బండ్ల గణేష్.. కెరీర్ ప్రారంభంలో కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ మళ్ళీ మళ్ళీ గుర్తుతెచ్చుకుని నవ్వుకునేలా.. అతను కామెడీ పండించిన సినిమాలు తిప్పి కొడితే ఒకటి రెండు మాత్రమే ఉంటాయి. వాటిలో కూడా అతని పాత్ర నిమిషాల వరకే ఉంటుంది. కానీ సినిమాల్లో కంటే కూడా ఈయన నిజ జీవితంలోనే ఎక్కువ కామెడీ చేస్తూ ఉంటాడు అనేది వాస్తవం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలకు హాజరైతే మాత్రం ఇతనికి పూనకం వచ్చేస్తుంది. ఈ మాట అతనే చెప్పాడు. మొన్న జరిగిన ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కంటే బండ్ల గణేష్ స్పీచే ఎక్కువ హైలెట్ అయ్యిందని చెప్పాలి.
24 గంటలు దాటినా కూడా బండ్ల గణేష్ స్పీచ్ యూట్యూబ్లో ట్రెండింగ్ నెంబర్ 2 లో ఉండటం విశేషం. దిల్ రాజు ఛానల్ లో అప్లోడ్ అయిన ఈ స్పీచ్ ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ ను దాటేసింది. ఆదిత్య మ్యూజిక్ ఛానెల్లో కూడా ఇతని స్పీచ్ ను అప్లోడ్ చెయ్యగా అందులో 1.2 మిలియన్ పైనే వ్యూస్ ను నమోదు చేసింది. ‘ఏడు కొండల వాడికి అన్నమయ్య.. శివుడికి భక్తకన్నప్ప.. శ్రీరాముడికి హనుమంతుడు.. పవన్‌కల్యాణ్‌కు బండ్ల గణేశ్’ అంటూ మొదలైన బండ్లన్న బిస్కట్లు 7 నిమిషాల వరకూ ఆగలేదు.
ఇదంతా పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం కోసం బండ్ల గణేష్ చేసిన హడావిడే అని కొంతమంది విమర్శిస్తున్నప్పటికీ.. పవన్ అభిమానులకు మాత్రం ఇతని స్పీచ్ ఫుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ‘వకీల్ సాబ్’ ట్రైలర్ కంటే కూడా ఎక్కువగా బండ్ల గణేష్ స్పీచ్ కు సంబంధించిన వీడియో క్లిప్స్ ను వాట్సాప్ స్టేటస్ లు గా పెట్టుకుని పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ‘వకీల్ సాబ్’ టీం ప్రమోషన్స్ ఎంత చేసినా.. బండ్ల గణేష్ స్పీచ్ మాత్రం వాటిని డామినేట్ చేసేసి.. సినిమాని ఫస్ట్ డే చూసెయ్యాలి అనే ఆసక్తిని కలుగజేసింది అనే చెప్పాలి.