బిగ్ బాస్ 4 మొదటి వారం హైలైట్స్: హుషారుగా మొదలై… ఇంట్రెస్టింగ్ గా ముగిసింది!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్లో తొలి వారం ముగిసింది. గ్రాండ్‌ లాంఛింగ్‌ ఎపిసోడ్‌తో మొదలైన నాలుగో సిరీస్‌… సోమవారం నుంచి ఆదివారం వరకు ఫన్‌గా సాగింది. రకరకాల టాస్క్‌లు అలరించాయి. ఇంట్రెస్టింగ్‌గా మొదలైన కట్టప్ప టాస్క్‌… బోర్డ్‌గా సాగి.. లాస్ట్‌కి ట్విస్ట్‌తో సూపర్‌ అనిపించింది. దాంతో లాస్య కెప్టెన్‌ అయిపోయింది. అన్నింటా జోక్యం చేసుకొని సూర్యకిరణ్‌ ఎలిమినేట్‌ అయిపోయాడు. ఇంకా ఈ వారం ఏం జరిగాయంటే?

తొలి రోజు…

* నాలుగో సీజన్‌ తొలి నామినేషన్‌ ప్రక్రియ జరగింది. మొత్తం ఏడుగురు నామినేట్‌ అయ్యారు. అభిజిత్‌, దివి, మెహబూబ్‌, సుజాత, గంగవ్వ, సూర్యకిరణ్‌, అఖిల్‌ నామినేట్‌ అయ్యారు.

* నైబర్‌ హౌస్‌లో ఉన్న సోహైల్‌ – ఆరియానా బిగ్‌బాస్‌ హౌస్‌కి ఫోన్‌ చేశారు. మీరు వంట వండి మాకు పంపండి, మీకు వచ్చిన నిత్యావసరాలు మాకు ఇవ్వండి అంటూ ఓ పెద్ద లిస్ట్‌ చెప్పారు. అదేదో బిగ్‌ బాస్‌ ఆర్డర్‌ అనుకుంటూ ఫోన్‌ ఎత్తిన సుజాత కంగారుపడింది. దానిపై చర్చ జరిగి, పెరిగి పెద్దదై కళ్యాణి – సుజాత మధ్య మాటల యుద్ధం జరిగింది.

రెండో రోజు…

* మార్నింగ్‌ మస్తీలో స్కూల్‌ కాన్సెప్ట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. హౌస్‌ నియమాలను వివరించేలా క్లాస్‌ ఏర్పాటు చేయించాడు. కరాటే కళ్యాణి టీచర్‌గా ఇంటి నియమాలు చెప్పే ప్రయత్నం చేసింది. ‘ఏంటి అవ్వ నువ్వు 50 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నావ్‌’ అని గంగవ్వతో కళ్యాణి అనగానే… ‘జీతం తీసుకొని నన్ను ఫెయిల్‌ చేస్తున్నావ్‌’ అంటూ పంచ్‌ వేసింది గంగవ్వ. ‘డబ్బులు తీసుకొని నన్ను పాస్‌ చేయకుండా ఇంటికెళ్లి వంట చేసి పడుకుంటున్నావ్‌’ అంటూ పంచ్‌కు కాస్త మసాలా యాడ్‌ చేసింది.

* నైబర్‌ హౌస్‌ నుంచి కాల్‌ చేసిన ఆరియానాకు నోయల్‌ షాక్‌ ఇచ్చాడు. ‘ఏదో పొరుగింటి వాళ్లు కదా అని మీకు ఫుడ్‌ పంపిస్తే ఇలా మాట్లాడతారా.. అంతగా కావాలంటే మా ఇంటికొచ్చి తినండి’ అని అన్నాడు. ఆరియానా ‘నీ పేరేంటి’ అని అడిగితే ‘గూగుల్‌ చేసుకో’ అంటూ నోయల్‌ ఝలక్‌ ఇచ్చాడు.

* ‘మీలో ఎవరు కట్టప్ప’ అనే విషయంలో బిగ్‌బాస్‌ ఓటింగ్‌ ఏర్పాటు చేశాడు. మెహబూబ్‌ అని నోయల్‌ చెప్పగా, నోయల్‌ అని దేవి నాగవల్లి ఓటేసింది. ఇక కట్టప్ప అంటే వెన్నుపోటే కాదు ప్రేమ అంటూ సూర్యకిరణ్‌ పేరును హరిక రాసింది. లాస్య పేరును దివి రాయగా, సూర్యకిరణ్‌ పేరును లాస్య రాసుకొచ్చింది. అఖిల్‌ కూడా నోయల్‌నే కట్టప్ప అని అనుకున్నాడు. అమ్మ రాజశేఖర్‌ పేరును అభిజిత్‌ రాశాడు. దీనిని నోయల్‌ పసిగట్టినట్లు కనిపించింది కూడా. మోనాల్‌ కూడా అమ్మ రాజశేఖర్‌ పేరే రాసింది. దివి స్టయిల్‌లోనే మెహబూబ్‌ కూడా లాస్య పేరు రాసుకొచ్చాడు. కళ్యాణి, అమ్మ రాజేఖర్‌, సుజాత, సూర్యకిరణ్‌ అయితే అఖిల్‌ ను కట్టప్ప అనుకున్నారు. ఆఖరికి గంగవ్వ కూడా అఖిల్‌ పేరునే రాయమని చెప్పింది.

మూడో రోజు…

* నైబర్‌ హౌస్‌లోని సోహైల్‌ – ఆరియానా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రావడంతో మూడో రోజు మొదలైంది. అందరినీ హాల్‌లో కూర్చోబెట్టి సోహైల్‌ – ఆరియానా చర్చ ప్రారంభించారు. ‘ఈ రోజు మీరు మాకు ఫుడ్‌ పంపలేదు’ అంటూ మొదలైన గొడవ ‘గంగవ్వ టీ తాగలేదు’ అంటూ ఊపందుకొని… అనూహ్య మలుపులు తిరిగింది. నోయల్‌ చర్చను ముందుకు తీసుకెళ్తే… సోహైల్‌ హీటెక్కించాడు. మధ్యలో అభిజిత్‌ వచ్చి క్లారిటీ ఇవ్వాలని చూస్తే… సీన్‌ రివర్స్‌ అయ్యింది. ‘కలసిపోవాలని అనుకుంటే అలాంటి యాటిట్యూడ్‌ మంచిది కాదు’ అని అభిజిత్‌ సోహైల్‌కు సూచించాడు. ‘ఫోన్‌ ఎందుకు కట్‌ చేశారు’ అంటూ సోహైల్‌ పదే పదే అనేసరికి.. అభిజిత్‌ వాయిస్‌ రెయిజ్‌ చేశాడు. ‘మీరు ఇలా అంటుంటే 14 మంది ఎందుకు చూస్తూ ఊరుకుంటారు’ అంటూ ప్రశ్నించాడు.

* గంగమ్మ ఉదయాన్నే జిమ్‌ ఏరియాకొచ్చింది. డంబెల్స్‌ తీసుకొని ఎక్సర్‌సైజ్‌లు చేయడం ప్రారంభించింది. డంబెల్స్‌ను పది సార్లు పైకెత్తింది. 58 ఏళ్ల వయసులో డంబెల్స్‌ ఎత్తడం మామూలు విషయం కాదు కదా. ఎక్సర్‌సైజ్‌ అయిపోయాక బిగ్‌బాస్‌కు గంగవ్వ ఓ ముద్దు కూడా పెట్టింది.

నాలుగో రోజు…

* దివితో ఓపెన్‌ హార్ట్‌ విత్‌ పార్టిసిపెంట్‌ నిర్వహించాడు. హౌస్‌ మేట్స్‌లో ఏ మార్పు వస్తే బాగుంటుందని ఆమెతో అందరి ముందు చెప్పించారు. అఖిల్‌ తన మోడల్‌/యాక్టర్‌ యాటిట్యూడ్‌ వాక్‌ను మార్చుకుంటే బాగుంటుందని దివి సజెస్ట్‌ చేసింది.అభిలో కొంచెం కోపం కనిపిస్తోంది… దానిని తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పింది. ‘నువ్వు చాలా సెన్సిటివ్‌’ అంటూ లాస్యను దివి అనింది. ఎవరినైనా సంబోధించినప్పుడు ఎలా మాట్లాడాలో హారికకు సూచించింది. మోనాల్‌ హైపర్‌ యాక్టివ్‌… అన్నింటా పార్టిసిపేట్‌ చేస్తుంది. అయితే చిన్న విషయానికే ఏడ్చేస్తోంది.

దేవి నాగవల్లి హైలో ఉంటూ ఒక్కసారిగా లో అయిపోతారు. అలా కాకుండా మోడరేట్‌గా ఉంటే బాగుంటుందని సజెస్ట్‌ చేసింది. నోయల్‌ షో స్టైల్‌ను పూర్తిగా మైండ్‌లో పెట్టుకుని హౌస్‌ మేట్స్‌ను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తోందని దివి చెప్పింది. ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఓవర్‌ రియాక్ట్‌ అవుతున్నారని కళ్యాణి గురించి సజెస్ట్‌ చేసింది. ‘మీరు అందరినీ చదివేశారు…’ అని సూర్యకిరణ్‌ను పొగిడేసింది దివి. హౌస్‌ మొత్తంలో మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌ అమ్మ రాజశేఖర్‌ అని చెప్పింది. అయితే కొన్ని కుల్లు జోకులు మాత్రం వేయొద్దు అని చెప్పింది.

* హౌస్‌ మేట్స్‌ గురించి తన అభిప్రాయాన్ని గంగవ్వ చెప్పడం ప్రారంభించింది. ‘పని చేస్తావ్‌, నవ్వుతావ్‌, ఏడుస్తావ్‌’ అంటూ కళ్యాణకి పంచ్‌ వేసింది గంగవ్వ. సుజాత కూడా కళ్యాణిలానే చేస్తోందట. అమ్మ రాజశేఖర్‌ అయితే ఆడతాడు, నవ్వుతాడు, నవ్విస్తాడు, సరదాగా ఉంటాడని గంగవ్వ చెప్పింది. మెహబూబ్‌ అయితే యాపిల్‌ తినుకుంటా మంచిగా ఉంటాడని చెప్పింది. నోయల్‌ అయితే కాళ్లు నొప్పి అంటాడు.. వెంటనే మందులేసుకొని మళ్లీ హుషారు అయితడు అని అంది గంగవ్వ. అభిజిత్‌ అయితే మంచిగా పాత్రలు తోముతాడు, కడుగుతాడు అని మెచ్చేసుకుంది గంగవ్వ. సూర్యకిరణ్‌ ఇంట్లో వాళ్లందరికీ పెద్ద భూస్వామి అని బిరుదు ఇచ్చింది గంగవ్వ.

దేవిని ‘దేవక్క’ అంటూ సెటైర్‌ వేసి… ‘చేతగాకపోయినా అందరినీ కలుపుకుంటూ పోతుంది’ అని చెప్పింది. ఇంట్లో ఉన్న కొడుకును గుర్తు చేసుకుంటూ బొమ్మను ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తుంటది లాస్య అని చెప్పింది గంగవ్వ. ఆయిల్‌ పడకపోయినా మోనాల్‌ వంట చేసిందని మెచ్చుకున్న గంగవ్వ… దివి గురించి కూడా బాగానే చెప్పింది. నాకు బాగా హెల్ప్‌ చేస్తది అని చెప్పుకొచ్చింది. హారిక అయితే ఇంకా వంట గదికే పోలేదు అని సెటైర్‌ వేసిన గంగవ్వ… అఖిల్‌ను ‘గవర్నమెంట్‌ అఖిల్‌’ అని పంచ్‌ వేసింది. సోహైల్‌ని పంచాయతీదారు అని అంది గంగవ్వ.

ఐదో రోజు…

* భోజనం సమయంలో పులిహోర కార్యక్రమం జరిగింది. దివిని నువ్వు నా హీరోయిన్‌, నేను నా హీరో అంటూ అమ్మ రాజశేఖర్‌ పులిహోర కలిపేశాడు. అయితే ఆఖరులో భార్య గుర్తొచ్చి… ఇదంతా బిగ్‌బాస్‌ హౌస్‌ కోసమే అంటూ కవర్‌ చేసేశాడు. అయితే అది అక్కడితో ఆగకుండా… ‘పులిహోర’ మాయలో ఉండిపోయి కూర కోసం సిద్ధం చేసిన ఆయిల్ కలాయిలో టీ పొడి వేసేశాడు.

* ‘మీలో ఎవరు కట్టప్ప’ అనే కాన్సెప్ట్‌పై ఈ రోజు స్టాంప్‌ గేమ్‌ ఆడించాడు. మీకు కట్టప్ప అనిపించేవారి ముఖంపై కట్టప్ప స్టాంప్‌ వేయమన్నారు. లాస్యను కట్టప్ప అని అఖిల్‌, మెహబూబ్‌ అన్నారు. లాస్య, హారిక వచ్చి సూర్యకిరణ్‌పై కట్టప్ప స్టాంప్‌ వేశారు. సోహైల్‌ వచ్చి అఖిల్‌కి స్టాంప్‌ వేశాడు. అమ్మ రాజశేఖర్‌ను కట్టప్ప అని మోనాల్‌ అనుకుంది. దివి, అమ్మ రాజశేఖర్‌, ఆరియానా, దేవి నాగవల్లి దృష్టిలో నోయల్‌ కట్టప్ప అయ్యాడు. టాస్క్‌ల విషయంలో నోయల్‌ కట్టప్పలా వ్యవహరించాడని వాళ్లు కట్టప్పను చేశామని చెప్పారు. నోయల్‌ అమ్మ రాజశేఖర్‌ మీద వేశాడు. సూర్యకిరణ్‌ వచ్చి నోయల్‌ కే స్టాంప్‌ వేశారు. కళ్యాణి సూర్యకిరణ్‌కే స్టాంప్‌ వేసింది. సుజాత, అభిజిత్‌ కూడా లాస్యకే కట్టప్ప స్టాంప్‌ వేశారు.

ఆరో రోజు

* సేఫ్‌ అయినవాళ్ల వివరాలు చెప్పేలా నాగ్‌ గేమ్‌ ఆడించారు. కొన్ని మెడల్స్‌ ఇచ్చి ఎవరి మెడలో వేస్తారా అని ఆరియానా – సోహైల్‌ని అడిగారు. సుజాత మెడలో ఊసరవెల్లి మెడల్‌ వేశారు. దివికి కాకరకాయ బ్యాడ్జ్‌ వేశారు. అఖిల్‌కు రొమాంటిక్‌ మెడల్‌ ఇచ్చారు. కళ్యాణికి అగ్గిపెట్టె మెడల్‌ ఇచ్చారు. డ్రమటిక్‌గా మాట్లాడుతోందని హారికను డ్రామా క్వీన్‌ చేశారు. సూర్యకిరణ్‌కు బద్దకం ట్యాగ్‌ ఇవ్వగా, అభిజీత్‌ను చెత్తకుండి ట్యాగ్‌ ఇచ్చారు. నోయల్‌ లౌడ్‌ స్పీకర్‌ అయ్యాడు. గంగవ్వకు తోపు ట్యాగ్‌ రాగా, దేవీ నాగవల్లికి పర్‌ఫెక్ట్‌ ట్యాగ్‌ వచ్చింది. మోనాల్‌కు క్రై కిడ్‌, మెహబూబ్‌కు మిర్చి ట్యాగ్‌, లాస్యకు బకరా ట్యాగ్‌ ఇచ్చారు. అమ్మ రాజశేఖర్‌కు జోకర్‌ ట్యాగ్‌ ఇచ్చారు.

* కట్టప్ప స్కిట్‌కు నాగ్‌ బంపర్‌ హిట్‌ క్లైమాక్స్‌ ఇచ్చాడు. లాస్య, సూర్యకిరణ్‌, నోయల్‌, అమ్మ రాజశేఖర్‌, అఖిల్‌ను నిలబెట్టి ఎవరిని ‘కట్టప్ప’ చేస్తారు అని మరోసారి అడిగాడు. ఆరు ఓట్లతో లాస్యను కట్టప్పగా ఇంట్లో వాళ్లు ఫిక్స్‌ చేశారు. అయితే ఇక ఆమెనే కట్టప్ప అనుకుంటున్న సమయంలో నాగ్‌ ట్విస్ట్‌ చేశాడు. అసలు ఇంట్లో కట్టప్పనే లేడని… మీలో ఉన్న అనుమానమే కట్టప్ప అని తేల్చేశాడు. లాస్యను వెరైటీగా ఈ వారానికి ఇంటి కెప్టెన్‌ని చేశారు.

* ‘బిగ్‌బాస్‌ ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి’ అంటూ ‘ఫిల్మీ ఫోకస్‌’ ముందుగా చెప్పిన అభిజీత్‌ ఫస్ట్ సేఫ్‌ అయ్యాడు. ప్రేక్షకులు అత్యధిక శాతం ఓట్లు వేయడంతో అభిజీత్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. ఆ తర్వాత సుజాతను సేఫ్‌ చేశారు. మూడో సేఫ్‌ అయిన పర్సన్‌ నేమ్‌ అందరూ ఊహించిన పేరు గంగవ్వ.

ఏడో రోజు…

* ఇంట్లోంచి బయటకు వెళ్లేవారిని ఆనందంగా పంపేలా… ఈ రోజు ఆట, పాటల్ని నిర్వహించాడు బిగ్‌బాస్‌. గార్డెన్‌ ఏరియాలో బాయ్స్‌ అండ్‌ గాళ్స్‌ జుగల్బందీ నిర్వహించారు. ప్రతిపాటకు ఒక బాయ్‌, గాళ్‌ డ్యాన్స్‌ చేశారు. మొత్తం గాళ్స్‌కి 91 పాయింట్లు రాగా, బాయ్స్‌కు 88 పాయింట్లు వచ్చాయి. అలా గాళ్స్‌ ఈ రోజు జుగల్బందీలో గెలిచారు.

* సూర్యకిరణ్‌ ఇంట్లో ఉన్నవాళ్ల గురించి చెప్పడానికి ఓ గేమ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. ఏ జంతువుకు ఎవరికి రిలేటడ్‌ అని తెలిపే గేమ్‌ అది. అందులో మోనాల్‌ను నెమలితో పోల్చాడు సూర్యకిరణ్‌. గంగవ్వను చీమతో పోల్చగా, దేవిని మొసలి అన్నాడు. సోహైల్‌ను ఎలుకతో పోల్చాడు. అభిజిత్‌ను పిల్లిగా అభివర్ణించాడు. ఇక దివిని తాబేలుతో పోల్చగా, కళ్యాణిని కోతి అన్నాడు. మెహబూబ్‌ను గద్ద అనగా, హారికను పాముతో పోల్చాడు. సుజాతను శునకం అంటూ, నోయల్‌ను నక్కతో పోల్చాడు. లాస్యకు గాడిద అని ట్యాగ్‌ ఇవ్వగా, ఆరియానాను గుడ్ల గూబ చేశాడు. అఖిల్‌ను దున్నపోతుతో పోల్చి, అమ్మ రాజశేఖర్‌ను సింహంతో పోల్చాడు.

* ఈ రోజు వైల్డ్‌ కార్డు ఎంట్రీ కూడా జరిగింది. కమెడియన్‌గా ఇప్పటికే అందరికీ పరిచయమైన కుమార్‌సాయి అలియాస్‌ సాయికుమార్‌ పంపన ఈ రోజు వైల్డ్‌ కార్డు ఎంట్రీగా వచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus