Bheemla Nayak Review: భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 25, 2022 / 01:54 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం “భీమ్లా నాయక్”. రానా మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకుడు కాగా త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందించారు. మలయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పనుమ్ కౌశియుమ్”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మరి భీమ్లా ఆ అంచనాలను అందుకోగలిగాడా లేదా చూడాలి.

కథ: ఆంధ్రా బోర్డర్ లోని ఏజెన్సీ ప్రాంతం సి.ఐ భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్). మందు బోటళ్లతో బోర్డర్ దాటుతున్న డానియల్ శేఖర్ (రానా)ను అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకొస్తాడు. స్టేషన్ కి వచ్చాక డాని పరిచయాలు తెలుసుకొని ఎందుకొచ్చిన గొడవ అని సైలెంట్ అవుతాడు. అయితే.. తనను స్టేషన్ కి తీసుకొచ్చాడనేది ఈగోకి తీసుకొని.. నాయక్ ఉద్యోగాన్ని ఊడబీకిస్తాడు డాని. అలా మొదలైన ప్రచ్చన్న యుద్ధం.. చివరికి ఎక్కడి దాకా వెళ్లింది అనేది “భీమ్లా నాయక్” కథ.

నటీనటుల పనితీరు: పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్యారెక్టర్ అయితే అతని బెస్ట్ ఇస్తాడో అలాంటి క్యారెక్టర్ “భీమ్లా నాయక్”. పవన్ కళ్యాణ్ లోని కోపం, కచ్చితత్వం, అలసట అన్నీ ఈ పాత్రలో ప్రస్పుటించాయి. నాయక్ పాత్రలో పవన్ జీవించేశాడు. రానాతో తలపడే సన్నివేశాలు కావచ్చు, పోలీస్ గా అధికారి ముందు తలవంచకుండా సన్నివేశాలు కావచ్చు పవన్ మార్క్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం తీసిపోని పాత్రలో రానా దగ్గుబాటి కనిపించాడు.

మంచోడే కానీ తలపొగరు పట్టిన యువకుడిగా రానా పాత్ర తీరుతెన్నులు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ ముందు ఠీవీగా, గర్వంతో నిలబడే రానాను చూస్తే ముచ్చటేస్తుంది. మురళీశర్మకు మళ్ళీ మంచి పాత్ర దొరికింది. కేవలం సైడ్ క్యారెక్టర్ లా కాకుండా, కీలకమైన పాత్ర పోషించి నటుడిగా తన సత్తాను చాటుకున్నాడు మురళీ శర్మ. నిత్యామీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, రఘుబాబు, రవి వర్మ తదితరులు తమ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాకి సెకండ్ హీరో తమన్. సాధారణంగా సన్నివేశంతో సంబంధం లేకుండా బీజీయమ్ తో ఆడియన్స్ కు మంచి హై ఇచ్చే తమన్.. “అరవింద సమేత” తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు సన్నివేశంలోని ఎమోషన్ తో సమానమైన నేపధ్య సంగీతం అందించాడు. రానా అడవిలో నడుచుకుంటూ వెళ్ళే సన్నివేశంలో తమన్ ఇచ్చే బీజీయమ్ ఒన్నాఫ్ హిజ్ బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ & ప్రొడక్షన్ వర్క్ మెయిన్ ఎస్సెట్స్. అయితే.. ఆర్ట్ డిపార్ట్మెంట్ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. సరిగ్గా గమనిస్తే చాలా తప్పులు దొర్లాయి ఆర్ట్ వర్క్ విషయంలో.

స్క్రీన్ ప్లే పరంగా త్రివిక్రమ్ చేసిన మార్పులు కమర్షియల్ గా ఓ మోస్తరుగా బానే వర్కవుటయ్యాయి. అయితే.. పవన్ ని దేవుడు అని ఎలివేట్ చేయడం కోసం చేసిన ప్రయత్నమే మైనస్ గా మారింది. క్లైమాక్స్ లో మార్పు కోసం ఇరికించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫైట్ వరకూ బాగానే వర్కవుట్ అయ్యింది కానీ.. ఎలివేషన్ కాస్త అతి అనిపిస్తుంది. డైలాగ్స్ విషయంలో కూడా త్రివిక్రమ్ ప్రాసలు తగ్గిస్తే బెటర్ అనే భావన కలుగుతుంది.

ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకుడు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆల్మోస్ట్ అందరూ త్రివిక్రమే దర్శకుడు అనే భావనలో ఉన్నారు. సదరు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మొత్తంలో త్రివిక్రమ్ మార్కే కనిపించినప్పటికీ.. పవన్-రానా మధ్య వచ్చే సన్నివేశాల్లో తన మార్క్ ప్రూవ్ చేసుకోగలిగాడు సాగర్. పవన్ కి ఇచ్చిన సింపుల్ ఎలివేషన్స్ బాగున్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాను మబ్బులా కమ్మేయడానికి ప్రయత్నించినా.. తనదైన శైలితో ఆ మబ్బు నుండి బయటపడ్డాడు సాగర్.

విశ్లేషణ: పవన్ కళ్యాణ్ నుండి ఫ్యాన్స్ కోరుకుంటున్న కరెక్ట్ సినిమా “భీమ్లా నాయక్”. పవన్ ను దేవుడిలా చూపించే కొన్ని ఎలివేషన్స్ పక్కన పెడితే సినిమా మొత్తం మాస్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజన్స్, రానా పెర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్ కోసం “భీమ్లా నాయక్”ను తప్పకుండా చూడాలి. ఒరిజినల్ మూవీ చూసిన ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యే అవకాశాలున్నా.. ఇది తెలుగు కమర్షియల్ సినిమా అనే భావనతో చూస్తే మాత్రం కచ్చితంగా అలరించే చిత్రం “భీమ్లా నాయక్”.

రేటింగ్: 3.5/5 

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus