ఒక వ్యక్తి విజయానికి కొలమానం ఏంటీ అంటే అతని ప్రగతే అని చెబుతారు. అంటే జీవితంలో ఏం సాధించాడు, ఎంత సాధించాడు అనే దాని బట్టే ఆ వ్యక్తి ఎంత అభివృద్ధి చెందాడో చెప్పొచ్చన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? జీవితంలో ఏం చేయాలో తెలియక, ఏం చేసేది లేక ఒకానొక దశలో చనిపోదాం అనుకున్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన లైనప్ చూస్తే మీకే ఈ విషయం అర్థమైపోతుంది.
‘12ఏ రైల్వే కాలనీ’తో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. కొత్త నేపథ్యంలోని కథలకు సంగీతమిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న భీమ్స్.. ఈ సినిమాతో థ్రిల్లర్ జోనర్‌లోకీ వస్తున్నారాయన. ప్రేమకథలు, మాస్ కథలతో మంచిగానే పేరు తెచ్చుకున్న భీమ్స్ ఈ తరహాల కథలను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.
ఇక అసలు విషయానికొస్తే.. భీమ్స్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే చిరంజీవి – అనిల్ రావిపూడి ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఉంది. దీంతోపాటు రవితేజ – కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు. అలాగే అడివి శేష్ – మృణాల్ ఠాకూర్ ‘డెకాయిట్’, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ చేస్తున్నారు. శర్వానంద్ – సంపత్ నంది కొత్త సినిమా ‘భోగి’, విశ్వక్‌సేన్ – అనుదీప్ ‘ఫంకీ’ సినిమాలు ఉన్నాయి.
అలాగే సినిమాల సంగీతం గురించి భీమ్స్ మాటలు చూస్తే.. కథల నుండి సంగీతం పుడుతుందని నమ్ముతారట ఆయన. దర్శకుడి స్క్రిప్ట్‌కి తగ్గట్టుగా సంగీతం అందిస్తూ వస్తున్నారట. దర్శకుడు, హీరో, నిర్మాతతో తన మొదట ప్రయాణం మొదలవుతుందని చెప్పారు. జనంతోనే నాకు అనుబంధం. వాళ్లకు ఎలాంటి పాటలు నచ్చుతాయో అలాంటి పాటలే ఇవ్వాలని అనుకుంటాను. అందుకే జనం నుండి వచ్చిన పాటలా నా బాణీ ఉంటుందని భీమ్స్ చెప్పారు. అయితే పాటలోని భాష ఎక్కడా నలిగిపోకూడదని, భాష ఔన్నత్యం దెబ్బ తినకూడదనే ఎప్పుడూ అనుకుంటూ ఉంటా అని చెప్పారు.