బాలకృష్ణ టైటిల్ పై కన్నేసిన అల్లరి నరేష్..!

అప్పట్లో కామెడీ చిత్రాలకి ‘కేర్ ఆఫ్ అడ్రెస్స్’ అంటే అందరికీ డైరెక్టర్ ఇ.వి.వి. సత్యనారాయణ గారి సినిమాలే గుర్తొచ్చేవి అనడంలో అతిశయోక్తి లేదు. తరువాత అయన కొడుకులను ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లను హీరోలుగా పరిచయం చేసారు. అయితే ఆర్యన్ రాజేష్ హీరోగా నిలదొక్కుకోలేకపోగా… అల్లరి నరేష్ మాత్రం కామెడీకి బ్రాండ్ హీరో అయిపోయాడు. కానీ ఇ.వి.వి. సత్యనారాయణ గారు చనిపోయిన తరువాత ఒక్క ‘సుడిగాడు’ మినహాయిస్తే నరేష్ కి ఒక్క హిట్టు కూడా దక్కలేదు. కథలను ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నాడో ఏమో… హిట్టు సాధించలేకపోతున్నాడు.

ప్రస్తుతం అల్లరి నరేష్… మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షి’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీని తరువాత నందినీ ‘నర్సింగ్ హోమ్’ వంటి డీసెంట్ హిట్ ఇచ్చిన గిరి డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి `బంగారు బుల్లోడు` అనే పేరును ప‌రిశీలిస్తున్నారట. నందమూరి బాలకృష్ణ నటించిన సూప‌ర్ హిట్ సినిమాల్లో ఇదికూడా ఒకటి. కేవలం టైటిల్ వాడుకోవడమే కాదు.. ఆ సినిమాలోని `స్వాతిలో ముత్య‌మంత` అనే సూపర్ హిట్ పాట‌ని రీమిక్స్ చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న అనిల్ సుంక‌ర.. బాల‌కృష్ణకి పెద్ద అభిమాని కాబట్టి ఈ టైటిల్ ను… పాటను వాడుకోవాలని ఫిక్స్ అయ్యారట. గతంలో న‌రేష్‌ పాత టైటిళ్ళు .. , పాట‌లు చాలా వాడుకున్నాడు. చిరంజీవి, కృష్ణ వంటి పెద్ద హీరోల సినిమాల్లోని సూప‌ర్ హిట్ పాట‌ల్ని కూడా రీమిక్స్ చేయించి వాడుకున్నాడు. ఈక్రమంలో బాల‌య్య ను కూడా వాడేస్తున్నాడన్నమాట. మరి ఇలాగైనా నరేష్ కి హిట్టు దక్కుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus