతన కాలం నాటి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. దీన్ని బట్టి గోపీచంద్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారని స్పష్టమవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags