అదేదో సినిమాలో నువ్వు గోల్ కొడితే నేను సెంటర్‌లో బట్టలిప్పి తిరుగుతా.. అని హీరో బెట్ కాసినట్లు.. ఇప్పుడు ఓ సినిమా డైరక్టర్ లాంటి స్టేట్‌మెంటే ఇచ్చారు. అయితే ఇక్కడ అర్ధనగ్నంగా తిరుగుతా అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ అంటూ ఓ సినిమా ఈ నెల 21న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈటీవీ విన్ ఒరిజినల్స్‌గా రూపొందిన ఈ సినిమా దర్శకుడు సాయిలు కంపాటినే ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
తమ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తాను అర్ధనగ్నంగా అమీర్‌పేట్ సెంటర్‌లో తిరుగుతానని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు సాయిలు కంపాటి. తమ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమానే దీనికి కారణమని చెప్పారాయన. అఖిల్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి తెరకెక్కించిన చిత్రమిది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు ఈ మేరకు కామెంట్స్ చేశారు. 15 ఏళ్లు ఒక జంటకు నరకం చూపించిన కథను మీ ముందుకు తీసుకువస్తున్నా. మీకు నచ్చకపోతే వదిలేయండి.. అంతేకానీ నెగెటివ్‌గా మాట్లాడకండి అని ఆయన కోరాడు.
మరోవైపు పైరసీపై పోరాటంలో భాగంగా ఈటీవీ విన్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా టికెట్ ధరను రూ.99కి తగ్గించింది. సింగిల్ థియేటర్లలో ఈ ధర ఉంటుంది. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.105 ఉంటుంది. ఐ బొమ్మ ఇమంది రవి అరెస్టు తర్వాత సినిమా టికెట్ ధరలు, థియేటర్లలో పాప్‌కార్న్ ధరల గురించి డిస్కషన్ నడుస్తోంది. ధరలు తగ్గితే థియేటర్లకు వస్తాం అంటున్నారు. అందుకు తాము ధరల తగ్గించేశాం అని చెప్పారు సాయికృష్ణ. సినిమా టీమ్ తమ చిత్రం మీద ఎంత నమ్మకం పెట్టుకోకుంటే ఇలాంటి కామెంట్స్ వస్తాయి చెప్పండి. చూద్దాం మరి సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో.