Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అంకిత్ కొయ్య (Hero)
  • నిలాఖి పాట్రా (Heroine)
  • నరేష్, వాసుకి ఆనంద్, నితిన్ ప్రసన్న, సోనియా చౌదరి (Cast)
  • జె.ఎస్.ఎస్.వర్ధన్ (Director)
  • విజయ్ పాల్ రెడ్డి - ఉమేష్ భన్సాల్ (Producer)
  • విజయ్ బుల్గానిన్ (Music)
  • శ్రీ సాయికుమార్ ధారా (Cinematography)
  • ఎస్.బి.ఉద్భవ్ (Editor)
  • Release Date : సెప్టెంబర్ 19, 2025
  • వానరా సెల్యులాయిడ్ (Banner)

నటుడిగా నిలదొక్కుకుంటున్న అంకిత్ కొయ్య హీరోగా పరిచయమవుతూ నటించిన చిత్రం “బ్యూటీ”. “భలే ఉన్నాడే”తో తన ప్రతిభను చాటుకున్న వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మారుతి సమర్పించగా.. ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం..!!

Beauty Movie Review

కథ: కన్నకూతుర్ని గుండెల్లో పెట్టుకుని బ్రతికే తండ్రి నారాయణ (నరేష్). కూతురు అడిగిందని అప్పు చేసి మరీ స్కూటీ కొనిచ్చి తాను ఇబ్బందిపడే తండ్రి. అటువంటి తండ్రిని, కుటుంబాన్ని తొందరపాటు నిర్ణయం వల్ల వదిలేసి.. ప్రేమించిన అబ్బాయి అర్జున్ (అంకిత్ కొయ్య)తో హైదరాబాద్ వెళ్ళిపోతుంది అలేఖ్య (నిలాఖి).

ప్రేమ మొహంలో హైదరాబాద్ మహానగరంలో అర్జున్-అలేఖ్య ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? వాళ్లని వెతుక్కుంటూ వెళ్లిన తండ్రి నారాయణ చవిచూసిన చేదు నిజాలు ఏమిటి? అనేది “బ్యూటీ” కథాంశం.

నటీనటుల పనితీరు: ఒడియా నటి నిలాఖి ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పొచ్చు. ఆమె చురుకుదనం, హావభావాలు ఆమె పోషించిన అలేఖ్య పాత్రకు ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా చేశాయి.

అంకిత్ కొయ్య తనలోని కొత్త కోణాన్ని ఈ చిత్రంతో పరిచయం చేశాడు. అతడి వాచకం, స్క్రీన్ ప్రెజన్స్ అతని ప్లస్ పాయింట్స్. మంచి కథలు ఎంచుకుంటే నటుడిగా గొప్ప స్థాయికి ఎదుగుతాడు.

నరేష్ మరోసారి తన సీనియారిటీ సత్తాను చాటుకున్నాడు. ఓ ఆడపిల్ల తండ్రిగా ఆయన తన అనుభవాలను పంచుకుంటూ ఉంటే.. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడమే కాదు, ఆయన కళ్ళల్లో బాధని, భయాన్ని వాళ్లు కూడా అనుభవిస్తారు.

వాసుకి ఆనంద్ మధ్యతరగతి తల్లి పాత్రలో మరోసారి కట్టిపడేసింది. ముఖ్యంగా గోల్డ్ షాప్ సీక్వెన్స్ లో ఆమె నటన హైలైట్ గా నిలుస్తుంది. అలాగే.. కన్నకూతురు బాగు కోసం బాధపడే ఓ సగటు తల్లిగా ఆమె బాధపడే సన్నివేశం కూడా చాలా సహజంగా ఉంటుంది.

నితిన్ ప్రసన్న, సోనియా చౌదరి కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: విజయ్ బుల్గానిన్ సంగీతం సినిమాలోని ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అతని మార్క్ మెలోడీ మనసుకి హత్తుకుంటుంది. అలాగే టెన్షన్ క్రియేట్ చేయడంలోనూ మంచి కీరోల్ ప్లే చేశాడు విజయ్.

సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ డీసెంట్ గా ఉన్నాయి.

దర్శకుడు జె.ఎస్.ఎస్.వర్ధన్ తెలిసిన కథను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో తడబడ్డాడు. అయితే.. కొన్ని సన్నివేశాలను మాత్రం చాలా ఇంపాక్ట్ ఫుల్ గా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఆఖరి నిమిషాలు మంచి టెన్షన్ క్రియేట్ చేస్తాడు. అయితే.. ఇదే తరహా కథ-కథనంతో ఆల్రెడీ “బుట్టబొమ్మ” సినిమా వచ్చి ఉండడంతో ట్విస్టులను పెద్దగా ఎంజాయ్ చేయలేం. కానీ.. రియాలిటీ చెక్ మాత్రం గట్టిగా ఇచ్చాడు. ఆ మానభంగం సీక్వెన్స్ ను మాత్రం ఇంకాస్త సెన్సిబుల్ గా డీల్ చేసి ఉంటే బాగుండేది. అంత హింస అవసరమా అనిపించింది. ఓవరాల్ గా.. దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్నాడు వర్ధన్.

విశ్లేషణ: కొన్ని కథలు నవ్విస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి, ఇంకొన్ని భయపెడతాయి, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. “బ్యూటీ” మాత్రం భయపెడుతూ ఆలోచించేలా చేస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ చిత్రం ఓ స్వీట్ వార్నింగ్ లాంటిది. సమాజంలో ఆడపిల్లలకు ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి, వాటి నుండి వారిని కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి వంటి విషయాలు చాలా గట్టిగానే చెప్పింది ఈ చిత్రం.

ఫోకస్ పాయింట్: ఆడపిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఓ మేలుకొలుపు!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus