బంగారు బుల్లోడు సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 23, 2021 / 04:10 PM IST

“సుడిగాడు” తర్వాత హీరోగా సుడి కోల్పోయిన అల్లరి నరేష్ నటించగా 2019లో షూటింగ్ ప్రారంభించుకున్న చిత్రం “బంగారు బుల్లోడు”. గత ఏడాది కరోనా వల్ల రిలీజ్ అవ్వలేక ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైందీ చిత్రం. మరి నరేష్ కెరీర్ కు ఈ చిత్రం ఈమేరకు హెల్ప్ అయ్యింది? నరేష్ ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న హిట్ ను తెచ్చిపెట్టిందా లేదా అనేది చూద్దాం..!!

కథ: పచ్చని పల్లెటూరులో గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగం చేసే భవాని ప్రసాద్ (అల్లరి నరేష్) తన తాతయ్యకు ఇచ్చిన మాట కోసం 100 సవర్ల బంగారం బ్యాంక్ నుంచి దొంగచాటుగా బయటకు తీసుకొస్తాడు. అలా బ్యాంక్ కు తెలియకుండా తెచ్చిన బంగారాన్ని ప్రసాద్ ఎలా మ్యానేజ్ చేసాడు? ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు? ఇంతకీ తాతయ్యకు ఇచ్చిన మాటకి, 100 సవర్ల బంగారానికి సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “బంగారు బుల్లోడు” చిత్రం.

నటీనటుల పనితీరు: అల్లరి నరేష్ కి ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. అందువల్ల పెద్దగా కష్టపడకుండా ఎప్పట్లానే సింపుల్ గా ప్రసాద్ పాత్రను రక్తి కట్టించేసాడు. అయితే.. అతడి పాత్రతో పండించాల్సిన స్థాయి కామెడీ మాత్రం పండించలేకపోయాడు దర్శకుడు. కామెడీకి చాలా స్కోప్ ఉన్న పల్లెటూరు నేపథ్యంలో అనవసరమైన కామెడీ ట్రాక్స్ ఇరికించి ఆడియన్స్ ను చిరాకు పెట్టాడు. పూజా ఝవేరి స్వతహా డ్యాన్సర్ కావడం ఆమెకు ప్లస్ అయ్యింది. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధ్యాన్యత లేకపోయినప్పటికీ తన గ్లామర్ & డ్యాన్స్ తో ఆడియన్స్ ను అలరించడానికి ప్రయత్నించింది. స్నేహితుడి పాత్రలో ప్రవీణ్, వడ్డీ వ్యాపారిగా పోసాని ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్ ను కూడా సరిగా వినియోగించుకోలేకపోయారు.

సాంకేతికవర్గం పనితీరు: సాయి కార్తీక్ సంగీతం సోసోగా ఉంది. నేపధ్య సంగీతం కూడా బాగోలేదు. ఇక పనిగట్టుకొని “స్వాతిలో ముత్యమంత” పాటను రీమిక్స్ చేసి చెడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో. ఆ పాట చిత్రీకరణ కూడా బాగోలేదు. నటీనటులు డ్యాన్స్ పరంగా కష్టపడినప్పటికీ.. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ మరీ లేకిగా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ, డి.ఐ, కలరింగ్ వంటి విషయాల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. దర్శకుడు గిరి పాలిక రాసుకున్న కథ 90ల కాలం నాటిది అయితే.. ఆ కథను తెరకెక్కించడానికి ఎంచుకున్న కథనం 80ల కాలం నాటిది. సరైన స్క్రీన్ ప్లే లేక, సన్నివేశానికి సన్నివేశానికి నడుమ సంబంధం లేక, థియేటర్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు బుర్ర గోక్కునేలా చేసాడు గిరి. పాత కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాలి కానీ, ఇలా ప్రేక్షకుల బుర్ర తినకూడదు అనేది దర్శకుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.

విశ్లేషణ: అల్లరి నరేష్ కెరీర్ కి మరో మైనస్ గా మారిన సినిమా “బంగారు బుల్లోడు”. ఆ జబర్దస్త్ కామెడీలు, సంబంధం లేని సన్నివేశాలు, పస లేని ఎమోషన్స్, ఇలా బోలెడు మైనస్ పాయింట్స్ ఉన్న ఈ బోరింగ్ బుల్లోడిని, సారీ బంగారు బుల్లోడిని థియేటర్లో రెండు గంటలు కూర్చుని చూడడం కష్టమే!

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus