ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న బాలీవుడ్ వార్ డ్రామా ‘బోర్డర్ 2’ సక్సెస్‌లో మన హైదరాబాద్ భాగస్వామ్యం ఉండటం స్పెషల్. ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ అందరూ ఇందులోని విజువల్స్ సౌండ్ క్వాలిటీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ స్థాయి అవుట్‌పుట్ వెనుక అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ అందించిన సాంకేతిక సహకారం ఎంతో ఉంది.
సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా, దీనికి ప్రాణం పోసే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరిగాయి. ముఖ్యంగా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ మాస్టరింగ్ వంటి కీలకమైన పనులను ఇక్కడి టెక్నికల్ టీమ్ హ్యాండిల్ చేసింది. దీనివల్ల థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి కలుగుతోంది. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి ఈ చిత్రాన్ని ఇక్కడ సిద్ధం చేశారు.
యుద్ధ ప్రాతిపదికన సాగే సన్నివేశాల్లో సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్లను దద్దరిల్లేలా చేస్తున్నాయి. గాలిలో యుద్ధ విమానాల సౌండ్, బాంబు పేలుళ్లు, తుపాకుల మోత వంటివి ప్రేక్షకులకు నేరుగా యుద్ధభూమిలో ఉన్న ఫీలింగ్‌ను ఇస్తున్నాయి. డాల్బీ అట్మాస్ టెక్నాలజీని అన్నపూర్ణ టెక్నీషియన్స్ పక్కాగా ఉపయోగించుకోవడంతోనే ఇది సాధ్యమైంది. అందుకే ఆడియో పరంగా ఈ సినిమాకు ఇప్పుడు నేషనల్ లెవల్‌లో ప్రశంసలు దక్కుతున్నాయి.
కేవలం సౌండ్ మాత్రమే కాకుండా విజువల్ క్వాలిటీలో కూడా అన్నపూర్ణ స్టూడియోస్ తన ముద్ర వేసింది. డాల్బీ విజన్ ద్వారా కలర్ గ్రేడింగ్, క్లారిటీని అద్భుతంగా తీర్చిదిద్దారు. రాత్రిపూట జరిగే యుద్ధ సన్నివేశాల్లో కూడా ప్రతి ఫ్రేమ్ చాలా స్పష్టంగా, డెప్త్‌తో కనిపిస్తోంది. యుద్ధ సమయంలో వచ్చే పొగ, మంటల ఎఫెక్ట్స్‌ను రియలిస్టిక్‌గా చూపించడంలో ఇక్కడి టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు ఇలాంటి టెక్నికల్ పనుల కోసం బాలీవుడ్ మేకర్స్ విదేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు మన హైదరాబాద్‌లోనే అంతర్జాతీయ స్థాయి వసతులు అందుబాటులోకి వచ్చాయని ‘బోర్డర్ 2’ నిరూపించింది.