2023 Rewind: 2023లో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న పరభాషా చిత్రాలు!

  • January 6, 2024 / 12:43 PM IST

కంటెంట్ బాగుండాలే కానీ కొరియన్ సినిమాకు కూడా హయ్యస్ట్ నైజాం కలెక్షన్స్ ఇవ్వగలిగే మంచి మనసున్నవారు మన తెలుగు ప్రేక్షకులు. అందుకే.. మనోళ్ళకి భాషాబేధం లేదు. సినిమా బాగుందని టాక్ వస్తే చాలు థియేటర్ల ముందు బారులు తీరుతారు. అలా 2023లో తెలుగు ప్రేక్షకులు ఆదరించిన పరభాషా చిత్రాల లిస్ట్ ఏమిటో చూద్దాం..!!

తమిళ్:

1. జైలర్

రజనీకాంత్ కు మంచి కమ్ బ్యాక్ సినిమా మాత్రమే కాదు, హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రంగా పేరు తెచ్చుకుంది జైలర్. మునుపటి సినిమాలతో పోల్చి చూస్తే రజనీకి సరిగ్గా ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదు. కానీ.. ఆయన స్టైల్ & చరిష్మాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. నెల్సన్ మార్క్ ఎలివేషన్స్ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్.

OTT: Amazon Prime

2. మావీరన్

కంటెంట్ పరంగా చూసుకుంటే.. 2023లో వచ్చిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా ఉంటుంది మావీరన్. కాన్సెప్ట్ నుంచి సీన్ కంపోజీషన్ వరకూ ప్రతీదీ చాలా కొత్తగా ఉంటుంది. శివకార్తికేయన్ నటన, దర్శకుడు మండేలా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటాయి. కమర్షియల్ హిట్ సాధించలేకపోయినా, బెస్ట్ సినిమాగా మాత్రం మిగిలిపోయింది.

OTT: Amazon Prime

3. మామనన్

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన వడివేలును సరికొత్తగా చాలా సీరియస్ రోల్లో చూపించిన సినిమా “మామనన్”. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ కి ఉన్న రిపీట్ వేల్యూ & ఎలివేషన్ రేంజ్ వేరే లెవల్ అంతే. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అనువదించి విడుదల చేశారు.

OTT: Netflix

4. పోర్ తొలిళ్

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం “పోర్ తొలిళ్”. అశోక్ సెల్వన్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సైకో థ్రిల్లర్.. విగ్నేష్ రాజా దర్శకత్వ ప్రతిభ కారణంగా భాషా బేధం లేకుండా అన్నీ ప్రాంతాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

OTT: SonyLiv

5. దాదా

తమిళ బెస్ట్ మూవీస్ ఆఫ్ 2023లో మొదటి స్థానంలో నిలవదగ్గ చిత్రం “దాదా”. మూలకథ మన “చిత్రం” సినిమాను గుర్తు తెచ్చినప్పటికీ.. కథనంలోని ఎమోషన్స్ & బాండింగ్ అద్భుతంగా ఉంటాయి. కెమెరా వర్క్, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్.. ఇలా ప్రతి టెక్నికాలిటీ బాగుంటాయి. కవిన్ నటన, గణేష్ కె.బాబు దర్శకత్వం సినిమాకి మెయిన్ ఎస్సెట్స్.

OTT: Amazon Prime

6. విడుదల పార్ట్ 1

వెట్రిమారన్ సినిమాల్లో ఒక నిజాయితీ ఉంటుంది. అట్టుడికిపోయిన వర్గాల కష్టాలను, బాధలను చాలా సజహంగా తెరపై ప్రెజంట్ చేస్తాడు. గతేడాది విడుదలైన “విడుదల పార్ట్ 1” కూడా ఆ తరహా సినిమానే. కమెడియన్ సూరీ కథానాయకుడిగా, విజయ్ సేతుపతి కీలకపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.

OTT: Zee5

7. పోన్నియన్ సెల్వన్ పార్ట్ 2

క్యారెక్టర్స్ మరీ ఎక్కువ అయిపోవడం వల్ల తెలుగులో చాలా మందికి ఈ సినిమా అర్ధం కాలేదు కానీ.. విజువల్ గా మంచి గ్రాండియర్ ఉన్న సినిమా “పోన్నియన్ సెల్వన్”. అయితే.. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కి మంచి పేరొచ్చింది. మణిరత్నం మార్క్ టేకింగ్, రవివర్మన్ సినిమాటోగ్రఫీ, రెహమాన్ సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్స్.

OTT: Amazon Prime

8. గుడ్ నైట్

“గురక” గురించి సినిమా ఏంట్రా అనుకున్నారు జనాలు “గుడ్ నైట్” ట్రైలర్ చూసి. అయితే.. ఓ సున్నిత మనస్కురాలు ఆ గురక కారణంగా ఎంత ఇబ్బందిపడింది అనేది అద్భుతంగా ప్రెజంట్ చేసి.. చక్కని లవ్ స్టోరీగా మలిచారు “గుడ్ నైట్” చిత్రాన్ని. మంచి స్లీపర్ హిట్ ఈ చిత్రం. మణికందన్, మీఠా రగునాధ్ ల నటన భలే ఉంటుంది.

OTT: Disney+Hotstar

9. చిత్తా

సిద్ధార్ధ్ కెరీర్ అయిపోయింది అనుకునే తరుణంలో నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా తన అభిరుచి చాటుకొన్నాడతను. చైల్డ్ ఎబ్యూజ్ మూల కథగా తెరకెక్కిన “చిత్తా”లో పండిన ఎమోషన్స్ & బాబాయ్-కూతురు మధ్య బాండింగ్ ను అద్భుతంగా చూపించిన విధానం ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా ఆకట్టుకుంది.

OTT: SonyLiv

10. జిగర్తాండ డబుల్ ఎక్స్

కార్తీక్ సుబ్బరాజుకు చాన్నాళ్ల తర్వాత వచ్చిన విజయం “జిగర్తాండ డబుల్ ఎక్స్”. లారెన్స్, ఎస్.జె.సూర్యల అద్భుతమైన నటనకు, సంతోష్ నారాయణ సంగీతం తొడవ్వడంతో ఈ చిత్రం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

OTT: Netflix

మలయాళం:

1. రోమాంచం

మలయాళంలో ఓ పెద్ద సినిమా ఘన విజయం సాధిస్తేనే మహా అయితే 50 కోట్లు వసూలు చేస్తున్న సందర్భంలో.. దాదాపుగా కొత్త వాళ్ళతో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రం ఏకంగా 70 కోట్ల కలెక్షన్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒటీటీలో విడుదలయ్యాక ఈ సినిమాను మరింత మంచి ఆస్వాదించారు.

OTT: Disney+Hotstar

2. పూక్కలమ్

షష్టిపూర్తి కూడా జరుపుకున్న ఓ జంట ఉన్నపళంగా విడాకులు తీసుకోవాలనుకుంటుంది. దాంతో కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కాన్సెప్ట్ సోసోగా ఉన్నా కథనం మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది. ఎన్నో అద్భుతమైన ఎమోషన్స్ ను పండించారు. ముఖ్యంగా హాస్యం ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్.

OTT: Disney+Hotstar

3. 2018

2018లో కేరళలో వచ్చిన వరదల నేపధ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అసలు అంత తక్కువ బడ్జెట్ లో ఆ స్థాయి ప్రొడక్షన్ డిజైన్ ఎలా సాధ్యపడింది అనేది పెద్ద ప్రశ్న. బాలీవుడ్ అయితే.. ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ చూసి అవాక్కైపోయింది. మేకింగ్ మాత్రమే కాదు ఎమోషన్స్ కూడా చాలా చక్కగా వర్కవుటయ్యాయి.

OTT: SonyLiv

4. ఆర్.డి.ఎక్స్

మంచి యాక్షన్ సినిమాలు అంటే మనకి ఎప్పుడు హాలీవుడ్ లేదా కొరియన్ సినిమాలు మాత్రమే గుర్తొస్తాయి. అయితే.. గతేడాది మలయాళంలో విడుదలైన “ఆర్.డి.ఎక్స్” ఆ లోటు తీర్చేసింది. అత్యద్భుతంగా కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్.

OTT: Netflix

5. కన్నూర్ స్క్వాడ్

డీలింగ్ పరంగా తమిళ చిత్రం “ఖాకీ”ని గుర్తి చేసినప్పటికీ.. ఒక సిన్సియర్ పోలీస్ టీం ఎలా వర్క్ చేస్తుంది, డిపార్ట్మెంట్ వారికి ఏమేరకు సహాయపడుతుంది. వంటి విషయాలను ఎంతో సహజంగా చూపించిన చిత్రమిది. మమ్ముట్టి నటన సినిమాకి మెయిన్ ఎస్సెట్.

OTT: Disney+Hotstar

కన్నడ:

1. హాస్టల్ హుడుగరు బేకాగిద్దరే

ఒక పాయింట్ గా చూస్తే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ఎవరూ ముందుకి రారు. కానీ.. సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్ తో చేసిన మ్యాజిక్ ఈ సినిమాను కన్నడ టాప్ మూవీగా నిలిపింది. సినిమాలోని కామెడీని యూత్ ఆడియన్స్ విశేషంగా ఎంజాయ్ చేశారు.

OTT: Zee5

2. సప్తసాగరదాచే ఎల్లో సైడ్ ఏ

ఈమధ్యకాలంలో భగ్న ప్రేమకథలు అనేసరికి “అర్జున్ రెడ్డి”లు మాత్రమే గుర్తొస్తున్నాయి. కానీ.. భగ్న ప్రేమికుడు ఎలా ఉండాలో చూపించిన సినిమా “సప్తసాగరదాచే ఎల్లో”. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం మొదటి భాగానికే మంచి రెస్పాస్న్ వచ్చింది. రక్షిత్ శెట్టి నటన, రుక్మిణీ వసంత్ లుక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. అయితే.. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ & హేమంత్ రావు రచన ఈ చిత్రానికి బిగెస్ట్ ఎస్సెట్.

OTT: Amazon Prime

3. ఆచార్ & కో

1960 నేపధ్యంలో సాగే చిత్రమిది. పది మంచి సంతానం గల ఓ కుటుంబం సమాజం మరియు ఇంట్లో పెద్దరికం, గౌరవం, ఆచారాల పేరిట జరిగే మామూలు అన్యాయాలను ఎదిరించి ఎలా నిల్చుంది అనేది సినిమా కాన్సెప్ట్. చాలా మంది కనెక్ట్ అవుతారు.

OTT: Amazon Prime

హిందీ:

1. 12th ఫెయిల్

గతేడాది విడుదలైన భారతీయ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా నిలుస్తుంది “12th ఫెయిల్”. ఓ సామాన్యుడు ఐ.పి.ఎస్ అధికారిగా ఎలా ఎదిగాడు అనే విషయాన్ని చాలా ఎమోషనల్ గా ప్రెజంట్ చేశాడు దర్శకుడు విధు వినోద్ చోప్రా. ఈ సినిమా మనోజ్ కుమార్ శర్మ అనే అధికారి బయోపిక్ కావడం మరో విశేషం. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది.

OTT: Disney+Hotstar

2. యానిమల్

రాంగోపాల్ వర్మ తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రణబీర్ నటన, యాక్షన్ బ్లాక్స్, సాంగ్స్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్.. ఇలా అన్నీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచినవే. ఈ సినిమా ఒటీటీ విడుదల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు.

OTT: Netflix

3. పఠాన్

షారుక్ ఖాన్ కమ్ బ్యాక్ ఫిలిమ్ ఇది. గ్రాఫిక్స్ పరంగా చాలా వీక్ సినిమా అయినప్పటికీ.. సల్మాన్ స్పెషల్ ఎంట్రీ, యాక్షన్ బ్లాక్స్ & మ్యూజిక్ ను జనాలు బాగా ఎంజాయ్ చేసి 1000 కోట్ల కలెక్షన్ ను కట్టబెట్టారు.

OTT: Amazon Prime

4. జవాన్

షారుక్ ఖాన్ రెండో వెయ్యి కోట్ల సినిమా ఇది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం సౌత్ ఆర్టిస్టులైన విజయ్ సేతుపతి, నయనతార కీలకపాత్రలు పోషించడం విశేషం. టెక్నికల్ గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అని చెప్పాలి. ఫైట్స్ & ఎలివేషన్స్ ను అట్లీ డిజైన్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.

OTT: Netflix

5. రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ

కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మూలకథ పరంగా “బొమ్మరిల్లు”ను గుర్తు చేసినప్పటికీ.. సినిమాలో డిస్కస్ చేసిన చాలా పాయింట్స్ ప్రెజంట్ జనరేషన్ ఆడియన్స్ కు నచ్చాయి. ఇక రణవీర్ సింగ్ & ఆలియా భట్ నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

OTT: Amazon Prime

6. ఓ మై గాడ్ 2

పేరుకి అక్షయ్ కుమార్ సినిమా అయినప్పటికీ.. ఈ సినిమా మొత్తం నడిపించేది మాత్రం పంకజ్ త్రిపాఠి. స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఆవశ్యకత నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లేవనెత్తిన ప్రశ్నలు, అందుకు ఇచ్చిన సమాధానాలు ఆకట్టుకుంటాయి.

OTT: Netflix

7. గుల్మొహర్

ప్రతి కుటుంబంలోనూ సమస్యలుంటాయి. ఆ సమస్యలను అధిగమించి ఓ కుటుంబం ఎలా ముందుకు సాగింది అనే దాన్ని బట్టి సదరు కుటుంబ సభ్యులా గొప్పదనం ఆధారపడి ఉంటుంది. అదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. మనోజ్ బాజ్ పాయ్ నటన సినిమాకి మెయిన్ ఎస్సెట్.

OTT: Disney+Hotstar

8. సత్య ప్రేమ్ కి కథ

తమ జీవిత భాగస్వామి చేసిన తప్పులు అంగీకరించి, వారికి అండగా నిలిచే ఔన్నత్యం చాలా తక్కువమందిలో ఉంటుంది. ఆ ఔన్నత్యపు గొప్పదాన్ని, అవసరాన్ని ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసిన చిత్రమే “సత్య ప్రేమ్ కి కథ”. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీల నటన చాలా సహజంగా ఉంటుంది.

OTT: Amazon Prime

9. గదార్ 2

సన్నీ డియోల్ అనే నటుడు ఉన్నాడనే విషయం ప్రస్తుత తరానికి పెద్దగా తెలియదు. అలాంటి తరుణంలో “గదార్ 2′ బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల కలెక్షన్ సాధించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఫిజిక్స్ తో సంబంధం లేని యాక్షన్ బ్లాక్స్ & ఓవర్ సెంటిమెంట్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ను విశేషంగా అలరించింది.

OTT: Zee5

10. త్రీ ఆఫ్ అజ్

చిన్నప్పటి ప్రేమలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ ప్రేమను ఓ 30 ఏళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుంది. ఇది ఆకర్షణ కాదు, వాంఛ కాదు. కేవలం ఇష్టపడిన వ్యక్తి మీద ఉన్న అభిమానం. ఈ తేడాను తెరపై చూపించడం అంత సులువైన విషయం కాదు. కానీ.. దర్శకుడు అవినాష్ అరుణ్ చేసి చూపించాడు. షెఫాలీ షా, జయదీప్ ఆహ్లావత్ ల నడుమ జరిగే నాన్ సెక్సువల్ కెమిస్ట్రీ తెరపై చూడడానికి చాలా బాగుంటుంది.

OTT: Netflix

11. జోరామ్

తనకు పుట్టిన కూతురు కోసం జనావాసంలో కలిసిపోవాలనుకున్న ఓ మాజీ నక్సలైట్ ఎదుర్కొన్న కష్టాలను ఎంతో హృద్యంగా చూపించిన సినిమా “జోరామ్”. అడవిలో జరిగే అరాచకాలు, పోలీసు జులుం, ప్రభుత్వ అలసత్వం తెరపై నిక్కచ్చిగా చూపించిన విధానానికి సలాం. మనోజ్ బాజ్ పాయ్ నటన, దేవాశిష్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అత్యద్భుతంగా ఉంటాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus