బ్రతికినప్పుడు ఎంత ఆర్భాటంగా జీవించామని కాదు, చనిపోయిన తర్వాత అన్నాళ్లపాటు బ్రతికిన వ్యక్తిని జనాలు ఎలా గుర్తుంచుకొన్నారనే దానిమీద ఆ వ్యక్తి కీర్తిప్రతిష్టలు ఆధారపడి ఉంటాయి. అయితే.. దర్శక దిగ్గజం, కమల్ హాసన్-రజనీకాంత్ వంటి నటులను సూపర్ స్టార్లుగా మార్చిన దర్శకశిల్పి కె.బాలచందర్ మరణానంతరం యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం వారి గురించి మాట్లాడుకొన్నారు. దహన సంస్కారాలు మొదలుకొని అన్నీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి, అన్నీ పేపర్లలో కె.బాలచందర్ ఘనతల గురించి అద్భుతమైన పద సంపదను సమీకరించి అత్యధుతమైన ఆర్టికల్స్ రాయడం జరిగింది.
ఈ హడావుడి మొత్తం ఒక వారం పాటు జరిగింది. ఆ తర్వాత అప్పుడప్పుడు టీవీలో ప్రసారమయ్యే బాలచందర్ సినిమాలను చూసి ఆయన్ను గుర్తు చేసుకోవడం తప్పితే ఆయన మరణానంతరం ఆయన కుటుంబం ఎలా ఉంది? వారి జీవనం ఎలా సాగుతుంది? అని ఆలోచించిన నాధుడు లేదు. ఏముంది స్టార్ హీరోలతో సినిమాలు చేశారు కదా.. కోట్లలో సంపాదించి ఉంటారు. ఆ డబ్బులతో వారి కుటుంబం సంతోషంగా బ్రతుకుతుంది అనుకొంటుంటారు. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. వారి కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. ఏ స్థాయి కష్టమంటే.. ఆయన మరణానంతరం ఇంటిపై తీసుకొన్న బ్యాంక్ అప్పు తీర్చలేక ఇంటినే వేలం వేసే స్థాయికి చేరుకొన్నారు. 1.39 కోట్ల రూపాయల అప్పు తీర్చకపోవడంతో బ్యాంక్ వారు బాలచందర్ ఇంటిని వేలానికి ప్రకటించారు. బాలచందర్ అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం తీసుకొన్న అప్పుల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. ఏదేమైనా ఓ అగ్ర దర్శకుడి ఇల్లు వేలానికి రావడం అనేది సిగ్గుపడాల్సిన విషయం. మరి వారి శిష్యగణంలో ఎవరైనా ముందుకు వచ్చి వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేస్తారో లేదో చూడాలి.