భాగ్యశ్రీ భోర్సే.. అందం ఉంది, డ్యాన్స్ ఉంది, నటన ఉంది, క్రౌడ్ పుల్ చేయగల సామర్థ్యామూ ఉంది, ఫిజిక్కూ ఉంది. కానీ సరైన విజయమే లేదు. దానికి కారణం ఆమె కథల ఎంపికనా, లేక ఎంచుకున్న కథలను ఆ దర్శకులు సరిగ్గా తీయకపోవడమా అనేది తెలియాలి. ఏదైతేనేం ఆ హీరోయిన్‌కి సరైన విజయం దక్కడం లేదు. అగ్ర హీరోల సినిమాలు, యంగ్ స్టార్‌ల సినిమాలు కూడా కలసి రాలేదు. సినిమా బాగుందని తొలి రోజు టాక్ వచ్చినా, రెండో రోజుకి ఆ టాక్ నిలబడటం లేదు. దీంతో ఆమె ఇప్పుటు ట్రాక్ మార్చింది.
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమైంది. భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రచార చిత్రాలో భలే హైలైట్ అయింది. దాంతో ఆ సినిమా విడుదల కావడానికి ముందే మంచి హైప్ సంపాదించింది. వరుస అవకాశాలు కూడా అందుకుంది. అలా ‘కింగ్డమ్’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలు వచ్చాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు ముందే ఓకే చేసిన ‘కాంత’ సినిమా కూడా వచ్చింది. కానీ ఇవేవీ ఆమెకు విజయాలు అందించలేదు. దీంతో ‘హీరో’యిన్ ఓరియెంటెడ్ కథకు ఓకే చెప్పిందని సమాచారం.
స్వప్న సినిమాస్ బ్యానర్‌లో భాగ్యశ్రీ ఒక సినిమా చేయబోతోందట. అది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని సమాచారం. రమేష్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తెరకెక్కిస్తారట. అంతేకాదు ఈ సినిమాకు ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా’ అనే పేరు పరిశీలిస్తున్నారట. మామూలుగా అయితే హీరోయిన్లు పెద్ద స్టార్లుగా ఎదిగాకే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తారు. కానీ భాగ్యశ్రీ అప్పుడే చేసేస్తోంది. అంటే హీరోలు హిట్లు ఇవ్వడం లేదని.. ఇలాంటి ఆలోచన చేసిందేమో మరి. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో విడుదల చేస్తారట.
ఇక ఈ సినిమా కాకుండా అఖిల్ కొత్త సినిమా ‘లెనిన్’ సినిమాలోనూ భాగ్యశ్రీనే కథానాయిక. ఈ సినిమా విజయం అటు హీరోకి, ఇటు హీరోయిన్‌కి చాలా అవసరం.