కొన్నేళ్ల క్రితం టాలీవుడ్‌లో రోజుల తరబడి సినిమా షూటింగ్‌లు ఆపి, మీటింగ్‌లు పెట్టి పెద్ద ప్రహసనమే చేశారు గుర్తుందా? ప్రహసనం అంటారేంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు కదా అని అంటారా? ఆ సమయంలో మన నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు, చేసిన శపథాలు ఏమయ్యాయో మీకు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే.. ఇలాంటి బంద్‌నే మలయాళ సినిమా పరిశ్రమ త్వరలో స్టార్ట్ చేయబోతోంది. అవును, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే / జరగకపోతే జూన్ 1 నుండి మలయాళ (Mollywood) సినిమా పరిశ్రమలో బంద్ చేపట్టాలని అక్కడి నిర్మాతలు ఫిక్స్ అయ్యారు.
తక్కువ బడ్జెట్‌తో క్వాలిటీ కంటెంట్ అందించడంలో మళయాళ (Mollywood) సినిమాకి మంచి పేరు ఉంది. థ్రిల్లర్స్, ఫీల్ గుడ్ సినిమాలకు ప్రసిద్ధి. లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఆ సినిమాలు బాగా కనెక్ట్ అయిపోయాయి. దీంతో అక్కడ బంద్ మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పాలి. కేరళ సినిమా ఫెడరేషన్ సమ్మె ప్రకటించడంతో చర్చ మెల్లగా మొదలైంది. ఈ బంద్‌కి కారణమేంటి అనేది చూస్తే.. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ అని చెబుతున్నారు. ఆ రోజు నుండి మొత్తంగా షూటింగ్స్ బంద్ చేస్తామని సినిమా ఫెడరేషన్ చెబుతోంది. దీంతో రిలీజ్‌లు ఇప్పటికే ప్రకటించేసిన సినిమాల తేదీల పరిస్థితి ఏంటి అనేది అర్థం కావడం లేదు.
అలాగే ఈ ప్రయత్నం ఎంతవరకు మంచి ఫలితం ఇస్తుంది అనేది కూడా చూడాలి. మలయాళ (Mollywood) సినిమా ఇప్పుడెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందా అని చూస్తే.. రీసెంట్ టైమ్స్‌లో సినిమాలకు పేరొస్తున్నా డబ్బులు ఆ స్థాయిలో రావడం లేదు. ఒక్క జనవరిలోనే మలయాళ (Mollywood) సినిమా పరిశ్రమకు రూ. 100 కోట్ల నష్టం వచ్చింది అని చెబుతున్నారు. 28 సినిమాలు వస్తే ఒక్క సినిమా ‘రేఖాచిత్రం’ మాత్రమే ఆడింది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు పరిశ్రమ బంద్‌ల వరకు వెళ్లింది. అయితే మన పరిశ్రమ తరహాలో వ్రతఫలం దక్కనట్లు ఉండకూడదు.