బ్లఫ్ మాస్టర్

  • December 28, 2018 / 07:14 AM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టిన సత్యదేవ్ అనంతరం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన “జ్యోతిలక్ష్మి” చిత్రం ద్వారా కథానాయకుడిగానూ మెప్పించాడు. మళ్ళీ కొంత విరామం అనంతరం కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బ్లఫ్ మాస్టర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో మంచి సక్సెస్ అందుకున్న “శతురంగ వేట్టై”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి “రోమియో” ఫేమ్ గోపీగణేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆ ట్రైలర్ లోని డైలాగ్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొని ఉండడంతో.. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ : ఆకాష్ అలియాస్ ఉత్తమ్ కుమార్ ఇలా చాలా పేర్లు కలిగిన ఒక ఘరానా మోసగాడు మన కథానాయకుడు 9సత్యదేవ్). చిన్నప్పుడు తాను ఎదుర్కొన్నా సమస్యల కారణంగా కష్టపడి పనిచేయడం కంటే.. మోసం చేయడం సులభమని తెలుసుకొని.. రకరకాల పేర్లు మార్చుకుంటూ, జనాల్ని చిత్రవిచిత్రమైన స్కీములతో మోసం చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. ఒకానొక సందర్భంలో పోలీసులకు దొరికిన ఉత్తమ్ కుమార్ చేసిన మోసాలు చూసి జడ్జ్ కూడా ఆశ్చర్యపోతాడు. తాను మోసం చేసి సంపాదించిన కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఆ కేసుల నుంచి సునాయాసంగా బయటపడిన ఉత్తమ్.. ఒక రౌడీ గ్యాంగ్ కు దొరుకుతాడు.

ఉత్తమ్ తెలివిని వాడుకొని వాళ్ళు కూడా కోట్ల రూపాయలు సంపాదించాలనుకొంటారు. కానీ.. ఎప్పుడూ అదృష్టం మన వెంట ఉండదు కాబట్టి.. ఉత్తమ్ కుమార్ తాను మోసగించినవాళ్లకే దొరికిపోయి తన్నులు తింటాడు. ఆ దెబ్బలతోనే తనను ప్రేమించిన అవని కంటపడతాడు. ఉత్తమ్ మారడానికి అవని సహాయపడుతుంది. కానీ.. మారిన ఉత్తమ్ ను ఈ సమాజం బ్రతకనిచ్చిందా? లేదా? ఉత్తమ్ మోసాలు చేయకుండానే బ్రతకగలిగాడా? అనేది “బ్లఫ్ మాస్టర్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు : సత్యదేవ్ అద్భుతమైన పొటెన్షియల్ ఉన్న నటుడు అనే విషయం అందరికీ తెలిసిందే. తనకు దొరికిన చిన్న చిన్న పాత్రల్లోనే తన నట ప్రతిభను కనబర్చిన సత్యదేవ్.. ఈ చిత్రంలోని బ్లఫ్ మాస్టర్ అనే టైటిల్ రోల్ కు వంద శాతం న్యాయం చేశాడు. సత్యదేవ్ ఇంటెన్సిటీతో డైలాగ్స్ చెబుతుంటే సినిమాలోని పాత్రధారులు మాత్రమే కాదు.. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు కూడా అది నిజమేనేమో అని నమ్మేసేంతలా సత్యదేవ్ ప్రెజన్స్ తో మ్యాజిక్ చేశాడు.

నెగిటివ్ రోల్లో ఆదిత్య మీనన్ విలనిజాన్ని డీసెంట్ గా పండించగా.. సపోర్టింగ్ రోల్లో సిజ్జు మంచి సపోర్ట్ ఇచ్చాడు. నందితశ్వేత అమాయకురాలిగా కనిపించడం కోసం నటించాను అనుకుంటూనే అతి చేసింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాల్తో కేవలం కళ్ళతోనే భావాలు పలికించిన అమ్మాయేనా ఈమె అనుకొనేలా నటనతో చిరాకెత్తించింది.

టెంపర్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో అలరించిన నటుడు ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది.

సాంకేతికవర్గం పనితీరు : సునీల్ కశ్యప్ పాటలకంటే నేపధ్య సంగీతం బాగుంది. సన్నివేశంలోని ఇంటెన్సిటీని తన నేపధ్య సంగీతంతో హైలైట్ చేశాడు సునీల్ కశ్యప్. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కలరింగ్ & లైటింగ్ విషయంలో తీసుకొన్న జాగ్రత్తల వల్ల సినిమాకి ఒక క్రైమ్ థ్రిల్లర్ లుక్ వచ్చింది.

దర్శకుడు గోపీగణేష్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ వరకూ బాగానే చేశాడు కానీ.. కాసిన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేది. 2014లో వచ్చిన ఒరిజినల్ వెర్షన్ లోని విషయాలను ఏమాత్రం మార్చలేదు. అందువల్ల సినిమా కాస్త అవుట్ డేటెడ్ గా అనిపిస్తుంది. కథనం అలాగే ఉంచి.. కథలో చిన్న చిన్న మార్పులు చేయాల్సింది. హీరో చేసే మోసాలన్నీ పాతవే.. కొత్తగా ఎగ్జైట్ చేసేవేమీ లేవు. దాంతో ప్రేక్షకుడు కాస్త బోర్ ఫీలవుతాడు. అయితే.. సగటు ప్రేక్షకుడికి ఈ సినిమాకి భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో రాడు కాబట్టి.. ఓవరాల్ గా టైమ్ పాస్ అయిపోతుంది.

విశ్లేషణ : 2018 చివరి శుక్రవారమైన ఈ రోజున ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా థియేటర్ కి వస్తే ఓ మోస్తరుగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా “బ్లఫ్ మాస్టర్”. నటుడిగా సత్యదేవ్ మాత్రం ప్రేక్షకుల్ని తన పాత్రతో బాగా ఎంగేజ్ చేస్తాడు.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus