లాక్ డౌన్ సమయంలో ఓటీటీలకు డిమాండ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సబ్‌స్క్రిప్షన్లు కూడా బాగా పెరిగాయి. ఒకప్పుడు సినిమా థియేటర్లో రిలీజ్ చేసిన 45 రోజుల తరువాత కానీ ఓటీటీలో వచ్చేది కాదు. కానీ కరోనా కారణంగా కొత్త సినిమాలను కూడా నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇలా గత ఏడు నెలల్లో చాలా సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. డిజిటల్ రిలీజ్ అంటే ఇష్టపడని నిర్మాతలు సైతం ఓటీటీల్లో తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కలిగింది.
అయితే లాక్ డౌన్ వలన మూత పడిన థియేటర్లను మళ్లీ తెరుచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో నిర్మాతలు ఊరట చెందారు. అయితే ఓటీటీల హవా మాత్రం తగ్గలేదు. థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోయినా త్వరలోనే అక్కడ సినిమాలు నడుస్తాయని తెలిసినప్పటికీ ఓటీటీల్లో కొత్త సినిమాలు విడుదల కావడం ఆగలేదు. నెల రోజుల వ్యవధిలో ‘కలర్ ఫోటో’, ‘మిస్ ఇండియా’, ‘ఆకాశం నీ హద్దురా’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘మా వింత గాథ వినుమా’ ఇలా కొన్ని సినిమాలు ఓటీటీల్లో నేరుగా విడుదలయ్యాయి. దీంతో థియేటర్లు మొదలైనా.. ఓటీటీల జోరు తగ్గదేమోనని అనుకున్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారేలా ఉంది. తాజాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. ప్రేక్షకులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారు. సినిమా యావరేజ్ గా ఉన్నా.. బాగా ఆదరిస్తున్నారు. యాభై శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా బాగా ఆడుతుంటే ఇక పూర్తి స్థాయిలో థియేటర్లు నడిస్తే.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ థియేటర్ల వైపే నడుస్తాయి. థియేట్రికల్, డిజిటల్ రైట్స్ ను వేర్వేరుగా అమ్మితే వచ్చే ఆదాయం కంటే.. కేవలం డిజిటల్ రిలీజ్ ఒప్పందం చేసుకుంటే వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇకపై చిన్న సినిమాలు తప్పితే.. పేరున్న సినిమాలేవీ ఓటీటీల్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లు కనిపించడం లేదు.