టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర మరో ఆసక్తికర పోరు జరగబోతోందా? లేక సంధి జరగబోతోందా? మంగళవారం రాత్రి నుండి సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. కారణం ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్‌ను తాజాగా కన్‌ఫామ్ చేయడమే. అయితే ఫిబ్రవరి 25 లేదంటే ఏప్రిల్ 1 అంటూ ఆ మధ్య ‘భీమ్లా నాయక్’ టీమ్ అనౌన్స్ చేసింది. పరిస్థితుల బట్టి సినిమా రిలీజ్ డేట్ మళ్లీ చెబుతాం అన్నారు. పరిస్థితులు సెట్ అవుతుండటంతో ఫిబ్రవరి 25 డేట్ ఫిక్స్ చేసేశారు. దీంతోనే అసలు సమస్య మొదలైంది.
‘భీమ్లా నాయక్’ టీమ్ నుండి తాజా అప్‌డేట్ రాకపోవడంతో ‘ఆడాళ్లూ మీకు జోహార్లూ’, ‘గని’, ‘సెబాస్టియన్’ లాంటి సినిమాలు ఫిబ్రవరి 25 డేట్‌ను అనౌన్స్ చేసేశాయి. కానీ ఇప్పుడు ఆ డేట్‌కి వస్తామంటూ ‘భీమ్లా ..’ టీమ్ సోమవారం రాత్రి చెప్పేసింది. దీంతో ‘భీమ్లా నాయక్’తోపాటు ఆ సినిమాలు తీసుకొస్తారా? లేదా అనేది ఇంకా తేలలేదు. ఎందుకంటే పెద్ద సినిమాతో పాటు వచ్చి థియేటర్లు సంపాదించడం కష్టం. అలాగే ఆ ప్రభావం వసూళ్ల మీద కూడా ఉంటుంది.
మరోవైపు ఇప్పుడు ‘భీమ్లా నాయక్’, ‘గని’ ఒకే రోజు వస్తే బాబాయ్ – అబ్బాయ్ మధ్య వార్ అని లేని పోని ప్రచారం మొదలవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇదేమంత మంచిది కాదు. అలాగే మిగిలిన సినిమాలతో పోలిస్తే ‘భీమ్లా నాయక్’కు ఉండే రీచ్ ఎక్కువ. కాబట్టి దీనికే ఎక్కువ థియేటర్లు వస్తాయి. మరోవైపు ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. మిగిలిన సినిమాలు తర్వాత అనౌన్స్ చేసినవి.
సంక్రాంతి సమయంలో కూడా తొలుత డేట్ ప్రకటించినా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ కోసం ‘భీమ్లా నాయక్’ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆ పరిస్థితి రాకూడదు. గతంలో ‘భీమ్లా…’ డేట్‌ను మార్పించిన నిర్మాత దిల్ రాజు ఈ సారి ఏం చేస్తారో చూడాలి అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మిగిలిన సినిమాల కోసం ‘భీమ్లా నాయక్’ వెనకుడుగు వేసే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇట్స్ పే బ్యాక్ టైమ్ టు టాలీవుడ్ అన్నమాట.