అరగుండు, ఖాన్‌దాదా, బాబీ, జిలేబీ, కిల్‌బిల్ పాండే, ఇన్‌స్పెక్టర్ పద్మనాభసింహ.. వంటి ఎన్నో వందల పాత్రల ద్వారా కొన్ని ఏళ్ళ పాటు హాస్య నటుడు బ్రహ్మానందం నవ్వించారు… నవ్విస్తున్నారు. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు.. రికార్డులున్నాయి. సన్మానాలు, సత్కారాలున్నాయి. తాజాగా మరో అరుదైన గౌరవాన్నీ బ్రహ్మానందం స్వీకరించబోతున్నారు. అలనాటి కాకతీయ సామ్రాజ్య కళావైదుష్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సారిగా రేపు (ఈ నెల 11న) మహబూబ్‌నగర్ జిల్లాలో “కాకతీయ కళావైభవ మహోత్సవాన్ని” నిర్వహిస్తున్నారు.
కాకతీయ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగున్న ఈ ఉత్సవంలో సినీ పరిశ్రమకు బ్రహ్మానందం చేసిన సేవకు గానూ “హాస్య నటబ్రహ్మ” బిరుదుతో సత్కరించనున్నారు. అతనితో పాటు ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు జయప్రద, రాజశేఖర్, జీవిత, బాబుమోహన్, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, కవిత, కేథరిన్, హింసానందిని, శ్రద్ధాదాస్, పృథ్వీ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డిలను “కాకతీయ పురస్కారాల”తో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి, మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి లు హాజరుకానున్నారు.