బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా అంటే బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అనే మాట ఆటోమేటిగ్గా వచ్చేస్తోంది. అంతలా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర ప్రభావం చూపించాయి. ఇప్పటికే ఇద్దరూ కలసి హ్యాట్రిక్ కొట్టగా.. ఇప్పుడు మరో హ్యాట్రిక్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అదే ‘అఖండ 2: తాండవం’. డిసెంబరు 5న సినిమాను రిలీజ్ చేయనున్న నేపథ్యంలో చిత్రబృందం ఇప్పటికే ప్రచారం పనులు స్టార్ట్చేసింది. ఇటీవల ఓ ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ గురించి బోయపాటి తనదైన శైలిలో ఎలివేషన్లు ఇచ్చారు.
బోయపాటి ఎలివేషన్లు వింటుంటే ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ సినిమా కోసం బాలయ్య పెద్ద పెద్ద రిస్కులే చేస్తున్నారట. మొదటి పాట ముంబయి వేదికగా విడుదల చేసిన టీమ్ రెండో పాట విశాఖపట్నంలో ఈవెంట్ పెట్టి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగానే బోయపాటి ఈ ఎలివేషన్లు ఇచ్చారు. అయితే ఈ సినిమా గురించి కాదు గతంలో తెరకెక్కించిన ‘లెజెండ్’ సినిమా గురించి. ఆ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరిగినప్పుడు ఏమైంది అనేది చెప్పుకొచ్చారు బోయపాటి.
విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మేం ఇక్కడ ‘లెజెండ్’ సినిమా షూటింగ్ చేశాం. గుర్రం మీద స్వారీ చేసే సీన్ అప్పట్లో షూట్ చేశాం అని గుర్తు చేసుకున్నారు బాలయ్య. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ బోయపాటి.. అప్పుడు గుర్రం మీద స్వారీ చేయాలి అని చెప్పినప్పుడు చేసేద్దాం దానిదేముంది అని బాలయ్య అన్నారని గుర్తు చేశారు.
అయితే స్వారీ చేస్తూ ఒక అద్దాన్ని గుద్దాలి అని చెబితే.. డూప్ లేకుండా, ఆఖరికి డూప్లికేట్ అద్దం లేకుండా బాలయ్య ఆ సీన్ రియల్‌గా చేశారు అని బోయపాటి తెలిపారు. ఆ సీన్ తీసేటప్పుడు ఆ గుర్రం గంటకి 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది అని బోయపాటి చెప్పుకొచ్చారు. మరిప్పుడు ‘అఖండ 2: తాండవం’ కోసం బాలయ్య ఇంకేం చేశాడో మరి.