గతంతో పోల్చుకుంటే టాలీవుడ్ హీరోల ఇమేజ్ ఎల్లలు దాటుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం ఇతర పరిశ్రమలో గుర్తింపు లేక తమ చిత్రాల విడుదల తెలుగు భాషకే పరిమితం చేశేవారు. ప్రతిభ గల దర్శకులు, అందుబాటులోకి వచ్చిన సాంకేతికత కారణంగా ఇతర పరిశ్రమలలోకి మన చిత్రాలు వెళుతున్నాయి. క్వాలిటీ కంటెంట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు ఇతర భాషలో కూడా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుండి ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ ఎన్టీఆర్, రాణా లాంటి వారు ఇతర పరిశ్రమల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
బాహుబలి చిత్రంతో ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు రాగా, మహేష్ కి తమిళంలో, బన్నీకి మలయాళం లో, ఎన్టీఆర్ కి కన్నడలో మంచి గుర్తింపు ఏర్పడింది. దీనితో వీరిని అనేక జాతీయ సంస్థలు తన ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా నియమించుకుంటున్నారు. మహేష్ అనేక వాణిజ్య ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు. ఎన్టీఆర్ పార్లీ ఆగ్రో వారి శీతల పానీయం ఆప్పీ ఫిజ్ కి సౌత్ ఇండియా స్థాయిలో ప్రచార కర్తగా ఉన్నారు. ఇక ప్రభాస్, బన్నీ, రాణా కూడా అనేక ప్రకటనలలో కనిపిస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ హీరోలు బ్రాండ్ అంబాసిడర్స్ గా చాలా అరుదుగా కనిపించేవారు. అనేక భాషలలో చిత్రాలు విడుదల చేయడం ద్వారా మన హీరోల బ్రాండ్ వాల్యూ పెరిగిపోతుంది. అందుకే జాతీయ సంస్థలు సైతం బ్రాండ్ అంబాసిడర్స్ గా మన హీరోలను నియమించుకుంటున్నాయి.