Bangarraju Review: బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 14, 2022 / 04:23 PM IST

2016లో విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న “సోగ్గాడే చిన్ని నాయన”కు సీక్వెల్ గా రూపొందిన చిత్రం “బంగార్రాజు”. నాగచైతన్య-నాగార్జున కలిసి పూర్తిస్థాయిలో నటించిన మొదటి చిత్రమిది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!


కథ: ప్రతి రెండు పుష్కరాలకు ఒకసారి జరిగే శివ పూజ నిర్విఘ్నంగా జరగడానికి యముడు (నాగబాబు), ఇంద్రుడు (రవి) కలిసి బంగార్రాజు (నాగార్జున)ను భూమి మీదకు పంపుతారు. లోక కళ్యాణార్ధం చిన్న బంగార్రాజు (నాగచైతన్య), నాగలక్ష్మి (కృతిశెట్టి)ల పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు పెద్ద బంగార్రాజు. ఈ క్రమంలో చిన్న బంగార్రాజుకి ప్రాణాపాయం ఉందని గ్రహిస్తాడు. అసలు చిన్న బంగార్రాజుకు ఎవరి నుంచి ప్రాణహాని ఉంది? శివ పూజ జరిగిందా? బంగార్రాజు తన వంశాన్ని కాపాడుకోగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే “బంగార్రాజు”.


నటీనటుల పనితీరు: నాగార్జున ఈ చిత్రంలో మూడు వేరియేషన్స్ లో కనిపించి అలరించాడు. ముఖ్యంగా రాముగా ముసలి గెటప్ లో గ్రే హెయిర్ లో కనిపించే నాగార్జున లుక్ చాలా బాగుంటుంది. నాగచైతన్య మెచ్యూర్డ్ గా కనిపించాడు. డిఫరెంట్ వేరియేషన్స్ ను చక్కగా పలికించాడు. రమ్యకృష్ణ రోల్ చాలా కీలకం, ఆ ఎలివేషన్ ను అలాగే మైంటైన్ చేసింది రమ్యకృష్ణ. కృతిశెట్టి ఎక్స్ ప్రెసివ్ గా నటించింది కానీ.. అమ్మాయి ముఖ్యంలో మునుపటి కళ కనబడలేదు. సంపత్ రాజ్, రావు రమేష్, ప్రవీణ్, రోహిణి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: కళ్యాణ్ కృష్ణ ఈ కథ రాయడానికి దాదాపుగా నాలుగేళ్ళు తీసుకున్నాడు. ఒకానొక సందర్భంలో ఇక ఈ సినిమా సీక్వెల్ ఉండదు అని ఫిక్స్ అయిపోయారు కొందరు. అలాంటిది తను రాసిన కథతో నాగార్జునను మెప్పించి, సినిమా తెరకెక్కించి, ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని, దర్శకుడిగా, కథకుడిగా తన సత్తా చాటుకున్నాడు. నాగార్జున-నాగచైతన్య కాంబినేషన్ సీన్స్ తో అక్కినేని అభిమానులను మాత్రమే కాక ప్రతి తెలుగు ప్రేక్షకుడ్ని సంతుష్టులను చేశాడు కళ్యాణ్ కృష్ణ.

ఒక్క ట్యూన్ ను ఇన్ని రకాలుగా వినిపించొచ్చా అని షాక్ ఇచ్చాడు అనూప్ రూబెన్స్. ఆల్మోస్ట్ ప్రతి పాట ఒకేలా ఉన్నా.. పిక్చరైజేషన్ పుణ్యమా అని ప్రేక్షకులు పట్టించుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కొత్తగా ఇచ్చాడు. యువరాజ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. గ్రాఫిక్స్ & సీజీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. సునామీ ఎపిసోడ్ & స్నేక్ ఫైట్ భలే ఎంగేజ్ చేశాయి.

విశ్లేషణ: పండక్కి పర్ఫెక్ట్ సినిమా “బంగార్రాజు”. నాగచైతన్య నటన, నాగార్జున స్క్రీన్ ప్రెజన్స్, క్లైమాక్స్ కోసం ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలి. కళ్యాణ్ కృష్ణ ఎలివేషన్స్ సినిమాకి భలే హై ఇచ్చాయి. ప్రేక్షకులు కోరుకునే అన్నీ అంశాలు ఉన్న మంచి కమర్షియల్ సినిమా ఇది.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus