నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘ఎం.ఎల్.ఎ’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత టి.జి.విశ్వప్రసాద్. ఆ తర్వాత ‘గూఢచారి’ ‘ఓ బేబీ’ ‘వెంకీ మామ’ ‘రాజ రాజ చోర’ ‘కార్తికేయ 2’ ‘ధమాకా’ వంటి హిట్లు అందుకుని టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఆ తర్వాత కూడా పెద్ద సినిమాలు చేశారు. కానీ అందులో ఎక్కువ శాతం సినిమాలు ప్లాప్ అయ్యాయి. బయ్యర్స్ కి భారీ నష్టాలు మిగిల్చాయి. ముఖ్యంగా 2023 ,2024 … ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ కి అస్సలు కలిసి రాలేదు.
వంద సినిమాలు తీయడమే లక్ష్యం అని చెప్పి ఫేడౌట్ అయిపోయిన దర్శకులకు ఛాన్సులు ఇచ్చి.. దాదాపు 300 కోట్లు నష్టపోయినట్టు ఓ టాక్ ఉంది. అంతేకాదు సినిమాల వల్ల ఎంప్లాయిస్ కి జీతాలు కూడా ఇవ్వలేక సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా ఎత్తేసే పరిస్థితి వాళ్ళది. అయినప్పటికీ గట్టిగానే నిలబడ్డారు అని చెప్పాలి. ప్రస్తుతం ‘పీపుల్ మీడియా..’ వారి చేతిలో ‘ది రాజాసాబ్’ ‘గూఢచారి 2’ వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి.
ఇటీవల వచ్చిన ‘మిరాయ్’ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్లు పైనే గ్రాస్ కలెక్ట్ చేసింది. మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ‘మిరాయ్’ విషయంలో విశ్వప్రసాద్ చాలా కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా వి.ఎఫ్.ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. మిడ్ రేంజ్ సినిమా అయినప్పటికీ క్వాలిటీ పరంగా ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు.
ముఖ్యంగా రూ.60 కోట్ల బడ్జెట్ కి… రూ.100 కోట్ల సినిమా విజువల్స్ ఉండటంతో ప్రేక్షకులు ఫుల్ శాటిస్ఫై అయ్యారు. తమ టికెట్ కి న్యాయం జరిగింది అనుకున్నారు. ఇప్పుడు ‘రాజాసాబ్’ విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఈ సినిమా తమను నష్టాల నుండి బయటపడేస్తుంది అని విశ్వప్రసాద్ ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. అందుకే డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన ‘రాజాసాబ్’ ని 2026 సంక్రాంతికి తీసుకెళ్లారు.
ఇంకా లేట్ అయినా పర్వాలేదు.. కానీ క్వాలిటీ ఔట్పుట్ తోనే ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయ్యారు విశ్వప్రసాద్. అది కనుక హిట్ అయితే.. వాళ్ళ దశ తిరిగినట్టే అని చెప్పాలి.